మందు బాబులను మించిన విశ్లేషకులు లేరబ్బా!

Sharing is Caring...

ఉన్నట్లుండి పొద్దున్నే వర్షం మొదలైంది. రైతు బజారు నుంచి వస్తుండగా ఊహించని వాన ఊపందుకుంది. కనీసం గొడుగైనా చేతిలో లేకపోవడంతో గబాలున ఎదురుగా కనిపించిన ఆటో స్టాండు దగ్గరకు పరుగెత్తాను. వరుసగా పదికి పైగా ఆటోలు పార్క్ చేసున్నాయి. అందరు ఆటో డ్రైవర్లూ కలిపి రెండు ఆటోల్లో సర్దుకుని మాటా మంతీ ఆడుతున్నారు. సరిగ్గా వారి ఆటోల పక్కనే నేను నిల్చున్నాను. చేతిలో ఫోను లేదు. నెత్తిపై అడ్డు లేదు. ఇక చేసేదేముంది. చుట్టూ చూస్తూ ఉన్నాను. ఉన్నట్లుండీ ఆటోల్లో వారి మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఏంటబ్బా అని వినడం ప్రారంభించాను. ఆటో డ్రైవర్లు రెండు గ్రూపులుగా విడిపోయి రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారన్న విషయం అర్ధం అయ్యింది. అసలే మనది నారదుడి వారసత్వంతో వచ్చిన వృత్తిలో ఉన్నాం కదా. సరే ఓ చెవ్వు విసిరితే ఏం పోద్దిలే అనుకుని ఆసక్తిగా వినడం ఆరంభించాను.

అందులో ఒకడు జై జగన్ అంటున్నాడు. మా జగన్ ఏది చేసినా రైటే రా మీ బాబు లా కాదు. అంటున్నాడు. అవతలి వాడు నిజమే మా బాబు మీ వాడిలా కాదురా. విజనున్న వాడురా అంటున్నాడు. అందుకేనా 23 సీట్లే ఇచ్చారు. అన్నాడు మొదటి వాడు. ఒరే నీ యబ్బా నీకు రాజకీయాల గురించి తెలీదని నాకు అర్దం అయ్యింది. చరిత్ర తెలుసుకో. నీకు తెలుసా బీజేపీ పార్టీకి కేవలం 2 సీట్లు ఉండేవి. మరి ఇప్పుడో… అని రెండో వాడు కౌంటర్ ఇచ్చాడు. వీరిద్దరూ టీ ట్వంటీ మ్యాచులో ఫాం మీదున్న బ్యాట్స్ మెన్స్ లా చెలరేగిపోతున్నారు. వీరిద్దరి వాదనను ఆ ఆటో మిత్రులంతా ప్రేక్షకులుగా వీక్షిస్తున్నారు. నాకూ భలే ఆసక్తిగా అనిపించింది. నిజం చెప్పాలంటే రోజూ సీరియల్లుగా కొనసాగే మెయిన్ స్ట్రీం టీవీ ఛానెళ్లలో దిక్కుమాలిన డిస్కష్కన్ల కంటే మంచి రంజుగా ఉంది అనిపించింది. అందుకే మరికాస్త ఆసక్తిగా విన్నాను.

మొదటి వాడికి వేరే వాళ్లు సపోర్ట్ గా నిలిచారు. ఒరే మీ బాబు చేసిన గొప్పేంటో చెప్పరా అన్నారు. ఇవతలి వాడు అంటున్నాడు. సరే రా మా బాబు ఏదీ చెయ్యలేదు కదా. మరి మీ వోడు ఏటి చేస్తున్నాడో చెప్పరా అన్నాడు. రెండో వాడికి ఓ పెద్దాయన అనుకుంటా సపోర్ట్ గా మాట్లాడాడు. చెప్పురా చెప్పు అంటున్నాడు. మాటల యుద్ధం రాజుకుంది. ఆటో ఊగడం ప్రారంభించింది. మాటల స్థాయి నించి ఓ చిన్న స్థాయి వాగ్వాద వాతావరణానికి దారి తీసింది. ఆ గుంపులో వేరే వాడు చాణిక్యుడి పాత్రని పోషించాడు. అరే మాట్లాడండిరా.. అంతేగానీ ఎందుకు గొడవ. స్లో.. స్లో.. అన్నాడు. మళ్లీ చర్చ కొనసాగింది. ఏ పార్టీ ఏమేమి చేసింది. ఏమేమి చేస్తోందో ఇక ప్రవాహంలా ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఇంతలో ఒకడు ఎదురుగా ఉన్న టీ షాప్ వాడికి సైగ చేశాడు. నిముషం వ్యవధిలో టీలు ఆటో దగ్గరకు వచ్చాయి. అందులో వేరేవాడు దమ్ము ఎలిగించాడు. రీఫ్రెష్ అయ్యి నట్లున్నారు వారంతా.

వర్షం కూడా ఒత్తుకుంది. వారి మాటలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మద్యం పాలసీ దగ్గరకు వచ్చి ఆగాయి. చర్చ రసకందాయనంలో పడింది. అప్పటి వరకూ జగన్ గురించి గట్టిగా వాదించిన వాడు ఎందుకో గొంతు నెమ్మదించింది. రెండో వాడు చెప్పరా చెప్పు. అంటూ గట్టిగా అడుగుతున్నాడు. వంద రూపాయల మందు నాలుగొందలకు అమ్మడం న్యాయమా… అదీ మొత్తం స్పిరిట్ లా ఉండే మందు అమ్మడం రైటా… నీ పార్టీ, నా పార్టీ అని తేడా లేకుండా అందరూ తాగుతాం కదరా. అంతెందకు ఒకప్పుడు ఉండే మంచి బ్రాండు మందు దొరుకుంతుందా చెప్పు. గోల్డు మెడల్ మందా అలాంటి మందు పేరెప్పుడన్నా ఇన్నాం రా… నీ యబ్బా… చెప్పు నేయమేనా ఇలా దోపిడీ చెయ్యడం అని రెండో వాడు నిలదీస్తున్నాడు. ఎందుకో అప్పటి వరకూ దారాళంగా మాట్లాడిన మొదటి వాడు సైలెంట్ గా మారాడు. పోరా అందుకే కదరా నీలాంటి వాడి గోల వినపడే మా జగన్ రేటు తగ్గించాడురా. తెలుసుకో అన్నాడు. ఒరే ఎర్రోడా అసలు రేటెందుకు పెంచారు.

మందుని పూర్తిగా ఎత్తేస్తామని చెప్పారుకదా. మానేసారా… పిచ్చోడా… మందు అమ్మకం తగ్గిందా.. మొన్నే పేపర్లో చదివానురా మునుపటి కంటే ఎక్కుడ డబ్బులు పెబుత్వానికి వచ్చాయట తెలుసా… తాగేవోడు ఆపేడా.. లేదు కదా.. పెబుత్వాలకీ తెలుసురా. మన బలహీనత. అని టీవీ 5 మూర్తిలా, ఏబీఎన్ వెంకట కృష్ణలా, సాక్షి కొమ్మినేని శ్రీనివాసరావులా విశ్లేషణా చాతుర్యాన్ని కనపరచాడు రెండోవాడు. ఒరే నీకొకటి చెప్పనా… అమ్మ ఒడి పథకం డబ్బుల్ని నాన్న గొంతు తడి నుంచి లాగేత్తన్నాడురా.. తెలుసుకో నీ యబ్బా. అని రెండో వాడు పూనకం వచ్చినట్లు వాదిస్తున్నాడు. ఇంకా ఆగలేదు… ఇప్పుడు సడెన్ గా ఎందుకు మందు తగ్గించాడో తెలుసా… రేపో మాపో లోకల్ ఎలచ్చెన్లు వస్తున్నాయి. తగ్గించలేదనుకో మొత్తం సీన్ రివర్స్ అయిపోద్ది. మొన్న 150 సీట్లు ఇవ్వడం కాదు. కట్టగట్టి బంగాళాఖాతంలోకి ఇసిరేస్తారు. ఏటనుకున్నావ్. అని ఆటో దిగాడు. ఒరే నువ్వు ఎన్ని చెప్పురా మా జగనే గ్రేట్ రా. సరే సరే నువ్వు ఆ భ్రమల్లోనే ఉండు అంటూ ఇద్దరూ చెరో గ్రూపునేసుకుని దమ్ము కొట్టుకుంటూ ఎవరి ఆటోల దగ్గరకి వారు చేరుకున్నారు.వర్షం కాస్త నెమ్మదించింది. నేను నా కూరగాయల సంచీతో మా ఇంటికి చేరుకున్నాను.
గ్రౌండ్ రియాలిటి కథలు ఎపుడూ భిన్నంగా కనిపిస్తుంటాయి.

————  MNR

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!