ఆమె కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా !

Sharing is Caring...

Subramanyam Dogiparthi ……………………

నటీమణులు కన్నాంబ,సావిత్రి,వాణిశ్రీల తర్వాత ఎలాంటి పాత్రనైనా, ముఖ్యంగా విషాద పాత్రలను అవలీలగా చేయగల స్థాయికి జయసుధను తీసుకొనివెళ్ళిన సినిమా ఈ ‘జ్యోతి’.1976 జూన్ లో ఈ సినిమా విడుదలైంది. జయసుధ ‘పండంటి కాపురం’ సినిమాతో అరంగేట్రం చేసింది. ‘లక్ష్మణ రేఖ’ సినిమాలో రెబల్ రోల్,’ సోగ్గాడు’ సినిమాలో చలాకీ రోల్..చేసిన జయసుధ ఈ ‘జ్యోతి’ సినిమాలో అల్లరి పిల్లగా అలరించింది. ఓ ముసలివ్యక్తి భార్యగా బరువైన పాత్రలో నటించి శభాష్ అనిపించుకుంది .

ఆ తర్వాత అభినందించాల్సింది దర్శకేంద్రుడు రాఘవేంద్రుడినే. ఆయనకు ఇది రెండో సినిమా. ఈ సమస్యాత్మక కథని, నీట్ గా, తక్కువ బడ్జెట్ లో రాఘవేంద్రరావు తీయడం విశేషం.ఈ చిత్రాన్ని టి.క్రాంతికుమార్ నిర్మించారు..ఆయన అభిరుచులమేరకు రాఘవేంద్రరావు ఈ సినిమా హృద్యంగా తెరకెక్కించారు. తర్వాత కాలంలో అన్నమయ్య , రామదాసు వంటి భక్తిరస సినిమాలను కూడా తీయగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు . తండి కె యస్ ప్రకాశరావుకు తగ్గ తనయుడిగా పేరు గడించారు.

ఇక నిర్మాత క్రాంతికుమార్ శారద, ఊర్వశి వంటి మంచి సినిమాలను నిర్మించి ఓ ఇమేజిని సాధించుకున్నారు.మూడవ సినిమాగా ఈ జ్యోతి ని తీశారు. కుటుంబమంతా కలిసి ఈ సినిమాను చూడవచ్చు.ఈ సినిమా హిందీ సినిమా మిలీ కి రీమేక్ అనుకుంటారు. అది వాస్తవం కాదు. ప్రముఖ రచయిత్రి సి ఆనందారామం వ్రాసిన ‘మమతల కోవెల’ అనే నవల ఆధారంగా ఈ జ్యోతి సినిమా తీశారు.

టైటిల్ ‘మమతల కోవెల’ అని కాకుండా జ్యోతి అని పెట్టుకోవటంలోనే ఈ సినిమా టైటిల్ కేచీ అయింది..పాపులర్ అయింది..ఈ సినిమా ద్వారా సంభాషణల రచయిత సత్యానంద్ కి కూడా మంచిపేరు వచ్చింది. ఈ సినిమాతోనే ఆయనకు బ్రేక్ వచ్చిందని చెప్పుకోవచ్చు.తర్వాత కాలంలో రాఘవేంద్రరావుతో కలసి ఎన్నో సినిమాలకు మాటలు వ్రాసారు .

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో సినిమాలో ఉన్న నాలుగు  పాటలూ హిట్టయ్యాయి. సిరిమల్లె పువ్వల్లె నవ్వు , నీకూ నాకూ పెళ్ళంట , ఏడుకొండలపైన ఏల వెలిశావు , ఫస్ట్ టైం ఇది నీకు … పాటలన్నీ హిట్టయ్యాయి.అన్ని పాటల్నీ ఆత్రేయే వ్రాసారు.

మురళీమోహన్ , గుమ్మడి , సత్యనారాయణ , శుభ , కృష్ణకుమారి , ఫటాఫట్ జయలక్ష్మి , ఛాయాదేవి, గిరిబాబు , రావు గోపాలరావు ప్రభృతులు నటించారు. శంకరాభరణం శంకరశాస్త్రి గారు ఓ చిన్న పాత్రలో తళుక్కుమన్నారు. జయసుధ తర్వాత చెప్పుకోవలసింది గుమ్మడి , సత్యనారాయణ , రావు గోపాలరావులే. ముగ్గురూ అద్భుతంగా నటించారు. 

జయసుధకు ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది.  గుమ్మడికి ప్రత్యేక అవార్డు ఫిలిం ఫేర్ నుండి వచ్చింది .
బ్లాక్ అండ్ వైట్ లో రూపొందిన ‘జ్యోతి’ అప్పట్లో జనాదరణ పొందింది. ఎ.విన్సెంట్ ఛాయాగ్రహణ దర్శకత్వంలో కె.ఎస్. ప్రకాశ్ కెమెరా పనితనం ప్రేక్షకులకు నచ్చుతుంది.  

నాకెంతో ఇష్టమైన సినిమా ఈ జ్యోతి. యూట్యూబులో ఉంది. తప్పక చూడవలసిన సినిమా. ముఖ్యంగా జయసుధ అభిమానులు మిస్ కాకండి . చిన్న వయసులో ఇంత బరువైన పాత్ర వేసి మెప్పించటం గొప్ప విషయమే. దేవదాసు సినిమాలో ముసలి వాడిని పెళ్లి చేసుకున్న పార్వతి పాత్రలో నటించి మెప్పించిన సావిత్రి కూడా అప్పుడు చిన్న వయసుదే.అందుకే నా అభిప్రాయం కన్నాంబ, సావిత్రి,వాణిశ్రీల తర్వాత జయసుధే అని!

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!