ఎవరీ రాణి అబ్బక్క ?

Sharing is Caring...

 Su Sri ………………………..   She was a fighter who defeated the Portuguese

కంప్యూటర్లు రాని కాలంలో …. కమ్యూనికేషన్ లేని రోజుల్లో …. ఉల్లాల్ అన్నా, చౌతా అన్నా గుర్తొచ్చేది ఒకే ఒక్కరు…ఆమె పేరు అబ్బక్క ! అవును … ఆ కాలంలో పేర్లకు ఇంకా ఫ్యాషన్ బురద అంటలేదు.

అబ్బక్క…
మనసుతో గూగుల్ మ్యాప్ లో కర్నాటక తీరంలోని రేవు పట్టణం ఉల్లాల్ కి జూమ్ అవండి. ఉల్లాల్ వెళ్లాక టెమ్ మెషీన్ లో నాలుగొందల తొంభై ఐదేళ్లు  వెనక్కి వెళ్లండి. అప్పటి తీరాలను, అప్పటి ఊళ్లను, అప్పటి రాచరికాలను, అప్పటి యుద్ధాలను కళ్లముందు ఊహించుకోండి.  అప్పుడు సాక్షాత్కరిస్తుంది అబ్బక్క. 

తుళునాడు కి రారాజ్ఞిగా పోర్చుగీసు దోపిడీదారులను పదేపదే మట్టికరిపించిన పోరాటయోధురాలు అబ్బక్క మహాదేవి. కత్తియుద్ధం, గుర్రపుస్వారీలతో పాటు రాజకీయ వ్యవహారాలు, దౌత్యనీతిలో దిట్టగా వెలుగొందిన ధీర అబ్బక్క మహాదేవి. అటు కేరళ జామొరిన్ పాలకుడు, ఇటు మంగుళూరు మహరాజులు, మరోవైపు అహ్మద్ నగర్ నవాబులను కలుపుకుని ఒక స్వదేశ రక్షణ త్రికోణశక్తిని తయారుచేసి, ఆ త్రికోణానికి బిందువుగా నిలిచిన భారత భద్రతా శ్రీచక్రం…. అబ్బక్క మహాదేవి.

1525 లో మూడబిద్రి లో పుట్టిన అబ్బక్క ‘చౌతా’ కుటుంబానికి చెందిన జైన మతస్తురాలు. వంశాచారం ప్రకారం మామ తిరుమల రాయని రాజ్యానికి రాణి అయింది ఆమె. జైన మతానుయాయురాలైనా రంగులు మారే రుద్ర శిలతో తీర ప్రాంతాన ఒక అద్భుత శివలింగాన్ని ఏర్పాటు చేసి, గుడి కట్టించింది ఆమె.

జనరంజక పరిపాలన, దూరదృష్టి, సమర్థ నేతృత్వాలతో ఆమె రాజ్యం అలరారుతూండేది. ఉల్లాల్ మసాలా దినుసుల ఎగుమతికి పేరెన్నిక కన్న ఊరు. ఆమె భర్త లక్ష్మణప్ప మంగుళూరుకి రాజు. కానీ రుద్రమదేవిలాగానే అబ్బక్కకీ, ఆమె భర్తకీ పడిరాలేదు. ఆమె జైనమతస్తురాలు. భర్త శైవ మతావలంబి. (రుద్రమదేవి విషయంలో ఇది తిరగబడింది. ఆమెది శైవం. భర్తది జైనం)

అవి భారత్ పై తెల్లయూరోప్ నల్లమేఘమై ముసురుకుంటున్న రోజులు… పోర్చుగీసు వాళ్లు పడమటి తీరాన భారత సూర్యుడిని దిగముంచేందుకు యత్నిస్తున్నారు. అప్పటికే 1510 నాటికి గోమాంతక్ భూమి వారి వశమైంది. (గోమాంతక్ అన్నది పలకలేక గోవా అన్నారు. పోర్చుగీసులు పోయినా మనం మాత్రం గోవా అనే అంటున్నాం. ). ఇక రత్నాగిరి, కొంకణ తీరాలపై పట్టు దొరికింది.

ఆ తరువాత వారి కన్నుకేరళ సాగర తీర రాజు జామొరిన్ పై బడింది.జామొరిన్నువశపరచుకునేందుకు వెళ్తూ వెళ్తూ మంగుళూరును మట్టికరిపించారు. అది 1525. ఆ తరువాత ముందుకువెళ్లబోతే అబ్బక్క రాజ్యం తుళునాడు అడ్డం ఉంది. “ఇదెంత పని… ఆడదేం చేస్తుంది” అనుకున్నారు. పోర్చుగీసు వాళ్లు…ఉల్లాల్ మసాలా దినుసుల ఘాటు నసాళానికంటుతుందన్నది వారికి తెలియలేదు.

అబ్బక్క దెబ్బకు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. 1555 లో అడ్మిరల్ డాం వారో డా సిల్వానియా నాయకత్వంలో మళ్లీ దాడి చేశారు. మళ్లీ మట్టికరిచారు. 1568 లో మూడో సారి పో పీక్సోరో అనే సేనాని నాయకత్వంలో మళ్లీ దాడి చేశారు.ఈ దాడిలో ఉల్లాల్ రాజభవనం వారి చేజిక్కింది. అబ్బక్క మహాదేవి ఒక మసీదులో తలదాచుకోవాల్సి వచ్చింది. కానీ అదే రాత్రి రెండు వందల మంది సైనికులతో ఆమె బుడతకీచుల (పోర్చుగీసులకు తెలుగోడు పెట్టుకున్న పేరు) పై విరుచుకుపడింది.

ఈ దాడిలో జనరల్ పీక్సోటోను కత్తికో కండగా చేసింది. ఆ తరువాత మంగుళూరు కోటపై దాడి చేసి అడ్మిరల్ మాస్కరెన్హస్ ను పైలోకాలకి పంపించింది. ఏడాది పాటు ఆమె మంగుళూరు కేంద్రంగా పరిపాలించింది. కానీ భర్త లక్ష్మణప్ప పోర్చుగీసులతో కలిసి పోయాడు. పోర్చుగీసులు మళ్లీ ఆమెపై యుద్ధం జరిపారు. వారిని ఎదుర్కొనేందుకు ఆమె జామొరిన్, అహ్మద్ నగర్ రాజులతో కలిసి ఒక కూటమిగా ఏర్పడి పోరాటం చేసింది.

1570లో చివరికి పోర్చుగీసులదే పైచేయి అయింది. అబ్బక్క రాణి పోర్చుగీసు చెరసాల పాలైంది. జైల్లో ఉంటూ కూడా ఆమె తలవంచలేదు. అలాగే పోరాడుతూ పోరాడుతూ ప్రాణాలు వదిలింది. అబ్బక్క కథ కన్నడిగులకు యక్షగాన గాథ అయింది. పౌరుషపు పాట అయింది. పోరాటపు బాట అయింది.

తుళునాడులో గళం గళం ఆమె పాట పాడింది. అబ్బక్క ఉల్లాల్ కోట, కట్టించిన రుద్రశివ మందిరం, పూజించిన జైన బాసాడి, తలదాచుకున్న మసీదు తీర్థస్థలాలయ్యాయి. తరతరాలుగా తీరనగరిని అబ్బక్క ఆవేశించింది. ఉల్లాల్ నగరం వెళ్తే ఫిరంగి పక్కన నిలుచుని సేనలను ప్రోత్సహిస్తూనో, గుర్రం పై కత్తి చేబూని సింహిణీనాదం చేస్తూనో అబ్బక్క రణభూమిలో తిరుగాడుతున్నట్టు అనిపిస్తుంది.

ఆమె కాంస్యవిగ్రహం నాలుగు వందల తొంబై మూడు ఏండ్ల కాలం నాటి పోరాటగాథ చెప్పేందుకా అన్నట్టు నగరం నడిబొడ్డున నిలుచుని ఉంటుంది. కేంద్రంలో వాజ్పేయి ప్రభుత్వం వచ్చాక ‘అబ్బక్క’ పేరిట తపాలా స్టాంపు విడుదలైంది. ఈ మధ్యే తీరంలో విదేశీ తిమిరంపై సమరం చేసిన అబ్బక్క పేరిట మన తీరరక్షణ దళం (కోస్టుగార్డు) ఒక నౌకను కూడా జలప్రవేశం చేయించింది.

ఈ కథ చదివాక ఉల్లాల్ అంటే స్నేహా ఉల్లాల్, చౌతా అంటే సందీప్ చౌతాలు మాత్రమే కాక, అబ్బక్క రాణి కూడా గుర్తుకు వస్తే ఈ ఆర్టికల్ ఆశయం ఫలించినట్టే. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!