మాస్ పాటల మాంత్రికుడు !

Sharing is Caring...

Bharadwaja Rangavajhala…………..

‘శారద’లో టైటిల్ సాంగ్ చాలు అతని టాలెంట్ తెలియడానికి. రాజేశ్ ఖన్నా ‘ఆరాధన’లో ‘మేరీ సప్నోంకీ రాణీ కబ్ ఆయేగీతూ’ ప్రేరణతో సాగుతుంది. ఆ పాట మొత్తం వినండి…మీకలా అనిపించదు. కానీ చివర క్లోజింగ్ లో వచ్చే సంగీతం పట్టిచ్చేస్తుంది. ‘చక్రవర్తి’ తొలి చిత్రం ‘మూగప్రేమ’లోనూ…ఓ అద్భుతమైన డ్యూయట్ వినిపిస్తుంది.

‘ఈ సంజెలో.’..అంటూ సాగే పాట ఎప్పుడు విన్నా చాలా ఫ్రెష్ గా ఉంటుంది.  ‘మహదేవన్’ అంటే ఇష్టపడే చక్రవర్తి ఆయన తరహాలో చేసిన ట్యూను చిరంజీవి ‘సంఘర్షణ’లో వినిపిస్తుంది. “కట్టుజారిపోతా ఉందా …చీర కట్టు జారిపోతా ఉందా?” అంటూ సాగుతుంది ఆ పాట.   సాధారణంగా ఫోక్ నమ్ముకున్న సంగీత దర్శకుడే మాస్ మనసులు గెలవగలడు. చక్రవర్తికి ఆ విషయం తెల్సు కనుక విజయం సాధించాడు. 

అన్నట్టు ఈ చక్రవర్తి అను అప్పారావు గుంటూరు లో వెంకటప్పయ్య శాస్త్రి గారి దగ్గర కొంచెం సంగీతం నేర్చుకుని ఆ తర్వాత ‘బుర్ర కథ నాజర్’ దగ్గర జ్ఞానం పొందాడు.960 చిత్రాలకు సంగీతం అందించిన చక్రవర్తి తెలుగు మాస్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాడు. ఆయన అసలు పేరు కొమ్మినేని అప్పా రావు. ఆయన గాయకుడు కూడా, దాదాపు 300 చిత్రాలకు డబ్బింగ్ ఆర్టిస్టు గా పని చేశారు.

ఉత్తమ సంగీత దర్శకుడిగా ‘నేటి భారతం’, ‘శ్రావణ మేఘాలు’ చిత్రాల కి నంది పురస్కారం లభించింది. ఒక 25 సంవత్సరాలు తెలుగు సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగారు. సాంఘిక, జానపద, పౌరాణిక పాటలకి సంగీతం అందించారు. మాధవ పెద్ది రమేష్, సురేష్, మనో, రాజ్ కోటి, కీరవాణి, మణిశర్మ, వందేమాతరం శ్రీనివాస్, రెహమాన్ లాంటి చాలా మంది ఆయన దగ్గర శిష్యరికo చేసిన వారే. ‘అమ్మోరు’ చిత్రానికి చివరి సారిగా సంగీతాన్ని అందించారు.

కెరీర్‌లో ఎన్నో హిట్స్ వచ్చినా ‘చీకటి వెలుగులు’ ఫ్లాప్ మాత్రం చివరివరకూ వేధించింది చక్రవర్తిని.నెలకు అయిదారు సినిమాలు  చక్రవర్తి సంగీత దర్శకత్వంలో వచ్చి, కేవలం పాటలవల్లనే హిట్టయిన సందర్భాలున్నాయి. చక్రవర్తి మంచి సంగీత దర్శకుడు. వెయ్యి సినిమాలు అవలీలగా చేయగలిగినా 960+ దగ్గరే పరుగు ఆపేశాడు.

ఎంతమంది అడిగినా “నా అసిస్టెంట్లకు అవకాశాలు రావద్దా…?” అని సంగీత దర్శకత్వం వైపు వెళ్లలేదు. ‘ఫలోమా’ అనే మలయాళ చిత్రం హిందీ డబ్బింగ్ కి  వచ్చింది, దానికి అప్పారావుని సంగీత దర్శకునిగా తీసుకున్నారు. టైటిల్స్ లో అన్నీ హిందీ పేర్లే ఉన్నాయి, వాటి మధ్య అప్పారావు అనే తెలుగు పేరు ఎందుకని సినిమావారు ఆయనకు చెప్పి ‘చక్రవర్తి’గా వేశారు.ఇక అదే పేరు తెరపై ఖరారు అయింది.

ఒకసారి చక్రవర్తి ఓ పాటకి చక్కటి ట్యూన్ కట్టి, నిర్మాతకిస్తే  ప్చ్  అన్నాడట.  ‘సరే సాయంత్రానికి మీకు కుదిరే ట్యూన్ ఇస్తాను, రచయితనుకూడా తీసుకు రండ’ని పంపేశాడు. సాయంత్రం సిట్టింగ్ సమయంలో ట్యూన్ వినిపిస్తే, నిర్మాత తెగ పొంగిపోయి, ‘ఇదే సార్, మీరివ్వాల్సిన ట్యూన్’ అన్నాడు. అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్లిపోయాడు. వేటూరి ‘ఇది ఏ రాగం?’ అని అడిగితే; అప్పటికే ఒళ్లు మండి ఉన్న చక్రవర్తి “మంగళగిరి రాగం, తాడికొండ తాళం” అన్నాడు కోపంగా.

చక్రవర్తి సంగీతం ఉంటే చాలు తమ సినిమాలు బాగా ఆడతాయనే నమ్మకంతో నిర్మాతలు ఉండేవారు. నిర్మాతల అంచనాలను ఏ నాడూ వమ్ముచేయకుండానే మంచి ట్యూన్స్ అందించే వారు ఆయన.అందరు హీరోల సినిమాలకు చక్రవర్తి వినసొంపైన సంగీతం సమకూర్చారు. 2002 ఫిబ్రవరి 3న చక్రవర్తి తుదిశ్వాస విడిచారు.

 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!