వైట్ హౌస్ ను నిర్మించిన ఖ్యాతి ఈయనదేనా ?

Sharing is Caring...

Royal pleasures in the White House ………………..

జార్జి వాషింగ్టన్ అమెరికాకు మొట్ట మొదటి అధ్యక్షుడు. ఈయన హయాంలోనే వైట్ హౌస్ గా పాపులర్ అయిన అధ్యక్ష నివాస భవనానికి రూపకల్పన జరిగింది. జార్జి వాషింగ్టన్  రెండుసార్లు వరుసగా… ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతకుముందు గ్రేట్ బ్రిటన్ తో జరిగిన యుద్ధంలో అమెరికన్ సైన్యాన్ని విజయపథంలో నడిపించారు.ఆ సమయంలో కాంటినెంటల్ ఆర్మీకి కమాండర్ ఇన్ చీఫ్ గా వ్యవహరించారు.

ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న జార్జి వాషింగ్టన్ పై పోటీ చేసేందుకు నాడు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో అమెరికా ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికై పదవీ బాధ్యతలు చేపట్టారు. పాలనా విధానాలు ఎలా ఉండాలి ? ఏ ప్రామాణికాలను అనుసరించాలి అనే అంశాలను ఆయన రూపొందించారు. ప్రెసిడెంట్ క్యాబినెట్ కూర్పు ఎలా ఉండాలో ? ఎవరెవరు అందులో ఉండాలో ? ఆయన పాటించి తర్వాత కాలం అధ్యక్షులకు మార్గదర్శిగా నిలిచారు.

ఆయన హయాంలోనే  1790 కాపీరైట్ చట్టం అమలులోకి వచ్చింది. అలాగే  నివాస చట్టం, బ్యాంక్ చట్టం, న్యాయవ్యవస్థ చట్టాలకు రూపకల్పన చేశారు. ఆరుగురు న్యాయమూర్తులతో సుప్రీంకోర్టును స్థాపించారు. అటార్నీ జనరల్ ను నియమించారు. అమెరికా రాజ్యాంగం రాసిన కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించారు.

ఆ సమయంలోనే ప్రెసిడెన్షియల్ ప్యాలస్ నిర్మాణానికి పూనుకున్నారు. జేమ్స్ హోబన్ ను ఆర్కిటెక్ట్ గా నియమించారు.ఆయనే దగ్గరుండి డిజైన్స్ పరిశీలించారు.ఈ భవనమే తర్వాతకాలంలో వైట్ హౌస్ గా మారింది. అప్పట్లో రాజధాని ఫిలడెల్ఫియా లో ఉండేది. దీంతో వాషింగ్టన్ ఈ భవనంలో ఒక్క నిద్ర కూడా చేయలేదు. భవనం పూర్తి కాకముందే చనిపోయారని కూడా అంటారు.

ఆ తరువాత ఎన్నికైన జాన్ ఆడమ్స్ జాతీయ రాజధానిని ఫిలడెల్ఫియా నుండి వాషింగ్టన్ కి తరలించారు. వైట్ హౌస్ 1800 సం.. నుంచి  ప్రతి US అధ్యక్షుని నివాసంగా మారింది. ఈ వైట్ హౌస్‌ లేదా శ్వేత సౌధం వాషింగ్టన్ లో ఉంది. 18 ఎకరాల విస్తీర్ణం లో  నిర్మించిన విలాసవంతమైన భవనం ఇది.

ఇందులో 132 గదులు, 32 బాత్‌రూమ్‌లు, థియేటర్, 3 ఎలివేటర్లు,28 నిప్పు గూళ్లు, ఇతర సదుపాయాలున్నాయి. ఈ భవనం లో నివసించే వారికి,సందర్శించే వ్యక్తులకీ ,పని చేసే వారికి, 6 స్థాయిల్లో వసతులు కల్పిస్తారు. ప్రతిరోజూ 6 వేల మంది సందర్శకులు వైట్‌హౌస్‌కు వస్తుంటారు. ఈ వైట్ హౌస్ వంటగదిలో 5 మంది చెఫ్‌లు, వారికి అసిస్టెంట్లు.. ఇతర సహాయ సిబ్బంది ఉంటారు.

విశాలమైన వంటగది 1140 మందికి ఆహారాన్ని సిద్ధం చేయగల సామర్థ్యాన్నికలిగి ఉండటం విశేషం. భవన ప్రాంగణంలో క్రీడా సదుపాయాలు కూడా ఉన్నాయి. టెన్నిస్ కోర్ట్, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్,బిలియర్డ్ రూమ్, బౌలింగ్ లేన్ ఉన్నాయి. వినోద కార్యక్రమాలు తిలకించేందుకు థియేటర్ కూడా ఉంది. ఇక ఇంటర్నెట్ సదుపాయం కామన్.

ప్రస్తుత వైట్ హౌస్ కాంప్లెక్స్‌లో ఎగ్జిక్యూటివ్ రెసిడెన్స్, వెస్ట్ వింగ్, ఈస్ట్ వింగ్, ఐసెన్‌హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ బిల్డింగ్ ఉన్నాయి..గతంలో స్టేట్ డిపార్ట్‌మెంట్, ఇతర విభాగాలు ఇక్కడే ఉండేవి. ఇప్పుడు అక్కడ అధ్యక్షుని సిబ్బంది, వైస్ ప్రెసిడెంట్ కోసం అదనపు కార్యాలయాలను ఏర్పాటు చేశారు. వీటితో అతిధులకు ప్రత్యేక వింగ్స్ ఉన్నాయి. కాల క్రమంలో మార్పులు చేర్పులు చేస్తున్నారు.  

ఈ కాంప్లెక్స్ కు భారీ భద్రత ఉంటుంది. గతంలో జరిగిన అవాంఛనీయ సంఘటన ల దృష్ట్యా సెక్యూరిటీ పెంచారు. వైట్ హౌస్ చుట్టూ 8 అడుగుల ఎత్తులో మెటల్ కంచెలను నిర్మించారు.ప్రెసిడెన్షియల్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ కూడా ఉంది.

దీనిని వైట్ హౌస్ లోని ఈస్ట్ వింగ్ కింద ఒక బంకర్ లో ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో అధ్యక్షుడు, ఇతరులు ఇక్కడ  ఆశ్రయం పొందుతారు. అలాగే ఇది సమాచార కేంద్రంగా కూడా పనిచేస్తుంది..  ఇక్కడ అటు ఇటుగా 6 వేల  మంది సిబ్బంది పని చేస్తుంటారు. రాజప్రాసాదాలను తలపించే రీతిలోనే ఈ శ్వేత సౌధాన్ని నిర్మించారు.
 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!