MyNaa Swamy……………………… Sculpture houses
శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల పురావస్తు పరిశోధన దృష్ట్యా చాలా ముఖ్యమైనది. విజయనగరం కాలం నాటి మాధవరాయ స్వామి దేవాలయం ప్రధాన ఆకర్షణ. సామాన్య శకం 1524కు చెందిన శాసనంలో దేవాలయంలో ప్రతి నెల దశమినాడు ఊరేగింపు జరపడానికై వాకిటి ఆదెప్పనాయకుడు కొంత ధనాన్ని కేటాయించినట్లు స్పష్టం చేసారు.
శ్రీ క్రిష్ణదేవరాయల కుమారుడు తిరుమలదేవ మహారాయలు యువరాజుగా పట్టాభిషిక్తుడైన సందర్భంగా ఆ శాసనాన్ని రాశారు.రావికుంట చెరువు కింద భూమిని గుడికి దానం చేశారు.నిజానికి గుడి ఆవరణం మినహా..మాధవ స్వామికి ఎటువంటి మాన్యాలు లేవు.
సా.శ. 1533 శాసనం ప్రకారం వాకాటి మల్లప్ప నాయకుని కుమారుడైన తిమ్మప్ప నాయకుడు దేవాలయానికి సంబంధించిన ఊరేగింపును పునరుద్ధరించ వలసినదిగా గ్రామ ప్రజలను ఆదేశించారు. వాకిటి మల్లప్ప నాయకుని నాయకత్వంలో గోరంట్ల ను నాయంకర పరిపాలనా విధానములోకి తెచ్చారు.
రాజ్యంలో వసూలు చేయబడిన కప్పంలో కొంతభాగము ఈ దేవాలయ పురోభివృద్ధికి మండలాధికారి చిక్కవెంకటప్ప నాయకుడు కేటాయించినట్టు 1610 నాటి శాసనం చెబుతున్నది. ఈ శాసనాలు గోరంట్ల ఘన చరిత్రను ఆవిష్కరిస్తున్నాయి.
నాయంకర పరిపాలన విజయనగరం ఆర్థిక విధానంపై కొంత విజ్ఞానాన్ని సమకూర్చుతుంది. ఈ దేవాలయం ప్రజల సాంఘిక-మత విషయాలలో. ఏ విధంగా తోడ్పడిoదో… తెలుసుకోవచ్చు.
ఎంతో చరిత్ర గల గోరంట్లలో- పరిసర ప్రాంతాల్లో శిల్పకళా నిలయాలు ఎన్నో పున్నాయి.
అట్టి వాటిలో మాధవరాయల దేవాలయం ప్రముఖమైంది. ఇక్కడికి సమీపంలోని మేరెడ్డిపల్లి గ్రామంలో వెలసిన వేణుగోపాలస్వామి గుడి, కొండాపురం వద్ద గల వేణుగోపాలుని ఆలయం, వానవోలులో వెలసిన కస్తూరి రంగనాథ స్వామి సన్నిధి ఎంతో రమణీయంగా ఉంటాయి.