ఎన్నోఘటనలకు సాక్షీ భూతం ఈ గండకీ !

Sharing is Caring...

Thopudu bandi Sadiq Ali ……………………………….. 

శ్రీరామచంద్రుల వారు లేదా సీతమ్మ తల్లి గురించీ కాదు.శాలిగ్రామ శిలల గురించో,ముక్తినాధ్ క్షేత్రం గురించో కాదు ఈ స్టోరీ.వీటన్నింటితో ముడిపడి ఉన్న నేపాల్ జీవనది,పురాణాల్లో ప్రస్తావించిన నారాయణీ నది, అపర గంగ గండకీ నది గురించి మాత్రమే. ఎన్నో ఘట్టాలకు సాక్షీ భూతం ఈ గండకీ నది.

నేపాల్ రాజధాని ఖాట్మండులో పశుపతి నాధుడిని సందర్శించుకున్న తర్వాత ముక్తినాధ్ క్షేత్రాన్ని దర్శించాలన్న కాంక్ష బలంగా కలిగింది.సుదీర్ఘ ప్రయాణమనీ,కష్టతరమైనదనీ తెలిసి ఖాట్మండు నుంచి ఒంటరిగా బయలుదేరాను.ఒకరోజంతా ప్రయాణించి ఫోఖ్రా చేరుకున్నాను..అక్కడి నుంచి ఉదయాన్నే ఆరుగంటలకు జోమ్ సోమ్ బయలుదేరాను.

మార్గమధ్యంలో సుందర జలపాతాలు,విరిగిపడే కొండచరియలు,ప్రమాదకర లోయలు,నదులు, వాగులు,వంకలు దాటుకుంటూ గమ్యస్థానం చేరాను..మరుసటిరోజు ఉదయాన్నే ముక్తినాధ్ కు బయలు దేరాను.ఇదిగో ఇక్కడే గండకీ నదితో అనుబంధం మొదలైంది. 

జోమ్ సోమ్ శివార్లు దాటిన తర్వాత విశాలమైన మైదానాలు, నదీతీరం ఎదురయ్యాయి.ఉత్సుకతతో నది ఒడ్డుకు వెళ్ళాను. ప్రవాహపరిధి విశాలంగా ఉన్నా ప్రవాహం మాత్రం సన్నగానే ఉంది. ఆ ప్రవాహాన్ని చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను.సాధారణంగా హిమనీ నదాలన్నీ తెల్లగా పాలనురగల్లా ఉంటాయి.కానీ ఈ నదిలో ప్రవహిస్తున్న నీళ్లు నల్లగా కరిగించిన తారులా ఉన్నాయి. ఆశ్చర్యమేసింది. 

స్థానికులను అడిగితే వారు చెప్పిన విశేషాలు భలే వింతగా అనిపించాయి.ముక్తినాధ్ నుంచి మరో 30 కిలోమీటర్లు ఎగువకు హిమాలయ పర్వతసానువుల్లోకి ప్రయాణిస్తే ముష్టాంగ్ అనే ప్రాంతం వస్తుంది.అక్కడే ఈ నది పుట్టింది.పుట్టిన చోట తెల్లగా పాలలా ఉంటుంది.కొంతదూరం ప్రయాణించిన తర్వాత నల్లగా మారిపోతుంది.అలా 24 కిలోమీటర్ల దూరంపాటు నది నల్లగానే ఉంటుంది.

సరిగ్గా ఈ పరిధిలోనే శ్రీమహావిష్ణువు కు ప్రతిరూపంగా భావించే సాలగ్రామ శిలలు లభిస్తాయి.ఆ పరిధి దాటాక క్రమంగా నది తన రంగును మార్చుకొని మిగతా నదుల్లాగే మారిపోతుంది.అక్కడే సాలగ్రామ శిలలు కూడా అదృశ్యం అయిపోతాయి . అలా బయలుదేరిన గండకీ నది ఆ తర్వాత గందకీగా పిలవబడుతూ పలుపట్టణాలు,నగరాల గుండా ప్రయాణించి భారత భూభాగంలోకి ప్రవేశిస్తుంది.

ఈ నదికి చేరువలోనే ముక్తినాధ్ క్షేత్రం ఉంది. ఈ గండకీ లేదా నారాయణీ నది ప్రస్తావన పలు పురాణాలలో కూడా ఉంది.స్థలపురాణం ప్రకారం సీతాదేవి జన్మస్థానం జనకపురి నేపాల్లోనే ఉంది.దీనిమీద ఎవరికీ ఏ వివాదమూ లేదు.

అయితే రాముడు ఏలిన అయోధ్య కూడా ఈ ప్రాంతంలోనే ఉందని మెజారిటీ నేపాలీలు నమ్ముతారు. ఆ వివాదం చాలాకాలంగా నడుస్తోంది. రాములవారి పట్టాభిషేకం తర్వాత అడవులపాలైన సీతమ్మ ను చేరదీసిన వాల్మీకి ఆశ్రమం ఈ గండకీ నదీతీరంలోనే ఉండేదనీ, లవకుశులు అక్కడే పుట్టిపెరిగారని నేపాలీలు నమ్ముతారు.

రాముడు అశ్వమేధ యాగం చేసినప్పుడు యాగాశ్వాన్ని లవకుశులు ఇక్కడే బంధించారని అంటారు. ఈ గండకీ నదికి అవతలి తీరంలో ఎత్తైన మట్టిదిబ్బలు ఉన్నాయి. వాటిని మీరు ఫొటోలో చూడొచ్చు.జాగ్రత్తగా గమనిస్తే ఆ దిబ్బల్లో పెద్దపెద్ద బొరియలు కన్పిస్తాయి.

మన పురాణాల ప్రకారం ఎందరో మునులు,ఋషులు ఆ దేవదేవుడి కోసం ఆ బొరియల్లో వందల సంవత్సరాలు తపస్సు చేశారు అని చెబుతారు.మన మేధావులేమో వాటిని పుక్కిటి పురాణాలుగా కొట్టేస్తారు.పురాణాల్లో ప్రస్తావించిన అంశాలకు సంబంధించిన పలు ఆధారాలు అక్కడ ఇటీవల లభించాయి.

నేపాల్ పురాతత్వ శాస్త్రవేత్తలు ఇటీవల ఆ బొరియలపై పరిశోధనలు చేశారు.పదివేల సంవత్సరాలకు పూర్వమే ఆ బొరియల్లో మనుషులు నివశించిన అవశేషాలు,ఎముకలు,వారు ఉపయోగించిన వస్తువులు అక్కడ లభించాయి.వాటిపై విస్తృత పరిశోధనలు చేస్తున్నారు.

మరిన్ని విశేషాలు బయటికి వస్తాయని అంటున్నారు. అదే జరిగితే మన పురాతన గ్రంధాలలో ప్రస్తావించిన పలు అంశాలు నిజమని రుజువు అవుతాయి. జంబూద్వీపం,భరతఖండం ఖ్యాతి,మన సాంస్కృతిక వైభవం ప్రపంచానికి మరోసారి తెలిసొస్తుంది.

 ఇది కూడా చదవండి >>>>>>>>>>ఈ రుద్రనాథుడిని దర్శించారా ?

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!