Bharadwaja Rangavajhala………………………
ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్ తీసిన సిరిమువ్వల సింహనాదం చిత్రం విజయవాడ శకుంతల థియేటర్ లో విడుదల అని పోస్టర్లేశారు. అది బహుశా 1991 కావచ్చు. నిజానికి ఈ సినిమా 90లోనే మొదలైంది.
ఎందుకంటే ఈ సినిమాలో ఓ హీరోయిన్ తల్లిగా నటించిన రత్నా సాగరి 91 లో విజయచిత్ర కిచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ విశ్వనాథ్ గారు ఇటీవలే షూటింగ్ పూర్తి చేసిన’ సిరిమువ్వల సింహనాదం’ సినిమా లో నటించాను అని చెప్పారు.ఇంతకీ విషయం ఏమిటంటే… ఆ సినిమా చూడడానికి నేను సైకిలేసుకుని శకుంతల థియేటర్ కు వెళ్లాను.
నిజానికి అప్పట్లో నేను సినిమాకు వెళ్లలేని పరిస్థితి ఉంది. అయినప్పటికీ విశ్వనాథ్ సినిమా అని ఎవరికీ చెప్పకుండా వెళ్లాను. తీరా అక్కడికి వెళ్లే సరికి బాక్సులు రాలేదన్నారు. శృతిలయలు, సిరిమువ్వల సింహనాదం, స్వాతికిరణం ఇదీ వరస.
మొదటినుంచి విశ్వనాథ్ లో సంస్కరణాభిలాష ఎక్కువ. ఆయన సంప్రదాయానికి ఎంత పెద్దపీట వేస్తాడో సంస్కరణకు కూడా అంతే పెద్ద పీట వేస్తారు. ఏదో ఒక సామాజిక అంశాన్ని ప్రస్తావించకుండా ఆయన సినిమా తీయరు. ఆయన గురువు ఆదుర్తి లో కూడా కనిపించని కోణం ఇది.
‘శంకరాభరణం’ తర్వాత విశ్వనాథ్ సోమయాజులు కాంబినేషన్ లో వచ్చిన ‘సప్తపది’ చిత్రం లో పెళ్లైన బ్రాహ్మణ యువతిని .. ఆ పిల్ల తాతే స్వయంగా అమ్మాయి ప్రేమించిన దళిత యువకుడికి అప్పగిస్తాడు. మనసులో ఒకరిని పెట్టుకుని మరొకరితో సంసారం చేయడం కుదరని వ్యవహారం అని చాలా ఖచ్చితంగా మాట్లాడతారాయన. సినిమా ఓ మోస్తరుగా ఆడింది.
బాగుందన్నారు గానీ ఎందుచేతో జనం ఆ సినిమా కన్నా అదే సమయంలో విడుదలైన బాపుగారి ‘రాధాకళ్యాణం’ ను విజయవంతం చేశారు. అక్కడా ఇదే సమస్య. ప్రేమించిన వాడితో కాక పెద్దలు కుదిర్చిన పెళ్లికొడుకుతో తాళి కట్టించుకుంటుంది రాధిక. రాధిక మనసులో తను లేనని సదరు పెళ్లికొడుకు ‘సప్తపది’ లోలానే ఫస్ట్ నైటే తెలుసుకుంటాడు. అక్కడ్నించీ ఆ ప్రియుడి గురించి వెతికి తీసుకొస్తాడు.
తీరా వచ్చిన ప్రియుడు పెళ్లికాక ముందు ఆడపిల్ల మనసు అద్దం లాంటిది అందులో చాలా మంది ముఖం చూసుకుంటారు. పెళ్లైన అమ్మాయి మనసు పటం లాంటిది. అందులో ఒక ఫొటో ఉంటుంది. ఇంకెవరూ అందులో ముఖం చూసుకోడానికి ఉండదు అని వెళ్లిపోతాడు. జనం ‘రాధాకళ్యాణాని’కి జై కొట్టి విశ్వనాథ్ ‘సప్తపది’ని యావరేజ్ చేశారు.
ఇక్కడ ఓ సందర్భంలో ఎన్టీఆర్ అన్న మాట గుర్తు చేసుకోవాలి. మనం నిజజీవితంలో పాటించని పట్టించుకోని అంశాలను పుస్తకాల్లో చదవడానికీ సినిమాల్లో చూడడానికి ఇష్టపడతాం అన్నారాయన.’ఉమ్మడి కుటుంబం’ సినిమా గురించి వ్యాఖ్యానిస్తూ…
‘సప్తపది’ పెద్దగా నడవకపోయినా…విశ్వనాథ్ లో సంస్కరణాభిలాష కొనసాగుతూనే వచ్చింది. వాహినీ నుంచీ బయటకు వచ్చాక విశ్వనాథ్ ఎక్కువగా పనిచేసిన కంపెనీ అన్నపూర్ణ. ఆదుర్తి దగ్గర అసిస్టెంటు అనేది కరెక్టే గానీ దుక్కిపాటితో కలసి కథల్ని ఫైనలైజ్ చేయడంలో విశ్వనాథ్ ది అక్కడ కీలక భూమికే.
దుక్కిపాటి మధుసూధనరావులోనూ సంస్కరణాభిలాష ఎక్కువే. విశ్వనాథ్ మీద శాంతారామ్ దుక్కిపాటి ప్రభావం ఎక్కువ. సో కావున ఆయనది సాంప్రదాయ సంస్కరణ బాట.బా చెప్పాను కదా… దుక్కిపాటి సినిమాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓ సామాజిక రుగ్మత మీద పాట ఉంటుంది. అది సాధ్యమైనంత వరకూ శ్రీశ్రీ రాసేవాడు.
మరి ఈ దారిలో నడచిన విశ్వనాథ్ సినిమాల్లోనూ ఈ ధోరణి కనిపిస్తుంది. పసిపిల్ల వంట చేయడానికి ఇబ్బంది పడుతుంటే వచ్చిన వారు సాయం చేయచ్చుకదా అని శంకరశాస్త్రి చేత అనిపించాడు విశ్వనాథ్ . ‘కాలం మారింది’ లాంటి సబ్జక్టు తీసేయగలిగాడు. ఆయన తనకు తెలిసిన జీవితాలనే తెరకెక్కించాడు.
తెలియని జీవితాలనూ ఊహించి తీశారు.‘స్వయంకృషి’లో విజయశాంతి, చిరంజీవి పాత్రలు మాదిగ కులానికి చెందినవే అయ్యుండాలి. అయితే వారు పాడుకునే పాటల్లో అంతటా బ్రాహ్మణ్యం తొంగి చూస్తూంటుంది. సుందరమూర్తికి చేలములు లాగా. ఇలాంటి తలనొప్పులు విశ్వనాథ్ తో చాలా ఉన్నాయి. అయినప్పటికీ ఆదర్శవాదిగా ఆయన్ని నేను గౌరవిస్తాను.
ఇంతకీ విషయం ఏమిటంటే …విశ్వనాథ్ తీసి విడుదల కాకుండా ఆగిపోయిన ‘సిరిమువ్వల సింహనాదం’ సినిమా చూశాను. అదీ ఆయనతో కలసి. ఒకసారి కాదు రెండు సార్లు.
స్టేజ్ మీద ఆడపిల్లలా గెటప్పేసుకుని స్థానం నరసింహారావు, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి లాగా నర్తనమూ నటనమూ చేస్తూంటాడు ఈ చిత్ర కథానాయకుడు.
అతనికి సమాజంలో ఎంతో పేరు ప్రతిష్ట వచ్చేస్తాయి. ఆడదిగా కనిపించే బావను పెళ్లాడనంటుంది అతని మరదలు. అతను మ్యాన్లీగా కనిపించడం లేదంటుంది. బావ స్నేహితుడ్ని ప్రేమిస్తుంది.ఆ అమ్మాయి అనుకోకుండా రాజకీయ పలుకుబడి ఉన్న ఓంపురి కొడుకుతో కయ్యం పెట్టుకుంటుంది.
ఆ దుర్మార్గుడు తన మీద అఘాయిత్యానికి పాల్పడతాడు. ఈ మ్యాన్లీగా కనిపించని డాన్సరే నరకాసుర వధ స్టేజ్ డ్రామా ఆడుతూ సత్యభామ గెటప్ లోనే ఓంపురినీ అతని కొడుకునూ చంపవతల పారేస్తాడు. ఆ మరదలుకు మ్యాన్లీగా కనిపించిన అబ్బాయేమో ఈ అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి కుమిలిపోతాడు.అలా దుష్టశిక్షణ పూర్తవుతుంది. డాన్సర్ జైలుకుపోతాడు.
ఈ కథలో ఆ కుర్రాడు ఎందుకు ఆడపిల్లగా కనిపిస్తూ డాన్సు చేయడం మీద ఎక్కువ ఇంట్రస్టు పే చేశాడు అనే అంశం ప్రస్తావిస్తారు విశ్వనాథ్ . ఆయన చెప్పిన కారణం .. ఆడ గెటప్ లో అద్దంలో తనను తాను చూసుకున్నప్పుడు చనిపోయిన తల్లి కనిపిస్తుంది. అందుకే ఆ తల్లితో తన అటాచ్ మెంట్ విడిపోకూడదనే కొనసాగుతాడు.ఇలా స్త్రీ పాత్రలు వేయడం ద్వారానే కాదు. తనలో స్త్రీత్వం పలికించడానికి ఆ కళాకారుడు ఆడవారిని అధ్యయనం చేస్తాడు.
అందుకే అతనిలో అంత చక్కగా స్త్రీత్వం పలుకుతుంది అని కూడా చెప్తారు. అంతేకాదు ఆడవారు పడే కొన్ని ప్రత్యేక ఇబ్బందుల గురించి కూడా జ్ఞానం ఉంటుంది అతనికి. అలా కొంత మహిళా పక్షపాతిగా వ్యవహరిస్తూ ఉంటాడు కూడా…నిజానికి ఇది చాలా మంచి పాయింటు.
సైకో డ్రామా అని ఓ కాన్సెప్టు ఉంది. నేరం చేసిన వాళ్లనే పాత్రధారులుగా తీసుకుని వాళ్లు చేసిన నేరానికి బలైపోయిన వారి పాత్రల్లో వీరిని నటింపచేయడం ద్వారా వాళ్లలో మానసిక పరివర్తన తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది అనేది థియరీ.
ఈ పాయింటు మీద ఏ దర్శకుడూ సినిమా తీయడేమా అనుకునేవాణ్ణి నేను. తీరా’ సిరిమువ్వల సింహనాదం’ దాదాపు అదే లైన్ లో నడిచింది. ‘అర్ధనారీశ్వర తత్వం’ అని కొందరు అక్కడికి వచ్చిన వారు వ్యాఖ్యానించినా విశ్వనాథ్ అంతకు మించే ఆలోచించారనిపించింది.
స్త్రీని అర్ధం చేసుకోవాలంటే ఆడపాత్రల్లో నటింపచేస్తే వాళ్లకి కొంతలో కొంత అర్ధం అయ్యే అవకాశం ఉంటుంది. నాకైతే సినిమా చూశాక అనిపించింది ఇది.ఈ సినిమాను విడుదల చేయడానికి శతవిధాలుగా ప్రయత్నం చేసి విఫలురై వెళ్ళిపోయారు ఆయన.
డిజిటల్ ఫార్మెట్ లోకి మార్చి … యూట్యూబ్ లో విడుదల చేయడడం బెటర్ అని ఆయనతో అన్నా …. విన్లేదు…ఏది ఏమైనా ఓ మంచి కాన్సెప్టుతో సినిమా తీసిన విశ్వనాథ్ కి మరోసారి థాంక్స్ చెప్తున్నాను.డాన్సర్ పాత్రలో కళాకృష్ణ నటించారు.మరో హీరో చంద్రమోహన్. విశ్వనాథ్ చాలా గ్యాప్ తర్వాత అంటే ‘శుభోదయం’ తర్వాత చంద్రమోహన్ తో చేసిన సినిమా ఇదే. ఆ తర్వాత కూడా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు పాపం.