Balu who entertained the fan……………………
ఈ ఫొటోలో బాలు తో కనిపించే అతని పేరు మారన్ … శ్రీలంక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా చేస్తున్నారు. ఎస్పీ బాలు కి వీరాభిమాని. ఒక ప్రమాదం లో కనుచూపు కోల్పోయాడు. లోకల్ టెలివిజన్ ఇంటర్వ్యూ లో ‘’నాజీవితం చీకటిలోకి నెట్టివేయబడింది. నిరాశమయమైంది.
ఆ తరుణంలో నా అభిమాన గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాటలను తనివితీరా వింటూ స్వస్థత పొందాను.” అని మారన్ తన మనసులో మాట చెప్పాడు.కొంతకాలానికి మారన్ ఇంటర్వ్యూ బాలు దృష్టికి వెళ్ళింది.
ఆతర్వాత ఒక సంగీత కార్యక్రమంలో పాల్గొనడానికి బాలు శ్రీలంక వెళ్ళాడు. ఆ సందర్భంగా మారన్ చిరునామాను తెలుసుకుని నేరుగా అతని ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో మారన్ బాల్కనీలో కూర్చొని ఉన్నాడు. బాలు అతని వెనుక నిలబడి ‘’నూరాండ గళ్ నీ వాంగవే’’ అనే ఒక పాట వినిపించాడు.
ఆ గానం విన్న మారన్ ‘’ఎంతమంచి పాట గుర్తుచేస్తున్నారు.ఇంతకీ మీరెవరు?’’ అని ప్రశ్నించాడు. ‘’నేను కూడా సుబ్రహ్మణ్యం లా పాడగలను. నా పేరు ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం….’’ అని బాలు జోక్ చేసాడు.మారన్ వెంటనే గ్రహించేసాడు.
ఆ నిజాన్ని నమ్మలేని మారన్ లేచి నిలబడి ‘’నేను ఎంత అదృష్టవంతుణ్ణి సార్ ” అంటుండగా అతడిని మరలా కుర్చీలో కూర్చుండబెట్టి బాలు కొన్ని పాటలు వినిపించాడు. మారన్ ఆనందం అంతా ఇంతా కాదు. అతని ఆనందాన్ని చూసి బాలు కూడా సంతోషపడ్డాడు. మారన్ కోరిక మేరకు డ్యూయెట్ నుండి ఒక పాటను పాడి బాలు తన అభిమానిని సంతోష పెట్టారు.
మారన్ కుటుంబ సభ్యులు కూడా అది కల నిజమా అని ఆశ్చర్యపోయారు. ఆ నిజాన్ని జీర్ణించుకోవడానికి కొంత సమయం పట్టింది. 2019 లో జరిగిన ఈ సంఘటన తాలూకు వీడియో బాలు మరణించిన సందర్భంలో వైరల్ అయింది. సుమారు 5 లక్షలమంది ఈ వీడియోను చూసారు.
అలా బాలు తన అభిమాని ఆనందపడేలా చేశారు. బాలు జీవితంలో ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. అవన్నీ వెలుగు చూడలేదు. ఇప్పుడిప్పుడు బయటికొస్తున్నాయి. అభిమానులకు అంతకంటే కావాల్సింది ఏముంది.
ఆ వీడియో లింక్..https://youtu.be/WAnNhr6OKWc.