ప్రాణాలకు తెగిస్తేనే .. పంచమర్హి శివుడి దర్శనం !!

Sharing is Caring...

Very tough journey…………………………………..

పంచమర్హి శివుడి ని దర్శించడం అంత సులభంకాదు. ప్రాణాలకు తెగించి కొండలు, గుట్టలు ఎక్కి ఆలయానికి చేరుకోవాలి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు దగ్గర లో ఉన్న పంచమర్హి గుట్ట పై ఈ శివుడు వెలిశాడు.  చిన్న గుహాలయం లో ఉన్న ఈ శివుడి దర్శనం  శ్రావణ మాసం లో 10 రోజుల మాత్రమే సాధ్యం.

మిగతా రోజులలో అక్కడికి ఎవరూ వెళ్లరు.  అక్కడే ఉన్న నాగ ద్వారం కేవలం కేవలం పదిరోజులు మాత్రమే తెరుచుకొంటుందని భక్తుల నమ్మకం. ఇక్కడ ఉన్న గుహాలయంలో శివుడు వందల ఏళ్ళ క్రితం వెలిశాడని అంటారు. ఈ శివాలయాన్ని దర్శిస్తే  సర్వపాపాలు హరిస్తాయని భక్తులు భావిస్తారు.

ఆ గుట్ట పైకి వెళ్లడం ప్రతి ఒక్కరికి సాధ్యం అయ్యే పని కాదు. గుట్ట కునాలుగు వైపులా దట్టమైన అడవులు .. లోయలు, జలపాతాలు ఉన్నాయి.  అక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతి అందాలు అందరిని ఆకట్టుకుంటాయి. అదే సమయంలో మృత్యువు అనుక్షణం పొంచి ఉంటుంది.

ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మృత్యువు బారిన పడటం ఖాయం. అయినప్పటికీ  ప్రయాసలకోర్చి భక్తులు తరతరాలుగా ఆ నాగ ద్వారం చూడాలని… శివుడిని దర్శించుకోవాలని ఆ గుట్టపై కెళుతుంటారు. ఏడాదిలో కేవలం 10 రోజులు మాత్రమే తెరిచి ఉంచే ఆ నాగ ద్వారం దాటుకుని శివుడిని చూసేందుకు భక్తులు లక్షల సంఖ్యలోఆ గుట్ట ఎక్కుతుంటారు.

ఆ నాగద్వారం తెరిచిన పదిరోజులు మాత్రం అక్కడి పాములు భక్తులకు హాని చేయవని చెబుతుంటారు. అలాగే క్రూర మృగాలు కూడా భక్తుల జోలికి రావంటారు. మిగిలిన రోజుల్లో ఎవరైనా అటు వైపు వెళితే పాములు కాటు వేస్తాయట. క్రూర జంతువులు వెంటబడి దాడి చేస్తాయట.

అందుకే నాగ ద్వారం తెరిచినప్పుడు మాత్రమే ప్రజలు వెళుతుంటారు.  మిగిలిన సమయంలో అటు వైపు కన్నెత్తి కూడా చూడరని అంటారు. శ్రావణ మాసంలో పంచాగాన్ని అనుసరించి ఈ దేవాలయాన్ని తెరుస్తారు. అప్పుడు మాత్రమే భక్తులను కొండపైకి అనుమతిస్తారు.చుట్టూ పర్వత శిఖరాలు , జలపాతాలు, భీకరమైన అడవీ మార్గం గుండా గుహాలయాన్ని చేరుకోవడం సాహసంతో కూడిన ప్రయాణమే అని చెప్పుకోవాలి.

అందుకే ఆ శివుడి దర్శనం అంత సులభం కాదు. ఏమాత్రం ఏమరుపాటుగా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ట్రెక్కింగ్ పై ఆసక్తి ఉన్నవారు ఈ యాత్ర చేయవచ్చు .  రిస్క్ ఎక్కువ కాబట్టి పలు జాగ్రత్తలు తీసుకోవాలి. కీకారణ్యంలో  సుమారు 20 కిలోమీటర్ల మేరకు నడవాలి .. మధ్యలో గుట్టలు ఎక్కాలి.  మొత్తం యాత్రకు 15 గంటలు పడుతుంది.

దారిపొడుగునా విషపు ముల్లులు, విష క్రిములు, కీటకాలు, పాములు సంచరిస్తుంటాయి. వాటిని దాటుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అటు భోపాల్ ఇటు నాగపూర్ కి ఈ పంచమర్హి మధ్యలో ఉంటుంది.  ఈ చుట్టు పక్కల ఉన్నవారికి నాగ దేవత కులదైవం. కొండమీద ఉన్న నాగద్వారం  లోపలికి వెళ్లి అక్కడ ఉన్న నాగ దేవత విగ్రహాలను పూజిస్తారు.

నాగద్వారం తెరిచిన 10రోజులు ఇక్కడ తాత్కాలికం గా దుకాణాలు వెలుస్తాయి.  ఇక్కడికి దగ్గర్లో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం సాంచి స్థూపం. దీనిని 3వ శతాబ్దంలో నిర్మించారు. ఆ పదిరోజులు భోపాల్ నుంచి పంచమర్హి కి ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, వాహనాలు తిరుగుతాయి.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!