Soon insulin woes will be over……….………………………
మధుమేహం.. అదేనండీ షుగర్ వ్యాధి.. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రస్తుతం కోట్ల మందిని వేధిస్తున్నది. అనారోగ్య కరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి కారణంగా ఎందరో షుగర్ బారిన పడుతున్నారు.
కొందరు తల్లిదండ్రుల నుండి సంక్రమించిన షుగర్ వ్యాధితో ఇబ్బందిపడుతుంటారు.మధుమేహం ఉన్నవారు ప్రతిరోజూ తమ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇన్సులిన్ ఇంజెక్షన్లపై ఆధారపడుతుంటారు. కానీ ఇన్సులిన్ ఇంజెక్షన్లు బాధాకరమైనవి. ఎందుకంటే ప్రతిరోజూ ఇంజెక్షన్ అంటే నొప్పిని భరించాల్సిందే..
అంతేకాదు.. ఎప్పుడైనా ఇంటికి దూరంగా ఉన్నా.. ఆఫీసులో ఉన్నప్పుడు ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకోవటం కష్టమే. ఒక్కోసారి మహా చికాకుగా ఉంటుంది. అయితే ఇకపై అది కష్టం కాదు.హైదరాబాద్‌కి చెందిన నీడిల్ ఫ్రీ టెక్నాలజీస్ ఇప్పుడు ఇన్సులిన్ స్ప్రే అనే మందును అందుబాటులోకి తేబోతుంది. దీనికి ఓజులిన్ అని పేరు పెట్టారు. ఈ ఇన్సులిన్ వాడితే నొప్పి భయం ఉండదు. మందు మోతాదులను బట్టి నేరుగా నోటిలోకి స్ప్రే చేసుకోవచ్చు.
ట్రాన్స్‌జీన్ బయోటెక్‌తో అనుబంధంగా ఉన్న ఈ కంపెనీ అధునాతన వైద్య రంగంలో కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సెంట్రల్ డ్రగ్ క్వాలిటీ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కు దరఖాస్తు సమర్పించిన ఈ సంస్థ.. ఇన్సులిన్ స్ప్రేని మనుషులపై ఇంకా పరీక్షించలేదు. కొన్ని జంతువులపై ప్రయోగాలు చేసి.. మనుషులపై కూడా ప్రయోగిస్తామని చెబుతోంది.
ఓరల్ ఇన్సులిన్ కోసం పరిశోధన, అభివృద్ధి ఇంకా కొనసాగుతోంది. దానిపై అధ్యయనాలు వివిధ కోణాల్లో ప్రభావంతమైన ఫలితాలను చూపించాయి. అయితే, కంపెనీ సేఫ్టీ స్టడీస్‌ను నిర్వహించడానికి అనుమతి కోసం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కి దరఖాస్తు చేసినట్టు నీడిల్ ఫ్రీ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ డాక్టర్ కె కోటేశ్వరరావు చెబుతున్నారు .
ఓజులిన్ కోసం ఇప్పటికే 40 దేశాల నుంచి పేటెంట్లు పొందినట్లు కూడా తెలియ జేశారు. కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం… ఓజులిన్ 2025-26 నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మధుమేహ బాధితులకు భారీ ఉపశమనం లభిస్తుంది. కాగా ఇంజక్షన్ ల బాధ లేకుండా ఇన్సులిన్ ను చాకోలెట్ రూపంలో తీసుకునే అవకాశం కూడా రాబోతుంది. తద్వారా చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు అంటున్నారు. దీనిని వేరే కంపెనీ తయారు చేస్తోంది. ఇది కూడా త్వరలో మార్కెట్లోకి వస్తుంది.