Aravind Arya Pakide ………………………………….
తెలంగాణ లోని అతి పురాతన ఆలయాల్లో ఏకవీర ఎల్లమ్మ దేవాలయం ఒకటి. కాకతీయుల కులదైవంగా భావించే ఏకవీర ఎల్లమ్మకు అప్పట్లో నిత్యం పూజలు జరిగేవి. ఈ ఆలయాన్ని దాదాపు 1,100 ఏళ్ల కిందట నిర్మించారని చరిత్రకారులు చెబుతారు. రాణీ రుద్రమ దేవి తన నివాసం నుంచి ఖిల్లా వరంగల్ సొరంగ మార్గం ద్వారా ఈ ఆలయానికి చేరుకునేదట. ఇక్కడ ఎల్లమ్మకు మొగిలి పూలతో పూజలు చేసేదనే కథనాలు ప్రచారం లో ఉన్నాయి.
కాకతీయుల పతనం తర్వాత ఈ ఆలయం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. అందులోని మూలవిరాట్టును ఎవరో ఎత్తుకుపోయారు. మూల విరాట్టు లేక, పూజలు నిలిచిపోవటంతో భక్తుల రాక ఆగిపోయింది. చివరికి ఆలయం శిథిలావస్థకు చేరింది. అద్భుత శిల్పసంపదతో కూడిన స్థంభాలు పక్కకు ఒరిగిపోయాయి.
ఇందులో మూలవిరాట్టు లేకపోవటంతో ఈ ఆలయాన్ని పట్టించుకునే వారు కరువయ్యారు.ఇక ఈ ఆలయ సమీపంలోని రాళ్లలో తొలిచిన జైన గుహలు అందరిని ఆకట్టుకుంటాయి. పెద్ద రాతి గుండ్లను తొలిచి గుహలుగా మలిచారు. అప్పట్లో ఈ ప్రాంతంలో జైనమత ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. దీంతో వరంగల్ పద్మాక్షి గుట్ట, అగ్గలయ్య గుట్ట, చుట్టుపక్కల ప్రాంతాల్లో జైనుల ఆవాసాలు ఏర్పడ్డాయి. వారి విద్యాలయాలు కొనసాగాయి.
ఆ క్రమంలోనే జైన మునులు ధ్యానం చేసుకునేందుకు ఈ గుహలను ఏర్పాటు చేసుకున్నారని అంటారు. ఏకవీర ఆలయం సమీపంలో ఇలాంటి మూడు గుహలు ఇప్పటికీ ఉన్నాయి. ఈ ప్రాంతమంతా ప్రస్తుతం చెట్లు, పొదల మధ్య చిక్కుకుపోయింది. ప్రస్తుతం ఈ ఆలయానికి వెళ్లేందుకు దారి కూడా లేదు.కాగా కాకతీయులు ఏకవీర ఎల్లమ్మను కొలిచినట్లు పెద్దల ద్వారా తెలుస్తున్నప్పటికీ… అందుకు సంబంధించి శాసనాలు, ఆధారాలేమీ లభించలేదు.
ఇక మొగిలిచెర్ల ఊరు అసలు పేరు మొగిలి చెరువుల అని.. అక్కడి చెరువుల్లో విస్తృతంగా మొగిలిపూల వనం ఉండటంతో ఆ పేరొచ్చిందని చెప్పే శాసనాలు మాత్రం లభించినట్టు పురావస్తుశాఖ అధికారులు చెబుతున్నారు. వాటిల్లో ఈ దేవాలయం ప్రస్తావన కొద్దిగానే ఉందని, ఏకవీర ఎల్లమ్మ ప్రస్తావనేదీ లేదని అంటున్నారు.
మరో కథనం ప్రకారం ఎల్లమ్మ దేవత రేణుక దేవి ప్రతిరూపం. అందుకే ఆమెను జానపదులు రేణుక ఎల్లమ్మ అని వ్యవహరిస్తారు. వరంగల్ జిల్లాలో కొందరు ఏకవీర దేవతను తమ కులదైవంగా కొలుస్తారు. ఎల్లమ్మ దేవాలయం మరొకటి ఆదిలాబాద్ జిల్లాలోని మాహురంలో ఉంది.
అక్కడ ఈమెను మాహురమ్మ అని పిలుస్తారు. రాయలసీమలో నంగమ్మ దేవత అని, తమిళనాడులో మేమలమ్మ అని అంటారు. ప్రస్తుతం ఏకవీర ఎల్లమ్మ ఆలయ పరిస్థితి మరీ ఘోరంగా చుట్టూ సమాధులు వెలిశాయి. కొన్నాళ్ళు పోతే శ్మశానంలో భాగమై పోయే అవకాశాలు లేకపోలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి.
ఈ ఏకవీర ఎల్లమ్మ ఆలయాన్ని పునరుద్ధరించాలని రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ప్రతిపాదనలు అలాగే ఉండిపోయాయి .పునరుద్ధరణ పనులు చేపడితే ఈ ఆలయానికి మహర్దశ పడుతుంది.
ఇది కూడా చదవండి >>>>>>> హిమాలయ శిఖరాల అంచుల్లో …..