Swami’s Leelas are many…………………
చంద్రస్వామి సొంత రాష్ట్రం రాజస్థాన్. ఆయన అక్కడే పుట్టారు. అసలు పేరు నేమి చంద్ గాంధీ. ఆయన చిన్నతనంలోనే కుటుంబం హైదరాబాద్ కు వలస వచ్చింది. చంద్రస్వామి తండ్రి ఆర్. ఎస్. ఎస్. వాది.
తండ్రి లాగానే చంద్ర స్వామి 13 ఏళ్ళ వయసులోనే ఆర్. ఎస్. ఎస్. కార్యక్రమాల్లో పాల్గొనేవాడు.సేవ్ హిందీ , గో వధ ఉద్యమాలలో పాల్గొని ఒకసారి జైలుకి కూడా వెళ్ళాడు. ఆ తర్వాత ఆధ్యాత్మిక రంగంపై దృష్టి మళ్ళించాడు. హైదరాబాద్ వదిలి కాలినడకన ఖాట్మండు చేరుకున్నాడు.
అక్కడే ఒక గురువు వద్ద తాంత్రిక విద్యలు కూడా నేర్చుకున్నాడు. బీహార్ అడవుల్లో ఉండి తపస్సు కూడా చేసాడు. మొదటి సారిగా 1972 ప్రాంతంలో ఫోర్జరీ, మోసం కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు లో వాడి వదిలేసిన ఇనుమును రాజస్థాన్ లోని జైపూర్ వ్యక్తులకు సరఫరా చేస్తానని అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. ఏపీ కి చెందిన ఒక మంత్రి వ్యక్తిగత కార్యదర్శి సాయంతో ఫేక్ డాకుమెంట్స్ తయారు చేసాడు. ఆ కేసులో లక్షలు ఆర్జించాడు.
ఇక చంద్రస్వామి యజ్ఞాలు యాగాలు చేయడం లో కొంత ప్రావీణ్యం సాధించాడు. ఇందిరాగాంధీ కోసం తాంత్రిక పూజలు కూడా చేసానని ఆయన ప్రచారం చేసుకున్నాడు.చరణ్ సింగ్ ప్రధాని కావడం వెనుక కూడా చంద్ర స్వామి పాత్ర ఉందని అప్పట్లో చెప్పుకున్నారు.
చంద్ర స్వామి చేసే యజ్ఞాలలో ప్రణబ్ ముఖర్జీ ,పీవీ నరసింహారావు వంటి ప్రముఖులతో పాటు పెద్ద పెద్ద అధికారులు కూడా పాల్గొనే వారు.స్వామి తన తాంత్రిక విద్యల ద్వారా వీరందరిని బాగా ఆకట్టుకున్నాడు. తద్వారా వారి వద్దకు స్వేచ్ఛ గా వెళ్లేందుకు అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని తెలివిగా వాడుకున్నాడు. అలా అలా చూస్తుండగానే చంద్రస్వామి పరపతి అమాంతం పెరిగిపోయింది. ఈయన దగ్గర ఏవో శక్తులు ఉన్నాయని అందరూ భావించేవారు.
అక్కడనుంచి ఎక్కే ఫ్లైట్ .. దిగే ఫ్లైట్ క్షణం కూడా తీరిక లేనంత బిజీ అయిపోయాడు. ఆయుధ వ్యాపారి ఖషోగి తో కలసి ప్రయివేట్ విమానాల్లో అన్ని ఖండాలు తిరిగాడు. ఎంతో విలాసవంతమైన జీవితం గడిపాడు. విదేశాల్లో కూడా తన సత్తా చూపి కొన్ని కుంభకోణాల్లో ఇరుక్కున్నాడు.
అయితే చాకచక్యంగా తప్పించుకున్నాడు. చెప్పుకుంటే స్వామి లీలలు బోలెడున్నాయి. రాజీవ్ గాంధీ హత్య కేసులో చంద్రస్వామి పాత్ర పై జైన్ కమీషన్ చేసిన ఆరోపణలపై సరిగ్గా విచారణ జరగలేదని అంటారు. సోనియా గాంధీ కూడా ఈ అంశంపై సరైన రీతిలో స్పందించలేదనే అభిప్రాయలు లేకపోలేదు. డిల్లీ స్థాయిలో అనేక మంది రాజకీయ నేతలను ఆయన ప్రభావితం చేసేవారు.ఆర్దిక లావాదేవీలకు సంబందించి పలు ఆరోపణలు కూడా వచ్చాయి.
అదేరీతిలో విశాఖ కు చెందిన ఓ వ్యాపారిని మూడు కోట్లమేరకు చంద్రస్వామి శిష్యులు ముంచేశారు. ఖరీదైన రత్నాలను అమ్మడానికి సంజయ్ అగర్వాల్ అనే వ్యాపారి ఢిల్లీ వెళ్లగా స్వామి శిష్యులు అతగాడికి మాయ మాటలు చెప్పి బోల్తా కొట్టించారు. పీవీ పదవిలోనుంచి దిగిపోయిన తర్వాత నుంచి స్వామి ప్రాభవం కూడా తగ్గిపోయింది. మెల్లగా కనుమరుగయ్యాడు. ఎక్కడున్నాడో ఎవరికి తెలియకుండా గడిపాడు.
తర్వాత అనారోగ్యానికి గురై ఢిల్లీ ఆస్పత్రిలో చేరాడు. డయాలసిస్ పైనే కొంత కాలం బతికాడు. చివరికి 66 ఏళ్ళ వయసులో గుండెపోటు తో పాటు అవయవాల వైఫల్యంతో 2017 మే 23 న మరణించాడు. కేవలం కొన్ని ఏళ్ళ వ్యవధిలోనే అనూహ్య స్థాయికి ఎదిగిన చంద్రస్వామి అంతే వేగంతో కనుమరుగు అయ్యారు. ఆయన తనకు తెలిసిన విద్యలను ప్రజలకోసం ఉపయోగించకుండా స్వార్థం కోసం వినియోగించి చివరికి పతనమయ్యాడు.
ఇది కూడా చదవండి >>>>>>>>ప్రధానులు సైతం ఆయన మాట విన్నారా ? (1)
———— K.N.MURTHY