బంగాళాఖాతానికి, తుఫాన్‌కి మధ్య లింక్ ఏమిటి ?

Sharing is Caring...

Why are cyclones born there?………

‘బంగాళాఖాతంలో వాయుగుండం’ అనే మాటను ఎక్కువగా నవంబర్ మాసం లో వింటుంటాం. వాయుగుండం తుఫానుగా మారడం. దాని ఫలితాలను మనం అనుభవించడం తెల్సిందే ..  అసలీ బంగాళాఖాతానికి, తుపానుకీ మధ్య  బంధం ఏంటి.. బంగాళాఖాతం తీవ్రమైన సైక్లోన్ లకు కేరాఫ్ ఎందుకవుతోంది..?

సముద్రంపై ఎక్కడైతే గాలులు ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతాన్ని అధిక పీడనం అని…  అతి తక్కువగా గాలులు ఉంటే దాన్ని అల్పపీడనమని అంటారు. ఈ రెండు పీడనాలు కూడా గాలుల కదలిక వల్లే ఏర్పడతాయి. గాలుల్లో వేడి గాలి, చల్లగాలి అని రెండు రకాల గాలులు ఉంటాయి. వేడిగాలి తేలికగా ఉన్నకారణంగా పైకి చేరుతుంది. చల్లగాలి మెల్లగా కిందికి దిగుతుంది.

భూ వాతావరణాన్ని సమీపించే కొలది ఈ గాలి చల్లబడుతుంది. గాల్లో ఉంటే ఆవిరి ఘనీభవించి మంచు స్పటికాలు తయారవుతాయి. ఆకాశంలో దట్టమైన మేఘాలు ఏర్పడతాయి. కొన్ని చోట్ల సుడులు తిరుగుతూ మరింత గాలిని లాక్కుంటాయి.ఈ అల్పపీడనం మరింత తీవ్రమైతే వాయుగుండంగా మారుతుంది. అది మరింత బలపడితే తుఫాన్‌గా ఏర్పడుతుంది. 

సముద్రంపై సుడులు రూపంలో ఉండే తుఫాన్ .. భూవాతావరణంలోకి ప్రవేశించడాన్నే తీరాన్ని తాకడమని అంటారు. తుఫాన్ తీరాన్ని తాకగానే సుడులు రూపంలో ఉండే మేఘాలు చెల్లాచెదురై వర్షాలు /భారీ వర్షాలు పడతాయి. సుడులకు కారణమైన గాలులు తీరం వైపు వెళతాయి . గంటకు 61 నుంచి 250 కిమీ కంటే వేగంగా ప్రయాణిస్తాయి.

1970లో వచ్చిన భోలా తుఫాను ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఘోరమైనది. 2008 మేలో బర్మా తీరంలో సంభవించిన నర్గిస్ తుఫానుకు లక్షా 40 వేల మంది చనిపోయారు. నిన్నమొన్నటి మిచౌంగ్ దాకా… డేంజరస్ తుఫాన్లన్నీ పుట్టింది బంగాళాఖాతంలోనే. ఇవే కాదు.. ఇంతవరకూ సంభవించిన అత్యంత భీకరమైన 35 తుపానుల్లో 27 తుపాన్లు  బంగాళాఖాతంలోనే పుట్టాయి. ఇక్కడే ఎందుకు…? కారణాలు ఏమై ఉంటాయి..?

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ తీరప్రాంతమున్న సముద్రం బంగాళాఖాతమే. 50 కోట్ల మందికి పైగా జనం బంగాళాఖాతం తీరంలోనే బతికేస్తున్నారు. బంగాళాఖాతం లోతు తక్కువగా ఉంటుంది. తీరం ఒకవైపునకు వంగినట్టు పల్లంగా ఉంటుంది. తుపాను సమయంలో వీచే గాలులు నీటిని బలంగా ఒడ్డు వైపునకు తోస్తాయి.. దాంతో అలల వేగం ఒక్కసారిగా పెరిగి నేరుగా తుపాను తీరాన్ని తాకుతుంది.. ఇదీ పరిశోధకులు తేల్చిన విషయం.

బంగాళాఖాతం ఉపరితలంపై ఉష్ణోగ్రతలు ఎప్పుడూ ఎక్కువగా ఉంటాయి. తీవ్ర తుఫాన్లు ఇక్కడే సంభవించడానికి ఇది కూడా ఒక కారణమట. లూసియానాలోని గల్ఫ్ తీర ప్రాంతానిక్కూడా ఇటువంటి స్వభావం ఉంటుంది కనుక.. అక్కడ సైతం తుపాన్లు ఎక్కువగా సంభవిస్తాయి. కానీ.. అక్కడ జనజీవనం తక్కువగా ఉంటుంది కనుక.. ప్రాణనష్టం గురించి పెద్దగా బెంగ లేదు.

అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లోనే కాదు.. ఏప్రిల్, మే నెల్లో కూడా బంగాళాఖాతం కేరాఫ్‌గా తీవ్రమైన తుఫాన్లు సంభవిస్తాయి. వీటికి గ్లోబల్ వార్మింగ్ కూడా ఒక కారణమన్నది పరిశోధకుల మాట. ఇటీవలి కాలంలో అరేబియా సముద్రం ఉపరితలంపై కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సైక్లోన్ల విషయంలో బంగాళాఖాతానికి  అరేబియా పోటీకొస్తోందని  అంటున్నారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!