సైబీరియా బాటసారి !!

Sharing is Caring...

పూదోట శౌరీలు బోధన్ ……………………………………..

A traveler who came around Siberia …………………………

ప్రొఫెసర్ ఎమ్.ఆదినారాయణ గారు రష్యా లో 40 రోజులు అనేక ప్రాంతాలలో తిరిగి తాను చూసిన విశేషాలను, గురించి విలువైన సమాచారం ” సైబీరియా బాటసారి” పేరుతో ఒక పుస్తక రూపంలో మనకందించారు.

మనదేశంలో గ్రామగ్రామాన,వీధి వీధినా గాంధీ విగ్రహాలున్నట్లే రష్యాలో ” పుస్కిన్” విగ్రహాలుంటాయి.అనేక ఊర్లకు, వీధులకు, పెద్దపెద్ద భవనాలకు పుస్కిన్ పేరు వుంటుంది. ఎవరీ పుస్కిన్..? 1799 లో పుట్టి,1837 లో తన 37 వ ఏట చనిపోయిన ఫుస్కిన్ అంటే రష్యా వాళ్ల కెందుకంత ప్రేమ..అతడేమీ జార్ చక్రవర్తుల వంశీయుడు కాదు..పేరున్న రాజకీయ నాయకుడు కాదు.రష్యా వారికి పుస్కిన్ అంటే ఎంత గౌరవమో అతని భార్య నతాలియా అంటే అంత అసహ్యం..ఎందుకో తెలుసు కోవాలనుందా..?

రాజైన “పీటర్ ది గ్రేట్” కి పొడవాటి గడ్డాలంటే అసహ్యం.ఎందుకని..? అతని ఆస్థానంలో వున్న మంత్రులు,ఆర్మీ ఆఫీసర్స్, పెద్దలందరి గడ్డాలు ఆయనే స్వయంగా లాగి,పీకి కత్తిరించి పారేశాడట.పైగా “గడ్డం పన్ను” వేశాడట.ఎందుకో..?

రష్యాలోని ” హెర్మిటేజ్ మ్యూజియం” లో ఆరడుగుల పొడవు,ఐదడుగుల వెడల్పు వున్న ” రోమన్ ఛారిటీ” చిత్రం గురించి మీకు తెలుసా..? తండ్రి సైమన్ జైలులో బందీ గా వుంటాడు.అతని చేతులు వెనక్కి తిప్పి గొలుసులతో కట్టేసివుంటాయి.తిండి లేక నీరసించి గోడకి చేరగిలి పడి వుంటాడు.అతని కూతురు ” పీరో” తండ్రిని బతికించుకోవటం అతని భుజం మీద చేయి వేసి,ఎంతో ప్రేమగా తన కుడచేత్తో స్తన్యాన్ని తన ముసలి తండ్రి నోటికి అందిస్తూ వుంటుంది.ఈ చిత్రం పుట్టుపూర్వోత్తరాలు, వాద వివాదాలు తెలిసుకోవాలని వుందా.?

యవ్వనశక్తికి,అందాన్ని పెంచుకోవటానికి రష్యా లో ” మరాల్ జింక” రక్తం తాగుతారట.అలాగే కొండ పక్షులు తమ ఉమ్మితో కట్టుకున్న గూళ్లను తింటారట.ఒక గ్లాస్ మరాల్ జింక రక్తం వెల ఎంతో తెలుసా..? తెలిస్తే అమ్మబాబోయ్ అని గుండెలు బాదు కుంటారు.మరి ఆ వివరాలు కావాలా..?
రష్యా లో ఎలుగు బంటిని ఎలా వేటాడుతారో తెలుసా..?

” The song of the Olga boat men” పాట గురించి,Ak 47 కనిపెట్టిన కలాస్నికొవ్ విశేషాలు కావాలా..?
” కామాన్ని నియంత్రించటం ద్వారా స్వర్గాన్ని చేరవచ్చు” దాని కోసం పురుషులు వృషణాల్ని కత్తి రించుకోవటం, స్త్రీలు వక్షోజాలను తీయించుకోవటం. ఇదీ రష్యా లోని ” స్కోప్ సీ మతస్తుల నమ్మకం..ఈ మతం గురించి ఇంకొన్ని విశేషాలు చదవాలని వుందా..?

1469 లోనే నికిటిన్ అనే రష్యా యాత్రికుడు మనదేశం లోని కొంకణ్ తీరంలోని చావుల్ అనే ఓడరేవులో దిగాడు.మనదేశంలో అతడు తిరిగిన ప్రదేశాలు,కలిసిన మనుషులు,రాజులు,అతడురాసిన ” Beyond the three Seas” లో మన దేశం గురించి ఏమి రాశాడో తెలుసుకోవాలి కదా.?

ఆదినారాయణ గారు, రష్యా నుండి తిరిగి వచ్చాక ఛావుల్ ( రేవ్ డండా) వెళ్లి ఆ యాత్రికుని గౌరవార్థం నిర్మించిన స్థూపాన్ని చూసి నివాళి అర్పించి వచ్చారు.ఆ వివరాలు కావాలా..?నాకెంతో ఇష్టమయిన,ఎన్నో సార్లు చూసిన సినిమా” దేర్సు ఉ జాలా.”సైబీరియా అడవులు,మంచు ప్రాంతాల్లో అద్భుతంగా తీసిన సినిమా.

ఒక ఆర్మీ ఆఫీసర్ ” ఆర్సెన్యోవ్,అడవుల్లో తిరిగే ఆదివాసీ వేటగాడు దెర్సు వుజాలా మధ్య స్నేహం,కొన్ని అద్భుత సంఘటనతో ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు అకిరా కురసోవా చేతిలో రూపు దిద్దుకునీ, ఆస్కార్ అవార్డ్ అందుకున్న సినిమా ఇది.ఈ సినిమా గురించి పూర్తి వివరాలు కావాలంటే నా Fb పేజీలో వున్న ఈ సినిమా రివ్యూ చదవండి.

రష్యా లో ఆర్శెన్యోవ్ పేరు మీద ఒక పట్టణమే వెలసింది.ఆ ఆర్మీ ఆఫీసర్ గురించి,వారిరువురి విగ్రహాల గురించి ఎన్నో వివరాలు ఈ పుస్తకంలో పొందుపరిచారు. అయితే రచయిత ఆ పట్టణాన్ని చూడలేకపోయారు.మరోమారు అచ్చంగా దీన్ని చూడటానికే రష్యా వెళ్ళాలనుకున్నారు..

మనదేశంలో గొప్ప రష్యా యాత్రికుడైన నికిటిన్ గురించి” పరదేశి” అనే సినిమా తీశారు..మీరు చూశారా.?
రష్యా లో ఇస్కాన్ సంస్థ,రచయిత చేసిన ట్రాన్స్ సైబీరియా రైలుప్రయాణం,వివిధ దేశాలలో ప్రయాణికులను కాపాడే దారిదేవుళ్ళు,రచయిత కలుసుకున్న చిత్రకారులు..ఇంకా ఎన్నో రష్యా విశేషాలు తెలుసుకోవాలంటే ” సైబీరియా బాటసారి” చదవండి..
పుస్తకం వెల..రూ 150, పుస్తకం కోసం రచయిత సెల్..9849883570.. సంప్రదించండి..

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!