అత్యాశతో నేరప్రపంచంలోకి …

Sharing is Caring...

Lady don …………………………

ఈ ఫొటోలో కనిపించే మహిళ పేరు అనురాధ చౌదరి. చాలా అమాయకంగా కనిపించే ఈ అనురాధను జనం లేడీ డాన్‌ అని, రివాల్వర్‌ రాణి అని కూడా పిలుస్తుంటారు. ఆమె రాజస్థాన్‌లో పెద్ద గ్యాంగ్‌ స్టర్‌గా పేరొందింది. దేశంలోని అతిపెద్ద గ్యాంగ్‌ లారెన్స్‌ బిష్ణోయి గ్యాంగ్‌తో ఆమెకు సంబంధాలు కూడా ఉన్నాయి. 

బీటెక్ చదివిన అనురాధ ఇంగ్లీష్ అనర్గళం గా మాట్లాడుతుంది. అయితే ఏం లాభం.. దారితప్పి తన తెలివి తేటలను  నేరాలు చేయడం కోసం ఉపయోగించింది. డాన్‌గా మొదలైన ఆమె ప్రయాణం.. ఆ తరువాత నేర ప్రపంచంలోని ఇతర నేరస్తులతో కలివిడిగా తిరిగే  వరకూ సాగింది. 

రాజస్థాన్‌లోని సీకర్‌ జిల్లాలో అనురాధ చౌదరి జన్మించింది. తల్లి చనిపోవడంతో తండ్రే ఆమెను పెంచిపెద్ద చేశాడు. ఆమె తండ్రి ఉపాధ్యాయుడు. కుమార్తెను పెద్ద చదువులు చదివించాలని కలలుగన్నాడు. అలాగే కష్టపడి చదివించాడు .. అనురాధ కూడా చిన్నతనం నుంచే చదువుపై దృష్టి పెట్టింది. రాజస్థాన్‌లోని ఒక యూనివర్శిటీలో బీటెక్‌ పూర్తిచేసింది. అయితే కాలేజీ రోజుల్లో ఆమె దీపక్‌ మింజా అనే వ్యక్తితో  ప్రేమలో పడింది.

దీపక్‌తో పెళ్లికి అనురాధ తండ్రి ఒప్పుకోలేదు.  అయితే ఆమె తండ్రి మాట కాదని దీపక్‌ను వివాహం చేసుకుంది. కుటుంబంతో అనుబంధం తెంచుకుంది. అనురాధ, దీపక్‌లు కుటుంబ పోషణకు షేర్‌ ట్రేడింగ్‌ మొదలుపెట్టారు. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు చుట్టుపక్కల వారిని ప్రోత్సహించేవారు. కొంతకాలం వారి వ్యాపారం సజావుగానే సాగింది. ఆ తరువాత వ్యాపారంలో సమస్యలు తలెత్తడంతో అనురాధ జీవితమే మారిపోయింది. డబ్బు సంపాదనకు అనురాధ తప్పుడు మార్గాలను ఆశ్రయించింది. 

ఆ సమయంలో రాజస్థాన్‌లో గ్యాంగ్‌స్టర్‌ ఆనంద్‌పాల్‌ ‍ప్రభావం అధికంగా ఉండేది. అనురాధ.. ఆనంద్‌పాల్‌ను కలుసుకుంది. అమె అందమైనది, తెలివైనది కావడంతో ఆనంద్‌పాల్‌ ఆమెతో అనుబంధం ఏర్పరుచుకున్నాడు. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, కిడ్నాప్‌లు మొదలైన నేరాలలో ఆనంద్‌పాల్‌ పేరు ప్రముఖంగా వినిపించేది. అనురాధ కూడా ఆనంద్‌ పాల్‌ గ్యాంగ్‌ సభ్యురాలిగా మారింది. భర్త దీపక్‌కు దూరం అయ్యింది. ఆనంద్‌పాల్‌ను వివాహం చేసుకుందని కూడా అంటారు. 

ఆనంద్‌పాల్‌ అనురాధకు రివాల్వర్‌ వినియోగించడంతో పాటు వివిధ నేరాలలో శిక్షణ ఇచ్చాడు. అదేసమయంలో అనురాధ ఆనంద్‌పాల్‌కు ఆంగ్ల భాషలో మాట్లాడటం  నేర్పించింది. ఆనంద్‌పాల్‌ అనురాధ అడుగులకు మడుగులొత్తేవాడని అంటారు. 2017లో ఆనంద్‌పాల్‌ పోలీసు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. ఆ సమయంలో అనురాధ రెండేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నది. ఆమె జైలు నుంచి బయటకు వచ్చి, ఆనంద్‌పాల్‌ గ్యాంగ్‌ను తన ఆధీనంలోకి తీసుకుంది. గ్యాంగ్ లీడర్ గా మారింది. 

అనురాధ తన గ్యాంగ్‌ ప్రభావాన్ని మరింతగా పెంచుకునేందుకు లారెన్స్‌ బిష్ణోయితో దోస్తీ మొదలుపెట్టింది. రాజస్థాన్‌లో మారణాయుధాల అక్రమ సరఫరాను అనురాధ గ్యాంగ్‌ పర్యవేక్షించేది. బిష్టోయి గ్యాంగ్‌తో జతకట్టిన అనురాధ కొంతకాలానికి కాలా జఠెడితో స్నేహం ప్రారంభించింది.

కాలా జఠెడి  బిష్ణోయి గ్యాంగ్‌ కోసం పనిచేసేవాడు. పాక్‌ నుంచి ఆయుధాల సరఫరాను జఠెడీ చూసుకునేవాడు. ఈ క్రమంలోనే అనురాధ, కాలా జఠెడీ కలసి ఉండసాగారు. వారు ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్నారనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి.  

తరువాత వీరిద్దరూ మారుపేర్లతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసించే వారు.  2021లో పోలీసులు వీరిద్దరినీ అరెస్టు చేశారు. అనురాధపై 12 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. అలాగే  కాలా జఠెడీపై కూడా చాలా కేసులు నమోదు అయ్యాయి. ఆ ఇద్దరు ప్రస్తుతం జైసల్మీర్ లోని వేర్వేరు  జైళ్లలో ఊచలు లెక్కబెడుతున్నారు. 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!