A transformation in the dark?
ఎవరు ఇతగాడు ?
ప్రపంచ వినాశనానికి దారితీసిన అణుబాంబుని తయారీ చేసిన మనిషి హీరో ఎలా అవుతాడు ?
భగవద్గీత చదివిన మనిషి వినాశనం కోరుకున్నాడా? భగవద్గీత చదివిన ప్రతివాడూ పరమాత్ముడు (శ్రీ కృష్ణుడు) అవుతాడా? A transformation in the dark? ది చీకట్లో పరివర్తనేనా ?
ఆగస్టు 6, ప్రపంచ చరిత్రలో చీకటి రోజు. అణుబాంబు తాకిడికి హిరోషిమా తల్లడిల్లిన రోజు. రెండవ ప్రపంచ యుద్ధం చివరినాళ్లలో అమెరికా కసికొద్ది జపాన్ పై ప్రతీకార దాడి జరిపిన రోజు. హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుదాడులతో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. మహా మారణహోమానికి తెరపడింది. ఆ తర్వాత నుంచీ ఆగస్టు ఆరువ తేదీని ప్రపంచ శాంతి దినోత్సవంగా జరుపుకుంటున్నాము.
2023 ఆగస్టు 6. అణుబాంబు పితామహుడు అని పిలుచుకునే ఓపెన్ హేమెర్ జీవితం ఆధారంగా క్రిస్టఫర్ నోలన్ దర్శత్వంలో అదే పేరిట విడుదలైన హాలీవుడ్ బయోపిక్ చిత్రాన్ని నేను లండన్ కి దగ్గర్లోని బేసింగ్ స్టోక్ లో చూశాను. క్రిస్టఫర్ నోలన్ ఈ సినిమా బాగా తీశాడు. అతగాడి మిగతా సినిమాల్లాగానే స్క్రీన్ ప్లే చిత్రానికి చక్కటి బలం.
సినిమా చూశాక ఓపెన్ హేమెర్ గురించి మునిపటికంటే ఎక్కువ ఆలోచించడం మొదలెట్టాను. కొద్ది రోజులపాటు ఈ సినిమా వెంటాడింది. ఓపెన్ హేమెర్ ని ఏ తీరున పిలవాలి ? ఎలా అర్థం చేసుకోవాలన్న తపన మొదలైంది. అనేక ప్రశ్నలు మొలకెత్తాయి. వాటికి సమాధానాలు వెతుక్కునే ప్రయత్నమే ఈ వ్యాసం.
ఓపెన్ హేమెర్ ఓ అద్భుత భౌతిక శాస్త్రవేత్త. అణుబాంబు తయారీ ప్రాజెక్ట్ కి నాయకత్వం వహించాడు. ‘అణుబాంబు పిత’గా పేరు తెచ్చుకున్నాడు. అనేక సన్మానాలు, గౌరవాలు, అడుగడుగునా స్వాగత సత్కారాలు… ‘వార్ హీరో’ అయిపోయాడు. అణుబాంబు పేలితే ఎంతటి వినాశనం కలుగుతుందో చాలా ముందుగా ఊహించి చెప్పగలిగాడు.
సంస్కృత భాష పట్ల ఆసక్తిని పెంచుకుని, పట్టు సంపాదించి భగవద్గీత చదివాడు. అందులోని శ్లోకాలతో తాను చేసే పనులను లేదా చేయాల్సిన పనులను తర్కంతో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. గీతలో శ్రీకృష్ణుడు తానే మహా కాలాన్ని, తానే మృత్యువు నని చెప్పినట్లుగా మాత్రమే అర్థం చేసుకుని తన ఆలోచనలూ అదే స్థాయి వంటిదని అనుకునే ప్రయత్నం చేశాడు.
ఇది ఎలాంటిదంటే, ఒకడు హత్య చేశాక బోనులో నిలబడి తాను నిమిత్తమాత్రుడేనని వాదిస్తూ భగవద్గీత శ్లోకం పఠించిడం లాంటిది.అణుబాంబు తయారీ సమయంలో ఇతని ఆలోచన ఇంతవరకే. చాలా మంది శాస్త్రవేత్తల్లాగానే తర్కంతో ఆలోచించాడు. భగవద్గీతను ‘భగవంతుని గీత’గా భావించలేదు. దేవుడి స్థితి కంటే విశ్వ శక్తి, సృష్టి యొక్క లయం వంటి ఆలోచనలను తనకున్న తర్క దృష్టితో చూశాడు.
కనుకనే భగవద్గీతను పవిత్ర స్థలంలో పవిత్ర భావంతో చదవాలని అతగాడు అనుకొని ఉండడు. అయినా భగవద్గీత చదివిన ప్రతివాడూ హిందువు కావాలని లేదుగా. తర్కం తెలిసిన ప్రతివాడూ జ్ఞాని కాదు కాలేడు.పరిశోధనా కాలంలో ఇతగాడికి పూర్తి పరివర్తన రాలేదనే చెప్పాలి.
అణుబాంబు శక్తిని పరీక్షించే సమయంలో వెలువడిన మహా అగ్ని కీలలను చూసి వేయి సూర్యుల వెలుగుని ఒక్కసారిగా చూశానంటూ , భగవద్గీత శ్లోకం గుర్తుచేసుకున్నాడు. అంతేకాని, ‘అయ్యో, తన ప్రయోగం ఇంతటి భయంకరమైనదా’ అని బాధపడలేదు. సంపూర్ణ పరివర్తన ఉదయించనూ లేదు.
అసలే ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు. అమెరికా , జర్మనీలు అణుబాంబుల తయారీ కోసం పోటీ పడుతున్న తరుణం. అమెరికా ముందడుగు వేసింది. అమెరికన్లు పండుగ చేసుకున్నారు.
ఓపెన్ హేమెర్ కు బ్రహ్మరథం పట్టారు. జపాన్ పై ప్రతీకారం తీర్చుకోవడం కోసం అమెరికా `లిటిల్ బాయ్’ (అణు బాంబు) ని ప్రయోగించింది. చూస్తుండగానే మహా వినాశనం. అక్కడితో ఆగలేదు నాగసాకిపై మరో అణుబాంబు. లక్షల్లో ప్రాణ నష్టం. జపాన్ లొంగుబాటుతో అమెరికా శాంతించింది.
అణుబాంబుని తయారుచేసి, ప్రయోగానికి ప్రోత్సహించిన ఓపెన్ హేమెర్ తర్వాత హైడ్రోజన్ బాంబు తయారీని వ్యతిరేకించాడు.
మానవ వినాశనానికి దారితీసే బాంబులను తయారుచేయడం మంచిది కాదని వాదించాడు. ఈ ‘వ్యతిరేక భావజాలం’ అమెరికా అధికారిక పెద్దలకు నచ్చలేదు. అందుకే ఓపెన్ హైమెర్ చుట్టూ కేసులు బిగుసుకున్నాయి. దర్యాప్తు పేరిట అవమానపరిచింది. సెక్యూరిటీ క్లియరెన్స్ క్లోజ్ చేసింది. ఓపెన్ హేమెర్ మరణించిన తర్వాత చాలా ఏళ్లకి 2022లో (క్రిందటే ఏడాదే) ఈ ఆంక్షలను ఎత్తివేసింది.
ఓపెన్ హైమెర్ చివరి కాలంలో పరివర్తన చెంది ఉండవచ్చు. భగవద్గీత శ్లోకాలను తాను సరిగా అర్థం చేసుకోలేదని చింతించి ఉండనూవచ్చు. శ్రీకృష్ణుడు ధర్మ స్థాపన కోసం చెప్పిన మాటలను మొదట్లో తప్పుగా అర్థం చేసుకున్నానని తెగ బాధపడి ఉండవచ్చు.
ధర్మ స్థాపన వేరు, వినాశనం వేరు. ఈ రెంటి మధ్య ఉన్న తేడాను కేవలం భగవద్గీత శ్లోకాలు చదవడం వల్ల రాదని, లోతుగా ఆలోచించాలన్న జ్ఞానం చివర్లో ఉదయించి ఉండవచ్చు. పరివర్తన జీవితంలో ఎప్పుడైనా రావచ్చు. కాకపోతే వెనక్కి తీసుకోలేని నష్టం కలిగించాక చివర్లో కలిగే పరివర్తన వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. కాలాన్ని వెనక్కి తీసుకెళ్లడం ఎవరికీ సాధ్యం కాదు.
శ్రీకృష్ణుడు మానవ నాశనం కోరుకోలేదు. అధర్మ నాశనం మాత్రమే కోరుకున్నాడు. విశ్వం లోని అద్భుత శక్తిని అర్జునికి చూపించాడు. నీవు చంపకున్నా, జీవించి ఉండేవారు ఎవ్వరూ లేరని అన్నాడు. అంటే దాని అర్థం అధర్మపరులైన వారెవరూ జీవించి ఉండజాలరు అని మాత్రమే. ఇలాంటి ధర్మసూక్ష్మాలను గ్రహించలేక పైపై చదువులతో భగవద్గీతను సరైన కోణంలో అర్థం చేసుకోలేక పోవడం వల్లనే ఓపెన్ హైమెర్,ఎంతటి ప్రతిభా మూర్తి అయినప్పటికీ బోల్తా పడ్డాడు.
అంతే కాదు, ఇతగాడు భగవద్గీతను భక్తితో చదవలేదు. తాత్విక దృష్టితో , తర్కానికి ఉపయోగ పడుతుందని మాత్రమే చదివాడు. ధర్మాధర్మ విచక్షణతో చదవలేదు. అందుకే తాను చేసే పనిని సమర్థించుకునేందుకే గీతా శ్లోకం లేదా శ్లోకాలను అడ్డం పెట్టుకున్నాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు చివర్లో పరివర్తన వచ్చి ఉండవచ్చు.
కానీ ఆ పరివర్తన వెలుగును పంచిపెట్టే స్థితిలో లేడు. ఎక్కడా ప్రసంగాలతో ప్రజల్లో ప్రభావితం చేసే పరిస్థితీలేదు. చివర్లో అనేక ఆంక్షలతో జీవనం గడిపే సమయంలో ఇండియా నుంచి పిలుపు (నెహ్రూ నుంచి పిలుపు) వచ్చినా కదలలేకపోయాడు. ఇలా ఎవ్వరికీ పంచి పెట్టని పరివర్తన, మానవాళికి ఉపయోగ పడని పరివర్తనను ఏమనాలి ? అది కచ్చితంగా చీకట్లో పరివర్తనే. కాదంటారా ?
—— తుర్లపాటి నాగభూషణ రావు, బేసింగ్ స్టోక్, యు.కె………(nrturlapati@gmail.com)