ఒకనాటి రాజాధిరాజ నగరం.. పెనుకొండ !!

Sharing is Caring...

Great history……………..

మైనాస్వామి…………………………………….

పెనుకొండ ఒకప్పుడు మహానగరం.ఎందరో రాజులకు,రాజకుటుంబాలకు,మఠాధిపతులకు,ఘటిక స్థానాధి పతులకు, శిల్పాచార్యులకు, కళాకారులకు ఆశ్రయం కల్పించిన రాజ్యకేంద్రం. రాజాధిరాజనగరం. మౌర్య సామ్రాజ్య కాలం నుంచి పెనుకొండకు చరిత్ర వుంది. పురాణాలు, ఇతిహాసాలు, చారిత్రక సంఘటనలు పెనుకొండ గొప్పతనాన్ని వివరిస్తున్నాయి.

మౌర్యులు,శాతవాహనులు,పల్లవులు,పశ్చిమగంగరాజులు, చాళుక్యులు, నోలంబపల్లవులు, హొయసలప్రభువులు, విజయనగర చక్రవర్తుల పాలనలో పెనుకొండ రాజ్యం ఎంతో అభివృద్ధి అయింది. సాంస్కృతిక నగరంగా, విద్యా కేంద్రంగా సత్తా చాటింది. పెనుకొండకు బ్రహ్మపురం, ఘనగిరి, ఘనాద్రి, ఘనాచలం అనే పేర్లు వున్నాయి. గత వైభవానికి పెనుకొండ కోట ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది.

ఎత్తయిన, బలమైన కోటముందు నిలబడి చూసినప్పుడు, రెండువేల సంవత్సరాల చరిత్ర కన్నుల ముందు కనిపించినట్టుంది. సాంస్కృతిక వార సత్వాన్ని, రాజఠీవిని ప్రదర్శించే ఎన్నో కట్టడాలు పెనుకొండ కోట లోపల – వెలుపల వున్నాయి. 

కోట ప్రధాన ప్రవేశం-ఉత్తర దిక్కున గల ఆంజనేయస్వామి సన్నిధి, పార్శ్వనాథ దేవాలయం, కాశీ విశ్వేశ్వరుని కోవెల, రామభద్రాలయం, గగన మహల్,తిమ్మరుసు జైలు, గాలి గోపురం, అజితనాథ సన్నిధి, వీరన్నకొండ, పెద్దకొండపై నరసింహస్వామి గుడి, కోటలోపల తూర్పున ఐముక్తీశ్వరాలయం, పశువులకెర- పాలకెర, బసవన్న బావి పుష్కరిణులు, కోట వెలుపల బాబయ్య దర్గా సందర్శనీయ స్థలాలు.ఆలయాల్లో,కోటగోడలపై ఎన్నో శాసనాలున్నాయి.

అక్కడక్కడ శాసన స్తంభాలున్నాయి.పెనుకొండ అనంతపురం నుంచి 72 కి.మీ., బెంగుళూరుకు 154 కి.మీ. దూరంలో వుంటుంది.కోట ఉత్తర ద్వారం దగ్గరున్న ఆంజనేయస్వామి విగ్రహం మహా గంభీరంగా వుంటుంది. విగ్రహం ఎత్తు సుమారు 12 అడుగులుండ వచ్చు. కోట ప్రవేశం ముందు స్వామి సన్నిధిని సుందరంగా నిర్మించారు. గుడి గోడలపై విజయనగర చక్రవర్తి శ్రీక్రిష్ణదేవరాయలు, అరవీటి తిరుమలరాయలు తదితర విజయనగర ప్రభువుల శాసనాలున్నాయి.

కోటకు నాలుగుదిక్కులా నాలుగు ప్రదేశమార్గాలున్నాయి. తూర్పున గోరంట్ల ద్వారం, పడమర రొద్దం ప్రవేశ మార్గం, దక్షిణాన భోగసముద్రం చెరువు వాకిలి వున్నాయి. అన్నిచోట్ల ఆంజనేయుని ఆలయాలున్నాయి. ఉత్తరద్వారం గుండా కోటలోపలికి వెళ్ళగానే ఎదురుగా నరసింహస్వామి సన్నిధి కనిపిస్తుంది. కోట గోడలపై సదాశివ రాయల శాసనాలు కనిపిస్తాయి. అక్కడి నుంచి కొంచెం ముందుకు కదిలితే వెంకటరమణుని గుడి, ఆ తర్వాత వినాయక దేవాలయం, ఆ పక్కనే పచ్చ పార్శ్వనాథ గుడి వుంటాయి.

జైన తీర్థంకరుడు పార్శ్వనాథస్వామి కొలువైన కోవెల విశాల ప్రాంగణంలో వుంది. పార్శ్వనాథస్వామి సన్నిధి హొయసల రాజులకాలంలో రూపుదిద్దుకొన్నది. జైనతీర్ధంకరుని విగ్రహం అద్భుతంగా వుంది. స్వామి పాదాల కింద పీఠంపై కన్నడ శాసనం ఉంది.

కాశీ విశ్వేశ్వరుని సన్నిధి: జైనగుడి నుంచి బయటకు వచ్చి కొన్ని అడుగులు వెళ్ళితే కాశీ విశ్వేశ్వరుని సన్నిధి కనిపిస్తుంది. కాశీ కోవెల అత్యద్భుత శిల్ప సంపదకు ఆలవాలమయింది. దృఢమైన గుడి గోడలపై గల సుందర శిల్ప దృశ్యాలు భక్తి పారవశ్యంలో ముంచెత్తుతాయి. గర్భగుడి గోడలపై వున్న సూక్ష్మ శిల్పాలు కడు రమణీయంగా వున్నాయి. శివపురాణం, రామాయణం, మహాభారతంలోని వివిధ ఘట్టాలను వివరించే శిల్పాలు, జానపద కళారూపాలు కనువిందు చేస్తున్నాయి.

విశ్వేశ్వరుని సన్నిధిలో వీరభద్రుని విగ్రహం మహాగ్రంగా వుంది. ఆలయ బయటి గోడలపై నలు చెరుగులా రాయలవారి రాజముద్ర వుంది. సూర్యుడు, చంద్రుడు, పంది, కత్తి, బొమ్మలున్న ముద్రికలు గుడి అంతటా వుండడం విశేషం. విజయనగర సామ్రాజ్యంలో ముఖ్య భూమికను పోషించిన ‘పెనుకొండ సీమ’ కొన్నేండ్ల పాటు ఉమ్మత్తూరు(మైసూరు) పాలకుల ఆధీనంలోవుండిoది. 

శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషిక్తుడైన తర్వాత క్రీ.శ.1510లో ఉమ్మత్తూరు పాలకులను పారద్రోలి పెనుకొండ సీమను తిరిగి దక్కించుకొన్నాడు. ఆ విజయానికి గుర్తుగా కాశీ విశ్వేశ్వరాలయాన్ని క్రిష్ణరాయలు కట్టించాడు. అందువల్లనే గుడినిండా రాయల రాజముద్రికలు కనిపిస్తాయి. కోవెల పక్కనే కోనేరు వుంది. దేవాలయం ముందున్న దీప స్తంభం ఎంతో కళాత్మకంగా వుంది.

రామభద్రాలయం: విశ్వేశ్వరాలయ సందర్శన తర్వాత అదే ఆవరణలోని రామభద్రాలయానికి వెళ్ళితే.. విజయనగర సామ్రాజ్య శిల్పశైలి సాక్షాత్కరిస్తుంది.గుడి బయటిగోడలపై అనంత శిల్పసంపద వుంది. రామాయణం,మహాభారతంలోని గాధలకు సంబంధించిన ఎన్నో శిల్పాలు కనువిందు చేస్తున్నాయి. ఆలయ మహా మండపంలో భారీ స్తంభాలున్నాయి. ఆ స్తంభాల్లోని శిల్పాలు అద్భుతంగా వున్నాయి. శ్రీరాముడు, సీత,లక్ష్మణుడు,హనుమంతుడు మూలవిరాట్ గా కొలువుదీరారు. ఆ విగ్రహాలు నయనానందకరంగా వున్నాయి. 

మారుతి రామాయణ కావ్యాన్ని చేతబట్టి ధ్యానముద్రలో వుండడం ఆశ్చర్యం కలిగించే అంశం. గుడి ముందు ఎత్తయిన దీపస్తంభం వుంది. దేవాలయ ప్రవేశమార్గంలో ఒక వైపు ఆంజనేయుడు-మరో వైపు గరుత్మంతుని నిలువెత్తు విగ్రహాలను పెద్దబండలపై చెక్కారు. ఆలయంలో అగుపిస్తున్న విశేష శిల్ప దృశ్యాలనుబట్టి శ్రీరామసన్నిధిని విజయనగరరాజ్య ప్రభువు సాళువనరసింహరాయలు నిర్మించి వుండవచ్చు.

సాళువ 1485-90 మధ్య సామ్రాజ్య భారాన్ని వహించాడు. హంపికి వెళ్ళకముందు పెనుకొండ సీమను పాలించాడు. పెనుకొండకు రాక మునుపు చంద్రగిరిలో విజయనగర సామంత రాజుగా పాలన సాగిస్తూ రాజ్యంలో ఎన్నో ఆలయాలను కట్టించాడు. కాగా విశ్వేశ్వర, రామభద్రాలయాల్లో ఎటువంటి శాసనాలు లభించలేదు.

గగనమహల్: గగనమహల్ గా పిలువబడుతున్న కట్టడం ఒక రాజభవనం. రెండు అంతస్తులతో, కొన్ని గదులతో అలరారుతున్నది. నిర్మాణం ఇండో- పర్షియన్ శైలిలో సాగింది.మొదటి అంతస్తులో దర్బారుగది వుంది. కానీ రాజు అక్కడ కూర్చొని సభ నిర్వహించే అంత విశాలంగా లేదు. గగనమహల్ చాలాచిన్నది. రాజభవనానికి వుండవలసిన హంగులు లేవు. చుట్టూ సైనికుల కాపలా భవనాలు లేవు. చంద్రగిరిలోని రాజభవనం నిర్మాణాన్ని అనుసరించి గగనమహల్ ను కట్టించి వుండవచ్చు.

గగనమహల్ శ్రీక్రిష్ణదేవరాయల వేసవి విడిదిగా ఖ్యాతిగాంచింది. వాస్తవానికి రాజుల పాలనలో వెలువడిన సాహిత్యంలో గగనమహల్ ప్రస్తావన ఎక్కడా లేదు. వేసవి విడిది అనడానికి వాడుక కథనాలు మాత్రమే ఆధారం. మహల్ పై వున్న ఒక ఫలకంలో 1575 అని సంవత్సరం చెక్కారు. దాని ప్రకారం శ్రీక్రిష్ణదేవరాయల మనుమడైన మరో శ్రీక్రిష్ణదేవరాయలు ఆ భవనాన్ని వినియోగించి వుంటాడు.

నాటి  అరవీటి రామరాయలు-క్రిష్ణదేవరాయల పెద్దకుమార్తె తిరుమలాంబల సంతానమే మరో శ్రీక్రిష్ణదేవరాయలు.రక్కసి-తంగడి యుద్ధం(1565) తర్వాత రాజకుటుంబీకులు పెనుకొండకు వచ్చారు. పెనుకొండను విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా చేసుకొని అరవీటి తిరుమల దేవరాయలు రాజ్య పాలనను తిరిగి ప్రారంభించాడు. తిరుమలరాయలు శ్రీక్రిష్ణదేవరాయల చిన్న కుమార్తె వెంగళాంబను వివాహ మాడాడు.

సొరంగ మార్గాలు: గగన మహల్ నుంచి కొండపై గల భవనంలోకి ఒక సొరంగమార్గం వుండేదట. సొరంగ మార్గం పూర్తిగా మూసివేసి వుండడాన్ని గమనించవచ్చు. అదేవిధంగా వీరన్నకొండకు కూడా సొరంగ మార్గం వుండేదట.వీరన్నకొండ నుంచి, పెద్దకొండపై వున్న భవనం నుంచి మరికొన్నిచోట్లకు రహస్య మార్గాలుండేవట.అయితే వాటన్నింటినీ మూసివేశారు. 

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాజులు-వారి కుటుంబీకులు సురక్షితంగా బయటకు వెళ్ళడానికి ఆ రహస్య మార్గాలను వాడుకొనే వారని చరిత్రకారులు పేర్కొన్నారు. గగనమహల్ ఎదురుగా తిమ్మరుసును ఖైదు చేసిన గది వుంది. అంతచిన్న గదిలో విజయనగర సామ్రాజ్య మహామంత్రిని బంధించి వుంచారంటే నమ్మశక్యంగా లేదు. రాయలవారి మరణానంతరం మహామంత్రి తిమ్మరసు శాసనాలు కాశి, తిరుమలలో కనిపిస్తాయి.

‘తిమ్మరుసు కన్నులు పీకించి పెనుకొండలో బంధించడం’ అనే అంశంపై లోతైనపరిశోధన జరుగవలసి వుంది. గగనమహల్ ఎదుట తూర్పున ఒక గాలిగోపురం వుంది. ఆలయాలకు వెళ్ళే మార్గంలో గాలిగోపురాలు, గుడికి చాలా దగ్గరలో రాజగోపురాలు నిర్మించడం పరిపాటి. కానీ ఇక్కడ గాలిగోపురం ఎందుకు కట్టించారో..అంతుచిక్కని విషయం. గోపురనిర్మాణం పూర్తిగా విజయనగర శైలిలో సాగింది.

అజితనాథ గుడి: జైన తీర్ధంకరుడు, అజితనాధ స్వామి సన్నిధి చాలా సుందరంగా వుంది. గుడి నిర్మాణం విజయనగర శైలిలో సాగింది. జైన శిల్పాలు విశేషంగా ఆకట్టుకొంటాయి. ఆ సన్నిధి పక్కనే బసవన్న బావిగా పిలవబడుతున్న కోనేరువుంది. కోనేరుమెట్లపై బసవన్న విగ్రహం వుంది. దానిని గారతో నిర్మించారు. బసవన్న బావి ముందు శ్రీక్రిష్ణ దేవరాయల శాసనం (1510) వుంది.

అవిముక్తీశ్వరాలయం: అజితనాథగుడి నుంచి గోరంట్ల కోటవాకిలి వైపు వెళ్ళే మార్గంలో కుడి పక్కన ఐముక్తేశ్వరాలయం వుంది. ఆలయంపేరు అవిముక్తేశ్వర సన్నిధి అని శాసనాల్లో వుంది. కానీ ఐముక్తేశ్వరాలయం అని జనం పిలుస్తున్నారు. ప్రధాన ప్రవేశం పడమర వైపు వున్నా.. గుడిని తూర్పునకు ఎదురుగా కట్టారు. గర్భగుడి,అంతరాళం,ముఖ మండపం, మహామండపం, రంగ మండపం, యాగ మండపం, బయట బన మండపాలతో సంపూర్ణ దేవాలయంగా భాసిల్లుతున్నది.

ప్రధాన గోపురం భారీగా వున్నా.. అసంపూర్తిగా వుంది. మూలవిరాట్-శివలింగం ‘అవిముక్తేశ్వర’ స్వామిగా పూజలందుకొంటున్నది. శివ లింగానికి ఎదురుగా ముఖమండపంలో నందీశుడు కొలువయ్యాడు. నందివిగ్రహం విజయనగర శైలికి దర్పణంగా వుంది. విజయనగర నిర్మాణాల తొలిదశకు చెందిన కోవెలలోని స్తంభాల్లో చెప్పుకోదగ్గ శిల్పాలు లేవు. శివయ్యసన్నిధి చాలా విశాలంగా వుంది. గుడిని ఎవరు ఎప్పుడు కట్టించారనడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. 

గుడిలోని తొలి శాసనాన్ని బట్టి రెండో హరిహర రాయల కుమారుడైన ఒకటో దేవరాయల కాలం(క్రీ.శ.1406-1422)లో కోవెల రూపుదిద్దుకొని వుండవచ్చు. సంస్కృతం,తెలుగు,కన్నడ భాషల్లో శాసనాలున్నా సంస్కృతశాసనాలు మాత్రమే చారిత్రక వెలుగును ప్రసరింప చేస్తున్నాయి. తెలుగు, కన్నడ శాసనాలు రూపు చెదిరాయి.

వీరన్న కొండ: భోగసముద్రం చెరువు పడమర పక్కన తపస్సు చేస్తున్న ఉమాపతి విగ్రహం ఎంతో సుందరంగా వుంది. చెరువుకు దక్షిణాన వీరన్నకొండవుంది. లేపాక్షి వీరభద్రస్వామి గుడిని నిర్మించిన నిరూపన్న – వీరన్న సోదరులు పెనుకొండ నంది ముద్దమాంబ-లక్కిశెట్టి ల సంతానం. వీరన్న కొండపై వీరభద్ర దేవాలయం అద్భుతంగా వుంది. కొండ మెట్ల మార్గంలో అసంపూర్ణ నంది విగ్రహం వుంది.

వీరన్నకొండ నుంచి బయటి ప్రాంతాలకు సొరంగ మార్గాలున్నాయి. పెనుకొండ పెద్దకొండపై శిథిలమైన నరసింహాలయం, బ్రహ్మసరస్సు కోనేరు, ఖిల్లా రాజభవనం వున్నాయి.పెనుకొండ కొత్త పట్టణంలోని బాబయ్య దర్గా మత సామరస్యానికి ప్రతీకగా వుంది. దర్గాలకు వెళ్ళే ఆచారం ముస్లిమ్ సంప్రదాయమే, అయినా హిందువులు కూడా దర్గాను సందర్శిస్తున్నారు.పెనుకొండ కోట-చారిత్రక కట్టడాలు, గుడులను భారతవారసత్వ సంపదగా గుర్తించి అభివృద్ధి చేయవలసిన బాధ్యత కేంద్ర పర్యాటక – సాంస్కృతిక శాఖపై వుంది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!