A channel that changed lifestyle………
ఈ ఫొటోలో కనిపించే 27 ఏళ్ళ యువకుని పేరు … హర్ష్ రాజ్ పుత్ …. ఒకప్పుడు నిరుద్యోగి. ఉద్యోగాల కోసం తిరిగి తిరిగి వేసారి పోయాడు. అనుకోకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టాలన్న ఆలోచన వచ్చింది. అంతే వెనుకా ముందు చూడకుండా స్టార్ట్ చేసాడు. యూట్యూబ్ అతగాడి జీవితాన్ని మార్చేసింది.
అతను పెట్టిన వీడియోలన్ని వీక్షకులను ఆకట్టుకున్నాయి. యూట్యూబ్ టార్గెట్స్ ను అధిగమించడంతో కనక వర్షం కురుస్తోంది. ఇప్పుడు లగ్జరీ కార్లతో షికార్లు.. నెల నెలా రూ.4 లక్షలకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నాడు. అతని యూట్యూబ్ ఛానెల్ కు దాదాపు 40 లక్షల మంది సబ్ స్క్రైబర్ లు ఉన్నారు.
ఇటీవలే రూ.50 లక్షలు పెట్టి ఆడీ కారు కొన్నాడు.. బీహార్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.. ఔరంగాబాద్ కి చెందిన హర్ష తండ్రి పోలీస్ శాఖలో హెూంగార్డుగా పని చేసేవాడు. హర్ష్ కూడా చదువయ్యాక ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అవేవీ ఫలించకపోవడంతో యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాడు.
వివిధ సామాజిక అంశాలపై, సమస్యలపై హర్ష్ చేసే కామెడీ వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. హర్ష్ రూపొందించిన ఒక వీడియోకైతే ఏకంగా 2 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం నెలకు సగటున రూ.4.5 లక్షలు సంపాదిస్తున్నాడు. ఒక నెలలో అయితే గరిష్టంగా 8 లక్షలు సంపాదించాడు. బ్రాండ్ ప్రమోషన్ వర్క్ కూడా చేస్తుంటాడు.
నటుడిగా రాణించాలనేది ఇతగాడి కోరిక. కరోనాకు ముందు ముంబై వెళ్లి నటనలో శిక్షణ కూడా తీసుకున్నాడు.కానీ లాక్ డౌన్ సమయంలో సొంత ఊరు వచ్చి యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాడు. దీంతో అతని కుటుంబ సమస్యలు కూడా తీరాయి. యూట్యూబ్ ఛానెల్ తో అతని లైఫ్ స్టైల్ మారిపోయింది.