Pollution is burning…………………………….
అక్కడ 40 ఏళ్ళ వయసుకే జనాలంతా ముసలి వాళ్ళుగా మారిపోతున్నారు. ఎముకలు కరిగిపోయి, శరీరం బలహీనమై వంగిపోయి వృద్ధులుగా మారిపోతున్నారు. 15సంవత్సరాలు దాటితే చాలు వయసు పెరిగిపోతున్న సూచనలు కనబడుతున్నాయి.
ఇంతకూ ఆ ప్రాంతం ఎక్కడో లేదు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సింగ్రౌలి అనే జిల్లా ఉంది. అక్కడ ఈ సమస్య ఎక్కువగా ఉంది. సింగ్రౌలి ప్రజలు కాలుష్యం వల్ల నరకం అనుభవిస్తున్నారు.సింగ్రౌలి ప్రాంతంలో 11 ధర్మల్ పవర్ ప్లాంట్లు, 16 బొగ్గు గనులు, 10 కెమికల్ ఫ్యాక్టరీలు, 8పేలుడు పదార్థాలు తయారు చేసే ఫ్యాక్టరీలు, 309 క్రషర్ ప్లాంట్లు ఉన్నాయి.
ఇవి మాత్రమే కాకుండా సిమెంట్, ఉక్కు, అల్యూమినియం పరిశ్రమలు కూడా ఇక్కడ ఉన్నాయి. 10ధర్మల్ పవర్ ప్లాంట్ల నుండి ప్రతి రోజూ 21వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. ఇందు కోసం సంవత్సరానికి 103 మిలియన్ టన్నుల బొగ్గు వినియోగిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా మిలియన్ టన్నుల కొద్ది ఎర్రమట్టి, ఇతర రసాయనాలు కూడా ఉపయోగిస్తుంటారు.
ఈ మొత్తం వినియోగాల తరువాత వాటి నుండి వెలువడే వ్యర్థపదార్థాలన్నీ సింగ్రౌలీ ప్రాంతాన్ని కలుషితం చేస్తున్నాయి. వీటికి తోడు రవాణా కోసం ప్రతిరోజూ వేలకొద్ది వాహనాలు వచ్చిపోతుంటాయి. దీనివలన ఇక్కడ కాలుష్యం ప్రమాదకర స్థాయికి మారింది. వాయు నాణ్యత సూచిక (AQI) ప్రకారం ఇక్కడ గాలి నాణ్యత 900 points నుండి 1200 points మధ్య ఉంటోంది. ఇది 20 నుండి 25 రెట్లు అధిక కాలుష్యాన్ని సూచిస్తోంది. మామూలుగా AQI ప్రకారం 500 points దాటితే ప్రమాదం స్థాయికి చేరుకున్నట్టే.
ఇక ఇక్కడ వెలువడుతున్న రసాయన వ్యర్థాల వల్ల భూమి సారం తగ్గిపోయి వాటి ప్రభావం భూగర్భజలాల పై పడింది. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా బూడిద కనిపిస్తుంది. చిన్నపాటి గాలికి కూడా ఈ బూడిద పైకి లేచి కాలుష్యాన్ని వ్యాప్తి చేస్తోంది. ఈ గాలి పీల్చుకోవడం వల్ల అక్కడి ప్రాంత ప్రజలకు టి.బి వంటి ప్రమాదకర శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయి. నీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండటం వల్ల ఎముకలు ప్రభావానికి గురవుతున్నాయి.
నీరు కూడా విషపూరితమైపోవడం వల్ల నీటిలో చేపలు కూడా విషం గా మారుతున్నాయి . పీల్చేగాలి, తీసుకునే ఆహారం, తాగే నీరు ఇలా అన్నింటి నుండి ప్రమాదకర స్థాయిలో శరీరాల్లోకి పాదరసం చేరడం వల్ల శరీరంలో ఎముకలు కరిగిపోయి 40 సంవత్సరాలకే శరీరం వంగిపోయి ముసలివాళ్ళు అయిపోతున్నారు. ఇక్కడి ప్రజల సమస్యల పట్ల ఎన్జీవో సంస్థలు పనిచేస్తున్నాయి. ప్రభుత్వాలపై పోరాడుతున్నాయి.