New political Scene ……………………………………….
గుజరాత్ రాజకీయ యవనిక పైకి ఒక జర్నలిస్ట్ దూసుకొచ్చారు. ఆయన పేరు ఇసుదాన్ గఢ్వీ . ఎన్నో కుంభకోణాలను వెలికి తీసిన ఖ్యాతి ఆయనది. ఆప్ సీఎం అభ్యర్థిగా ఇసుదాన్ గఢ్వీ పేరును పార్టీ అధినేత కేజీవాల్ ప్రకటించారు. గఢ్వీ.. జర్నలిస్టుగా ఎంతో పాపులారిటీ సాధించారు. ఏడాది క్రితమే ఆప్ లో చేరి జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు.
40 ఏళ్ల గఢ్వీ.. గుజరాత్ లోని ద్వారక జిల్లా పిపాలియా గ్రామంలో ఉన్నత రైతు కుటుంబంలో జన్మించారు. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్లో మాస్టర్స్ చేసిన ఆయన.. దూరదర్శన్ లో ‘యోజన’ అనే కార్యక్రమంతో కెరీర్ ప్రారంభించారు. 2007 నుంచి 2011 వరకు ఈటీవీ గుజరాతీ ఛానల్ లో ఫీల్డ్ జర్నలిస్టుగా పనిచేశారు.
ఆ సమయంలో దాంగ్, కపరాడా తాలూకాల్లో అక్రమ అటవీ నిర్మూలన కుంభకోణాలను వెలికి తీశారు. గఢ్వీ కథనాలపై స్పందించిన అప్పటి గుజరాత్ ప్రభుత్వం ఈ కుంభకోణాలపై చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే గఢ్వీ పేరు రాష్ట్రమంతటా మార్మోగింది.ఆ తర్వాత 2015లో గఢ్వీ.. వీటీవీ గుజరాతీ ఛానల్ లో చేరి ఎడిటర్‌గా చేరారు.
2021 వరకు అక్కడే పనిచేసిన ఆయన ప్రైమ్ టైమ్ టీవీ షో ‘మహామంథన్’ కార్యక్రమానికి హెూస్ట్ గా వ్యవహరించారు. అనేక అంశాలపై ఆయన ప్రముఖులు, ప్రజలతో చర్చావేదికలు నిర్వహించారు. ఈ షో ఆయనకు మంచి పేరు తో పాటు విశేషాదరణ తెచ్చిపెట్టింది.గఢ్వీ ఏడాది క్రితమే మీడియాను వీడి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
2021 జూన్లో అరవింద్ కేజ్రీవాల్ అహ్మదాబాద్లో ఆప్ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇదే వేదికపై గఢ్వీ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆ తర్వాత పార్టీలో క్రమక్రమంగా ఎదిగారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం.. ప్రజల్లో ఉన్న మంచి పేరు కారణంగా ఈ ఏడాది జూన్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనను జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శిగా నియమించింది.
పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ లోనూ గఢ్వీ సభ్యుడిగా ఉన్నారు. గతేడాది గుజరాత్ లో ఓ ప్రభుత్వ నియామక పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఆ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టింది. ఆ ఆందోళనను అడ్డుకున్న పోలీసులు పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను అరెస్టు చేసి జైలుకు పంపించారు.
వీరిలో గఢ్వీ కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. గఢ్వీ ఓబీసీ నేత. గుజరాత్ లో 48శాతం ఈ సామాజిక వర్గానికి చెందినవారే. ఇది కూడా ఆయనకు ప్లస్ కావచ్చు. కేజ్రీ వాల్ ఎస్ఎంఎస్, వాట్సాప్, వాయిస్ మెయిల్, ఈ-మెయిల్ ద్వారా సీఎం అభ్యర్థిని సూచించమని ప్రజలను అడిగారు.
ఇందుకు 16,48,500 మంది స్పందించారు.అందులో 73 శాతం మంది గఢ్వీ పేరును సూచించారు. ఆ మేరకు ఆయన పేరును ప్రకటించారు. ప్రజలకు న్యాయం అందించడం, సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానంటున్నారు గఢ్వీ.. ఆయన కల నెరవేరుతుందో లేదో చూద్దాం.