డప్పుని గిటార్లు కలిశాయి!!

Sharing is Caring...

Mohan Artist ………………………………………………..

కోరి కష్టాలు కొని తెచ్చుకోవడమంటే ఇదే. లక్షణంగా బి.టెక్. పాసై సుఖంగా ఇంజనీరు ఉద్యోగం చేస్తూ పెళ్ళాం బిడ్డల్ని చూసుకుంటూ నాలుగు రాళ్లు వెనకేస్తే ఎంత బావుంటుంది. నలుగురూ మెచ్చు కుంటారు. పరువూ మర్యాదా ఉంటాయి.

కానీ ఇవన్నీ చెయ్యలేనని లెల్లే సురేష్ బి.టెక్. డిగ్రీ ట్రంకు పెట్టెలో అడుగున పారేశాడు.
ఉన్న ఉద్యోగం మానేశాడు. సుఖాన ఉన్న ప్రాణాన్ని కష్టపెట్టుకుంటానని డప్పు బజాయించి మరీ చెప్పాడు. మరేం చేస్తావంటే పాట రాస్తానన్నాడు. పాడి వినిపించాడు. తానే చిందువేశాడు. డప్పు కొట్టాడు. ఇదంతా జనం కోసమన్నాడు. ఉద్యమాల్లో చేరాడు. దళితుల కోసం విప్లవమన్నాడు.

ఉద్యమాల్లో తిరిగాడు. గడవడం కష్టమయింది. మధిర తాలూకా రాయపట్నంలో ఎప్పుడో చిన్నపుడు “మనసు బాగోలేదు మాధురీ” అని అమ్మపాడుతున్నపుడు వింటానికి చాలా బాగుండేది. ఇప్పుడు నిజంగా మనసు బాగాలేదు. పోస్టర్లు గీయించీ, అచ్చేయించీ, గోడలకి అతికిస్తే ఏమవుతుంది?

కాళ్లకు గజ్జెలు కట్టి, ఊరేగింపు మధ్యలో డప్పుకొట్టి పాటపాడి డాన్సు వేసి ఇంటికి తిరిగొస్తే వేడి వేడి గా ఉండవుగా! అయినా సరే ఇదే పని చేస్తానన్నాడు. ‘ప్రాణమైనా పోనీ పాట మానను’ అన్నాడు.
 ‘అదే ట్యూన్ కట్టి పాడాడు’. ఐదారేళ్ల క్రితం ఈ పాట పతాకంగా ‘లెల్లే’ అనే దళిత కళా కేంద్రం పుట్టింది.

హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, చిత్తూరు, ఇంకా ఎన్నెన్నో చోట్ల లెల్లే ప్రదర్శనలు హిట్. 2000 సంవత్సరం మొదట్లో ‘చిందు’ సాంస్కృతిక సంస్థ ప్రారంభమయింది. మరుసటి ఏడాది చిత్తూరులో ‘లెల్లే’ అనే దళిత కళా కేంద్రం పుట్టింది. మరుసటి ఏడాది చిత్తూరులో చిందు నడిపిన వర్క్ షాప్ కి బ్రిటన్ కళాకారుడు గార్త్ వచ్చాడు .

అక్కడి డప్పులు , చిందులతో ముగ్ధుడైపోయాడు . తర్వాత డప్పులు గిటార్లు కలిసిన అపురూపమైన  ఫ్యూజన్ music లో దళిత డ్రం అనే ఆల్బమ్ ని గార్త్ తయారు చేశాడు. ఇది ప్రపంచానికి డప్పు గొప్పదనాన్ని చాటింది. కలోని యల్  కజీన్స్ పాటలకు సంగీతానికి దళిత డ్రం కూ తేడా కొట్టొచ్చినట్టు వినిపిస్తుంది.

ఈ ఫ్యూయూజన్ పూర్తిగా వేరే. రెండూ వింటేగానీ తేడా తెలీదు. ఇదంతా ఇలా జరగడానికి దళిత మానవ హక్కుల సంస్థ గాయకుడు పాల్ దివాకర్ గ్రీన్ రూమ్ సన్నాహకుడు. స్టేజీమీద గొంతెత్తి, చిందేసి రక్తికట్టించిన సూత్రధారి సురేష్.

ఆ ఏడాది సెప్టెంబర్లో దేశంలోని దళిత ప్రతినిధులెందరో దక్షిణాఫ్రికావెళ్ళారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా డర్బన్ లో జరిగిన సభకు సురేష్, కలెకూరి ప్రసాద్, గోరటి వెంకన్న, మాస్టర్జీ ఇంకా ఎందరో వెళ్లారు. అక్కడ ప్రపంచ ప్రతినిధులంతా సురేష్ డప్పు చప్పుడు వెంట చిందు లేయడం గురించి ప్రత్యక్షసాక్షి చంద్రభానుప్రసాద్ ‘పయనీర్’ ‘వార్త’ పత్రికల్లో రాసిన వ్యాసాలు చదివితే విస్తుపోతాం.

పదిహేనేళ్లుగా రామ్ నగర్ సందుల్లో మురికి రూముల్లో చిన్న స్టేజీల మీద మనకి తెలిసిన పాట సురేష్ , మనతో రోజు వన్ బై టూ లు తాగే డప్పు సురేష్, లెల్లేఓడు, చిందుగాడు, హరిశ్చంద్ర కాటి సీను పద్యాలు పాడే మన సురేష్ గాడు ఇంటర్నెషనల్ హిట్టంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆనందం కూడా. ఇది పరిచయం ఉన్న వాళ్ల సంగతి.

అసలు విషయం , ప్రపంచానికి మన వట్టి గొప్పలు కాకుండా , డప్పు గొప్పలు వినిపించాయి. తెలుగు తనాన్ని, దళితుల కళనీ చాటే దాని అందం ప్రపంచంలో అందరికీ తెలిసింది. లండన్ లో గార్త్ తన ఆల్బమ్ తో చేసిన పనిని, డర్బన్లో తన డప్పుతో సురేష్ చేశాడు. తిరిగొచ్చాక డర్బన్ కబుర్లన్నీ వందసార్లు చెప్పారు.

కానీ సురేష్ ఎంత బద్దకస్తుడంటే ఒక్క పత్రికలో కూడా ఈ అనుభవాలు రాయలేదు. ప్రపంచంలో అందరికీ వినిపించిన డప్పు కనిపించిన చిందూ, తెలుగు దేశంలో ఎక్కడా తెలీకుండా టాప్ సీక్రెట్గా మిగిలిపోయింది. ఇలాంటిదే మరో అతి రహస్యమ్ ఉంది.

డర్బన్ నుండి తిరిగొచ్చాక నెల తిరక్కముందే లండన్ నుండి కబురొచ్చింది. బ్రిటన్, ఐర్లాండ్లో పదిహేను, ఇరవై నగరాల్లో, పట్నాల్లో ప్రదర్శనలివ్వాలి. మళ్లీ మామూలే. సురేష్ తన లెల్లే నల్లడ్రస్సూ, ఎర్రపాగా, ఎర్రదట్టి, గజ్జెలూ డప్పు సర్దుకున్నాడు. ఒక్కగానొక్కడు. ఒకే డప్పు. దీని దరువుకి లండన్ గిటార్లు వంతపాడాయి.

బ్రిటీష్ గాయకులు చిందులేస్తూ పాడతారు. వాళ్లతో కలిసి అలా డప్పు కొట్టడం అలవాటు లేని పని. ప్రెస్ క్లబ్లో, సుందరయ్య విజ్ఞాన భవన్ లో బుజ్జీ, శీనూ, సురేంద్ర, ప్రసాదూ, సత్యానంద్ ని పోగేసి  , వాళ్లదరువుని  మల్లేపల్లి లక్ష్మయ్య , అనంత్ , శ్రీరామ్ లని జతచేసి మధ్యలోనించునీ, ప్రసంగాలివ్వడం పాటలు పాడడం పరమ వీజీ, బాయే హాత్ కా ఖేల్ హై .

మరి ఎన్నడూ, చూడనీ, విననీ, కననీ స్టేజీ మీద మళ్లి అట్లాంటి వాళ్లతోటే దరువెయ్యాలంటే అది ఛాలెంజ్. కాదు మిషన్ ఇంపాజిబుల్. కానీ ఈ అసాధ్యమే జరిగింది. అందునా ఎంత హంగామాగా జరిగిందంటే- ఎలెస్మియర్ పార్ట్ పట్నంలో ప్రదర్శన చివర హాలంతా చప్పట్లతో మారు మోగింది. ప్రేక్షకుల్లోంచి ఒకమ్మాయి స్టేజీ మీద కొచ్చి సురేష్ కి అమాంతం ముద్దిచ్చి తాను ముగ్ధనయ్యానంది.

అలాగే బెల్ ఫాస్ట్ లో.. ఈ సిటీ పేరు చెప్తే చాలు బ్రిటన్ పాలన మీద సాగుతున్న నాలుగు వందల ఏళ్ల పోరాటం కళ్లముందు తిరుగుతుంది. ఐరిష్ రిపబ్లికన్ ఆర్మి సాహసాలు గుర్తొస్తాయి. ఐర్లాండ్ పోరాటం అని కార్ల్ మార్క్స్ రాసిన పెద్ద పుస్తకమూ కనిపిస్తుంది.

బెల్ఫాస్ట్ హాల్లో అందరూ సురేష్ ని  షేక్ హాండ్స్ తో ‘సింప్లీ సుపర్బ్’లతో ముంచెత్తుతున్నప్పుడు ఓ పెద్దావిడ నల్లటి తల్లి దగ్గరకొచ్చింది. ‘ఎక్స్యూజ్ మీ  నిన్ను కావిలించుకోవచ్చా” అని పూర్తి విక్టోరియన్ బ్రిటీష్ మేనర్స్  తో అడిగింది. ‘అదేమంత భాగ్యం, ఆనందంగా’ అంటూ చేతులు చాపాడు సురేష్.
ఆమె గాఢంగా కావిలించుకుంది.

‘నేను కదిలిపోయాను… కన్నీళ్ల పర్యంతమయ్యాను. దేవుడు నిన్ను దీవించుగాక, నీవు కలకాలం బ్రతకాలి. నీ జనానికి నీ ప్రతిభని సర్వదా అందించు” అంది. ఈ నల్లతల్లి దీవెనని ఎన్నటికీ మరిచిపోలేనంటాడు సురేష్ …. అలా జరిగితే నువ్వేనా నేనైనా మరిచిపోతా మా ఏంటి?

లండన్ సోజర్స్లో ఎలాటి ఆర్టిస్టులతో మనోడు కలిశాడో చూడండి. తను దరువేస్తుంటే క్లిఫ్ రిచర్డ్స్ గొంతెత్తి’  షిఈజ్ రన్నింగ్ ఆన్ ఇన్ టు ఎ ఫ్యూచర్ జస్ట్ బిగన్’ పాటపాడాడు. క్లిఫ్ రిచర్డ్స్ అంటే ఎవరో తెలుసా? రికీ మార్టిన్ జెనరేషన్కి తెలికపోవచ్చు. ఇండియాలో రాజకపూర్ జెనరేషన్ కి తెలుస్తుంది.

అరవయ్యో దశకంలో సూపర్ హిట్ హాలివుడ్ సినిమాలో ‘వుయార్ గోయింగ్ టు సమ్మర్ ‘హాలిడేస్’ పాట ప్రపంచాన్ని ఊపింది. ఈ పాట బెజవాడ లీలామహల్ బయట రిక్షావాళ్లు కూడా చెప్పగలరు. రాజ్ కపూర్  సంగం సినిమాలో అన్ని భాషల్లో నిన్ను ప్రేమిస్తున్నాను అనే పాట గుర్తుందా? ‘యీష్ లెబెటిష్, ఐలవ్ యూ, యాలూబ్ లుబా ఐలవ్ యూ’ దీన్ని రఫీ పాటల్ని మననం చేసినట్టే దేశమంతా పాడింది.

అలాంటి క్లిఫ్ రిచర్డ్స్ మన సురేష్ డప్పుకి డాన్స్ చేస్తూ పాటపాడాడంటే విని, గురూ మరోసారి ఆ క్లిఫ్ హేంగింగ్ చెయ్యిలా ఇవ్వు అని మనోడికి షేక్ హ్యాండ్ ఇచ్చాం… బ్రిటన్లోని అందమైన ప్రాంతం బోర్న్ మౌత్లో మొదటి ప్రదర్శనే క్లిఫ్ తో  జరిగింది. పాల్ ఫీల్డ్ ప్రముఖ రచయిత, సంగీత దర్శకుడు. గిటార్ దంచుతాడు లైట్ ఇంజనీర్ రిచర్డ్ మార్టిన్ స్టేజిని జిగేల్మనిపించాడు.

ఫోటో గ్రాఫర్ టిమ్ తన సైడ్స్ బాక్ డ్రాప్ ని ముంచేశాడు. ఐర్లాండ్ నుంచి వచ్చిన చలాకీ సౌండ్ ఇంజనీరు ట్రాపర్ డప్పుకీ గిటార్ కీ రెండు  సౌండ్ ట్రాక్లు పెట్టాడు. ప్రదర్శన మొదలయింది.
అబి అనే అమ్మాయి ఆడ గొంతుతో. ఆ గొంతు వెంటాడి వేధిస్తుంది. దాని వెంట పాల్ ఫీల్డ్ గిటార్  మెల్లగా లేస్తుంది. పాల్ గొంతు అబీ గొంతుతో కలుస్తుంది.

ఆ గొంతులు షడ్జమంలో కెళ్తున్నపుడు సురేష్ ప్రేక్షకుల్లోంచి లేస్తాడు. వాళ్ల గిటార్ల గొంతులకి మన డప్పు దరువేస్తూ. -మెట్లెక్కుతూ, పులివేషం చిందులేస్తూ సురేష్ స్టేజీ మీదకొస్తాడు.  అపుడు పాల్ ఫీల్డ్ గిటార్తో గొంతెత్తి “హి ” ఈజ్ హోల్డింగ్ ఆన్” అని అందుకుంటాడు ….అబీ గొంతుతో కలుస్తుంది.
క్లిఫ్ రిచర్డ్స్ ఊరుకోడు …ఇంతా జరిగితే జనం చావరా మరి !

(2002లో లెల్లే సురేష్ కోసం ఆంధ్రజ్యోతి దినపత్రికలో మోహన్ రాసిన వ్యాసం ఇది.)

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!