Will the target be met?………………………………………..
విశ్వం పుట్టుక, రహస్యం, నక్షత్రాలు వంటి పలు అంశాలను ఛేదించేందుకు ప్రయోగించిన జేమ్స్ టెలిస్కోప్ ఉల్కా పాతం తో దెబ్బ తిన్నది. దీనితో ఈ టెలీస్కోప్ లక్ష్యాలు నెరవేరే అంశంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మే నెలలోనే ఈ ఘటన జరిగినప్పటికీ.. కొద్ది రోజల క్రితమే అది కొన్ని అద్భుత చిత్రాలను పంపడం శాస్త్రవేత్తలకు కొంత ఊరటనిస్తుంది. ఈ టెలిస్కోప్ పంపించిన చిత్రాలు ప్రపంచాన్ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అమెరికా అంతరిక్ష పరిశోధక సంస్థ ప్రయోగించిన ఈ అత్యంత శక్తిమంతమైన టెలిస్కోప్ జేమ్స్ వెబ్ ఎంత కాలం పనిచేస్తుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఈ భారీ టెలీస్కోప్ నిర్మాణానికి నాసా 10 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది. మే నెలలో అనేక గ్రహ శకలాలు ఢీకొనడం తో అది పని చేస్తుందా లేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
కొందరు శాస్త్రవేత్తలు వెలువరించిన తాజా నివేదికలో ప్రకారం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పనితీరును పరిశీలించినపుడు సరిదిద్దడానికి వీలు కానటువంటి సమస్యలు కనిపించాయి.ప్రస్తుతం సూక్ష్మమైన ఉల్కలు ఢీకొనడం తో దాని పని తీరుపై దీర్ఘకాలిక ప్రభావం పడుతోందని అంటున్నారు.
అయితే ఈ నష్టం వల్ల ప్రైమరీ మిర్రర్ రిజల్యూషన్ దెబ్బతినలేదని, సూక్ష్మ ఉల్కలు ఢీకొనడం వల్ల మిర్రర్స్, సన్‌షీల్డ్ నెమ్మదిగా క్షీణిస్తాయని ఈ వెబ్‌ను డిజైన్ చేసిన ఇంజనీర్లు చెబుతున్నారు. జేమ్స్ వెబ్ టెలీస్కోప్ ను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ సహకారంతో నాసా నిర్మించింది. స్పేస్ టెలిస్కోప్‌లో అత్యంత భారీ మిర్రర్స్‌లో ఒకటి దీనిలో ఉంది.
2021 డిసెంబర్ 25న క్రిస్మస్ నాడు ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు. ఇప్పటికే రోదసీలో ఉన్న హబుల్ టెలిస్కోప్ స్థానంలో జేడబ్ల్యూఎస్‌టీని ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి నాటికి భూమి నుంచి 16 లక్షల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో ఉంది. సెకండ్ లగ్రాంగ్ పాయింట్ ప్రాంతంలో ఉంది.
ఈ టెలీస్కోప్ కార్యకలాపాలు 10 సంవత్సరాలపాటు కొనసాగుతాయని భావించినప్పటికీ.. ఇందులో 20 ఏళ్లు నిరంతరంగా పనిచేయడానికి తగినంత ఇంధన సామర్థ్యం ఉందని అమెరికా పరిశోధన సంస్థ అంటోంది. ఈ అరుదైన టెలీస్కోప్ రూపకల్పనకు 20,000 మంది ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, కంప్యూటర్ ప్రోగ్రామర్లు, ఎందరో శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారు.