This election is crucial for Shinde and Uddhav Thackeray ……………………
ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మరో మారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కోప్రి-పచ్పఖాడి శాసనసభ నియోజకవర్గం నుంచి నాలుగు మార్లు ఎమ్మెల్యే గా ఎన్నికైన ఏక్‌నాథ్ షిండే ఐదో సారి కూడా అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.గతంలో ఆయన అవిభక్త శివసేన అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.
ఈ సారి శివసేన చీలిక వర్గం నేతగా బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ ఒకప్పుడు అవిభక్త శివసేన బలంగా ఉండేది. ఇపుడు అక్కడ ఆయన చీలికవర్గం నేతగా బలం పుంజుకున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. స్థానిక నేతలను తన వైపుకు పూర్తిగా తిప్పుకున్నారు. అవిభక్త శివసేన ఈ ప్రాంతంలో బలపడటానికి షిండే కూడా ఒకప్పుడు కృషి చేసాడని అంటారు. వివిధ పదవుల్లో కొనసాగుతూ ఇక్కడి ప్రజలతో మంచి సంబంధాలను కలిగి ఉన్నాడని చెబుతారు.
2004 లో మొదటి సారిగా గెలిచిన షిండే ఆ తర్వాత కూడా వరుస విజయాలు సాధించారు. 2009 లో 32,776 ఓట్ల మెజారిటీ తో కాంగ్రెస్ అభ్యర్థి పై,2014 లో 51,869 ఓట్ల మెజారిటీ తో బీజేపీ అభ్యర్థి పై, 2019 లో 89,300 ఓట్ల మెజారిటీ తో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో శివసేన (యుబిటి) అభ్యర్థిగా కేదార్ దిఘే ఏక్ నాథ్ పై పోటీ చేస్తున్నారు. ఇతను బలమైన అభ్యర్థి కాదని ప్రచారం జరుగుతోంది. బాల్ ఠాక్రే వీరాభిమానులు ఈయనకు ఓట్లు వేయవచ్చు.
2022 జూన్ లో శివసేన రెండుగా చీలిపోవడంతో సమీకరణాలు మారిపోయాయి. మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీ బీజేపీ, సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి అండగా నిలిచింది. అజిత్ పవార్ కూడా ఎన్సీపీ నుంచి విడిపోయి మహాయుతి సర్కార్ లో చేరారు.ముంబై, థానే, పాల్ఘర్,రాయ్‌గడ్,రత్నగిరి,సింధుదుర్గ్ ప్రాంతాలు పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాకరే కాలం నుండి శివసేనకు బలమైన కోటగా ఉండేవి.
పార్టీ లో చీలిక తర్వాత ఇద్దరు మాజీ ఎంపీలతో పాటు కొంకణ్ ప్రాంతానికి చెందిన 29 మంది సిట్టింగ్ సేన ఎమ్మెల్యేలలో 20 మందికి పైగా షిండే కి అనుకూలంగా మారారు. వీరి ఫిరాయింపు తో ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఈ ప్రాంతంలో బలహీన పడింది.
లోక్‌సభ ఎన్నికల్లో కోస్తా మహారాష్ట్రలోని మూడు ప్రాంతాలలలో షిండే శివసేన, బిజెపి,ఎన్‌సిపిలతో కూడిన మహాయుతి కూటమి ఈ ప్రాంతంలో ఏడు స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం. కీలకమైన థానే, కళ్యాణ్, ముంబై నార్త్ వెస్ట్ స్థానాలను షిండే వర్గం గెలుచుకుంది. పాల్ఘర్, రత్నగిరి-సింధుదుర్గ్, ముంబయి నార్త్‌లను బీజేపీ కైవసం చేసుకుంది.
అవే ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ రిపీట్ కావచ్చని షిండే వర్గం అంచనా వేస్తుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు శివసేనకు వారసుడిని నిర్ణయించనున్నాయి. శివసేనను చీల్చి తన వర్గానికి అధికారికంగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఏకనాథ్ షిండే ఎదుర్కొంటున్న అతి పెద్ద పరీక్ష ఇదే.
రాజకీయాల్లో, ప్రజల అభిప్రాయమే అంతిమ నిర్ణయాధికారం.. ఈ క్రమంలో షిండే,ఉద్ధవ్ థాకరేలకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకునేందుకు రెండు వర్గాలు హోరాహోరీ పోరాటం చేస్తున్నాయి. ఓటర్లు ఏవర్గానికి పట్టం కడతారో తేలడానికి నవంబర్ 23 వరకు ఆగాల్సిందే.