Village at Line of Control…………………..
అరుణాచల్ ప్రదేశ్ లోని కిబితూ (Kibithoo) గ్రామ పరిసరాల్లోని ప్రకృతి అందాలు చూపరులను ఆకట్టుకుంటాయి.ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లోని అంజావ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ‘కిబితూ’ గ్రామం ఉంది. ఈ గ్రామం ప్రత్యేకత ఏంటంటే దాని పొలిమేర నుంచి చూస్తే రెండు దేశాలు కన్పిస్తాయి.
ఉత్తరాన చైనా, తూర్పున మయన్మార్ ఉన్నాయి. ఈ గ్రామం ఈశాన్య భారత్ లో ఈశాన్య దిశలో చివరి రహదారిపై ఉంది. ఇక్కడే ‘లోహిత్’ నది భారత్ లోకి ప్రవేశిస్తుంది. ఈ లోహిత్ నది బ్రహ్మపుత్ర నదికి ఉపనది. ఇది టిబెట్ లోని కాంగ్రీ గార్పో శ్రేణిలో పుడుతుంది. అక్కడ దానిని ‘జాయుల్ చు’ అని పిలుస్తారు.
కిబితూ గ్రామానికి వెళ్లే మార్గం పొడవునా సుందరమైన పర్వతాలు దర్శనమిస్తాయి.వాటిపై పడే తెల్లని మంచు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అనేక చోట్ల జలపాతాలు జాలువారుతుంటాయి. ఇవన్నీ పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
కిబితూ గ్రామం ఇండో-చైనా సరిహద్దులో ఉంది. ఈ గ్రామం మిష్మి పర్వతాల్లో.. సముద్ర మట్టానికి 4వేల అడుగుల ఎత్తులో ఉంది. భారత్ లో మొట్టమొదట సూర్యకిరణాలు పడే డాంగ్ వ్యాలీకి తూర్పున కిబితూ కన్పిస్తుంది. నదికి అవతలి వైపు కహెూ గ్రామం ఉంది. ఆ గ్రామాన్ని కూడా మొదటి గ్రామంగా పిలుస్తుంటారు. 1962లో కహెూ లోకి చైనా బలగాలు ప్రవేశించాయి .. అపుడు భారత సైనికులు ధీటుగా ఎదుర్కొని వారిని తరిమి కొట్టారు.
భారత సైనికులు కిబితూ పోస్ట్ వద్దకు సైనిక సామగ్రిని తీసుకెళ్లడానికి ఫుట్ సస్పెన్షన్ బ్రిడ్జిని ఉపయోగిస్తుంటారు. లోహిత్ నది తూర్పు ఒడ్డును, పశ్చిమ ఒడ్డుతో కలిపే ఏకైక దారి ఇది మాత్రమే. ఎక్కువగా కొండచరియలు విరిగి పడుతుండటం వల్ల మిగతా మార్గాలను మూసి ఉ౦చుతున్నారు. భారత సైనికులు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా మధ్య అప్పుడప్పుడు సాధారణ సంప్రదింపులు జరుగుతుంటాయి. అందుకోసం ఎంపిక చేసిన ఐదు బోర్డర్ పాయింట్ల లో కిబితూ కూడా ఒకటి.
కిబుతూ చిన్న గ్రామం కాబట్టి అక్కడ వసతి సదుపాయాలూ లేవు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి కాలేదు. బోర్డర్ ఏరియా కాబట్టి ప్రభుత్వానికి ఆ ఆలోచన ఉన్నట్టు లేదు. 75 కిలోమీటర్ల దూరంలోని జిల్లా ప్రధాన కేంద్రం హవాయ్ లో మాత్రమే వసతి సదుపాయాలున్నాయి. కిబితూ గ్రామానికి 20 కిలోమీటర్ల ముందే వాలాంగ్ వార్ మెమోరియల్ కన్పిస్తుంది.
యుద్ధ సమయంలో భారత బలగాలు.. 4వేల మంది చైనా సైనికులను ఇక్కడే నిలువరించాయి. వాలాంగ్ కి ఏడు కిలోమీటర్ల ముందే ‘గరంపానీ’ని చూడొచ్చు. అక్కడ వేడి నీటి బుగ్గల మడుగులు కనిపిస్తాయి. కిబితూలోని హెలిప్యాడ్ దగ్గర నుంచి చూస్తే చైనా ఆర్మీ క్యాంప్ ప్రదేశం స్పష్టంగా కన్పిస్తుంది. భారత భూభాగంపై సూర్యకాంతి పడే మొట్టమొదటి గ్రామం డాంగ్ ను సందర్శించి సరికొత్త అనుభూతిని పొందొచ్చు.
ఇతర రాష్ట్రాల ప్రజలు ఇన్నర్ లైన్ పర్మిట్ (ఐఎల్ పీ ) తీసుకుని వెళ్ళాలి. కిబుతూ కి వెళ్లాలంటే .. అస్సాంలో దిబ్రూఘర్ విమానాశ్రయం లో దిగి అక్కడ నుంచి ప్రైవేట్ టాక్సీ మాట్లాడుకుని వెళ్ళాలి. రైలు మార్గమైతే టిన్సుకియా రైల్వే స్టేషన్ లో దిగి టాక్సీ ద్వారా వెళ్ళాలి. బస్ సదుపాయాలు తక్కువ .. తేజులో బస్సులు,క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళినపుడు కిబుతూ ని కూడా చూసి రండి..