‘టీ టూరిజం’ తో కొత్త రుచులు,అనుభూతులు !!

Sharing is Caring...

You can see the beauty of nature……………………

ఇండియా లో టీ టూరిజం  మెల్లగా ఊపందుకుంటోంది. టీ గార్డెన్స్ ను సందర్శించడం … తేయాకు తోటల పెంపకాన్ని.. ప్రాసెసింగ్ ను గమనించడం ..మధురమైన తేనీరును సేవిస్తూ అక్కడి ప్రకృతి అందాలను తిలకించడాన్ని టీ టూరిజం అంటారు. 

ఈ టూరిజం కొత్త రుచులను ఆవిష్కరిస్తూనే టీ ఎలా తయారవుతుందో తెలుసుకునే అవకాశాన్ని పర్యాటకులకు అందిస్తుంది. టీ టూరిజం గత కొన్ని సంవత్సరాలుగా కొత్త పుంతలు తొక్కుతోంది. పర్యాటకుల అభిరుచులకు అనుగుణంగా తేయాకు తోటలకు సమీపంలో రిసార్ట్స్ కూడా వెలిశాయి. డార్జిలింగ్, అసోం, నీలగిరి కొండలలో ఉన్న తేయాకు తోటలను సందర్శిస్తే  అక్కడి  ప్రశాంత వాతావరణం లో సేద తీరవచ్చు.

ఇండియాలో ఎక్కువగా  డార్జిలింగ్,అసోం,నీలగిరి  ప్రాంతాల్లో తేయాకు తోటలు ఉన్నాయి. దేశంలో లభించే  తేయాకు ను అస్సాం టీ , డార్జిలింగ్ టీ,  నీలగిరి టీ  అని 3 రకాలుగా వర్గీకరించారు.డార్జిలింగ్ పెద్ద హిల్ స్టేషన్ ఇది. దీన్ని తేయాకు స్వర్గం అని కూడా అంటారు. ఈ ప్రాంతం పశ్చిమ బెంగాల్ లో ఉంది. ఈ ప్రాంతం లో తేయాకు తోటల సౌందర్యాన్ని కళ్లారా చూసి తీరాల్సిందే.

ఈ ప్రాంతంలో 1854లో ఆంగ్లేయులు తేయాకు తోటల పెంపకం చేపట్టారు. ఆ తర్వాత కలకత్తా లోని ధనికులైన కొంతమంది వ్యాపారులు ఈ తోటల పెంపకాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు.  డార్జిలింగ్  ప్రపంచంలోనే అతి పెద్ద టీ గార్డెన్ . మార్చి నుంచి నవంబర్ వరకు తేయాకు సేకరణ పనులు జరుగుతాయి. ఈ మాసాలలో అక్కడి వాతావరణం .. ఆహ్లదకరంగా .. అనుకూలంగా ఉంటుంది.

ఈ ప్రాంతంలో 87 టీ ఎస్టేట్‌లు ఉన్నాయి. వ్యవసాయ సహకార సంస్థల ఆధ్వర్యంలో కొన్ని తోటలు  ఉన్నాయి. పెద్ద టీ కంపెనీలు సొంతంగా  ప్రాసెసింగ్ సదుపాయాలు కూడా అమర్చుకున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా కొన్ని భూములున్నాయి. వీటిని వ్యాపారులకు లీజుకు ఇస్తారు. పర్మనెంట్  కార్మికులు ఎస్టేట్లలో నివాసితులు కావచ్చు, ఇక్కడ ప్లాంటేషన్ లేబర్ చట్టం ప్రకారం గృహాలు, విద్య, ఆరోగ్యం, ఇతర సేవలు ఎస్టేట్ యాజమాన్యం అందిస్తుంది. రిటైర్ అయ్యాక కార్మికులు అక్కడ నుంచి వేరే చోటుకి వెళుతుంటారు.

నీలగిరి కొండలు…  ఇవి తమిళనాడు లో ఉన్నాయి. ఈ నీలగిరి కొండలు తేయాకు పంటలకు చాలా ప్రసిద్ధి. ఇక్కడ సుమారు వంద సంవత్సరాల నుండి అద్భుత సువాసన గల తేయాకు తోటలు సాగు చేస్తున్నారు. వివిధ రకాల తేయాకు ఈ కొండలలో  పండుతుంది. ఇక్కడ పదహారు  టీ కంపెనీలు తేయాకు ను  సాగు చేస్తున్నాయి. 

సందర్శకులు నీలగిరి లో ఎన్నో అందమైన టీ తోటలను చూడవచ్చు. తమిళనాడులోని  పశ్చిమ కనుమలలో ఒక భాగం నీలగిరి. ఈ నీలగిరి అందాలను చూస్తూ ట్రెక్కింగ్ చేయడం పర్యాటకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది.నీలగిరి కొండల్లో  ట్రెక్కింగ్ చేసే సమయంలో కాఫీ తోటలు, నారింజ తోటలు, టీ తోటలు, పైన్ చెట్లు కనిపిస్తాయి.

మోయర్ నది  సమీపంలో టీ ఎస్టేట్లు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి.అక్కడి కేథరీన్ జలపాతం,ఎల్క్ జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తాయి. అలాగే కేరళ లోని మున్నార్  ప్రసిద్ధ హిల్ స్టేషన్. ఇక్కడ కూడా చాలా  తేయాకు తోటలు  ఉన్నాయి. చక్కని వాతావరణం, సుందరమైన పరిసరాలు మున్నార్ ను పర్యాటక కేంద్రం గా మార్చాయి.  మున్నార్ వెళ్లే  పర్యాటకులు అక్కడి తేయాకు తోటలను  సందర్శించి సరికొత్త అనుభూతులను సొంతం చేసుకోవచ్చు. 

దేశంలోనే  ‘అసోం’ అతి పెద్ద తేయాకు ఉత్పత్తి రాష్ట్రంగా పేరు సంపాదించింది.. మన దేశంలో టీలో సగానికి పైగా అసోం  నుంచే ఉత్పత్తి అవుతోంది. అస్సాం లో దాదాపు 160 తోటలున్నాయి. ఈ ప్రాంతం ఏటా  400 మిలియన్ కిలోల కంటే ఎక్కువ టీని ఉత్పత్తి చేస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద టీ-ఉత్పత్తి ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు సంపాదించింది.

వాణిజ్య మార్కెట్‌లో అసోం టీ బాగా పాపులర్ బ్రాండ్ టీ. ఈ టీ ని అందరూ ఇష్టపడతారు. ఉత్తర బ్రహ్మపుత్ర వ్యాలీ, కాబ్రి, కచ్చర్ హిల్స్, బరాక్ వ్యాలీ ప్రాంతాల్లో కూడా తేయాకు  తోటలున్నాయి..
అసోం  లోని జోర్హాట్ లో ప్రతి ఏటా ‘ టీ ఫెస్టివల్ ‘ నిర్వహిస్తారు. వేలాది పర్యాటకులు ఈ ఫెస్టివల్ కు వస్తుంటారు.

తేయాకు సాగు, కోత, ప్యాకింగ్‌, పంపిణీ, మార్కెటింగ్‌ విభాగాలలో వేల మందికి ఉపాధి పొందుతున్నారు. తేయాకు రుచి శీతోష్ణస్థితి మీద ఆధారపడి ఉంటుంది. అస్సాం తేయాకుకి, డార్డిలింగ్‌ తేయాకుకి నాణ్యతలో, రుచిలోను తేడా ఉంటుంది. తేయాకులో కనీసం 3000 రకాలు ఉన్నప్పటికీ అవన్నీకూడా  6 రకాల నుంచి పుట్టుకొచ్చినవే అంటారు . అస్సాం తేయాకు లో  ‘మనోహరి బ్రాండ్’ కిలో లక్షరూపాయలు ధర పలికి రికార్డు సృష్టించింది.

కంగ్రా టీ కూడా చాలా పాపులర్ బ్రాండ్.  హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కంగ్రా వ్యాలీ అంతటా  ఈ టీ తోటలను  సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేస్తారు.  గ్రీన్ టీ, బ్లాక్ టీకి ఈ ప్రాంతం అంతర్జాతీయంగా ప్రసిద్ధి గాంచింది. అదండీ టీ టూరిజం  ..  తేయాకు తోటల కథ.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!