సముద్రగర్భంలో 120 రోజులు- గిన్నీస్ రికార్డు!!

Sharing is Caring...

Ramana Kontikarla ………     A great adventure …………

అన్వేషణ, పరిశోధన.. తో మనిషి పరిమితుల గోడలు బద్ధలు కొట్టి కొత్త విషయాలను కనుక్కోవచ్చు. విజయమైనా, వైఫల్యమైనా తట్టుకునే శక్తి ఉంటే, అంతకు రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తే.. అంతకుమించి గొప్ప అనుభవాల్ని ఆస్వాదించొచ్చు.

అందులో కొన్నింటికి సాహసమే ఊపిరి కావాలి.ఎందుకంటే, అక్కడ ఊపిరి కూడా ప్రశ్నార్థకమే. అదిగో అలాంటి ఫీట్ ను సాధించి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ కెక్కారు ఓ జర్మన్ ఏరోస్పేస్ ఇంజనీర్.ముందుగా అభినందనలు చెబుదాం.

రుడిగర్ కోచ్ అనే జర్మన్ ఏరోస్పేస్ ఇంజనీర్ అరేబియా సంద్రపు అడుగుభాగాన ఏకంగా 120 రోజులుండి బయటకొచ్చాడు. గతంలో ఈ ఫీట్ ను అమెరికాకు చెందిన జోసెఫ్ డిటూరీ సాధించగా… ఆయన వందరోజుల రికార్డును ఇప్పుడు రుడిగర్ కోచ్ చెరిపేశాడు.యాభై తొమ్మిది సంవత్సరాల వయసులో రుడిగర్ కోచ్ ఈ సాహసం చేయడం విశేషమే.

గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ జడ్జ్ సుసానా రేయెస్ సమక్షంలో ఒక 30 చదరపు మీటర్ల క్యాప్సూల్ తో సంద్రపు లోతుల్లోకి వెళ్లాడు రుడిగర్ కోచ్. 120 రోజులపాటు తాను సంద్రం లోపల తన జీవితాన్నిఎంతో ఆస్వాదించానని మీడియాకు చెప్పుకొచ్చారు రుడిగర్. ఒక గంభీర వాతావరణంలో… రాత్రి వెన్నెల చీకట్లో మెరిసే ఆ సంద్రపు అందాలను ఎప్పటికీ మర్చిపోలేను అంటారాయన.

తాననుభవించిన అనుభూతి మాటల్లో వర్ణించేదికాదని, అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే అనుభూతి చెందొచ్చన్నది రుడిగర్ మాట. తన 120 రోజుల అనుభవాలను బయటకొచ్చాక షాంపెయిన్ తాగుతూ, సిగార్ కాలుస్తూ వివిధ మీడియా సంస్థలతో షేర్ చేసుకున్నాడు రుడిగర్.

రుడిగర్ కోచ్ తనతో పాటు తీసుకెళ్లిన క్యాప్సూల్ అత్యాధునిక సౌకర్యాలను కల్గి ఉంది. క్యాప్సూల్ లో ఓ బెడ్, టాయిలెట్, టెలివిజన్, కంప్యూటర్, ఇంటర్నెట్, వ్యాయామానికి సంబంధించిన కొన్నిసౌకర్యాలను ఏర్పాటు చేసుకుని సముద్రపు లోతుల్లో 120 రోజులు గడిపాడు.

ఉత్తర పనామా తీరం నుంచి 15 నిమిషాల దూరంలో ఏర్పాటు చేసిన ఈ క్యాప్సూల్ లోకి ఆహారాన్ని పంపడానికి,ఇతరత్రా వైద్య సాయం అందించడానికి కూడా అలలపైన ఓ ట్యూబ్ లాంటిదాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

స్నానానికి ఒక షవర్ .. సౌరఫలకాలతో విద్యుత్ అందించే సదుపాయం, దాంట్లో సాంకేతిక సౌకర్యానికి అంతరాయం వాటిల్లితే బ్యాకప్ జనరేటర్ ఇలా అత్యాధునిక క్యాప్సూల్ లో అవసరమైనవి అమర్చారు.

సంద్రం అడుగుభాగాన 120 రోజులు ఉండి బయటకొచ్చి వరల్డ్ రికార్డ్ నెలకొల్పిన ఫీట్ ఇప్పుడు రుడిగర్ సొంతమైంది. నాలుగు కెమెరాలు క్యాప్సూల్‌లో రుడిగర్ కోచ్  కదలికలను చిత్రీకరించాయి.120 రోజులు అతను ఎలాంటి ఇబ్బందికి గురవలేదనడానికి ఈ కెమెరాలే  సాక్ష్యం గా నిలిచాయి.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!