పలకర ప్రభు, తెలపరా!

Sharing is Caring...

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని కరుణాకటాక్షములు ఎరుగని భక్తులు ఉండరు.తిరుమల తిరుపతి క్షేత్ర మహత్యం గురించి,శ్రీ వెంకటేశ్వరుని కృప గురించి ఎన్నో అద్భుతమైన విశేషాలు, స్వామి వారి మహిమలు మనము నిత్యం వింటూనే ఉంటాం.

అంతటి గొప్ప దైవాన్ని స్మరిస్తూ అర్పించిన చిన్న స్వర నీరాజనం “పలకర ప్రభు తెలపరా”.
అన్నమాచార్యుల వారి 32వేల సంకీర్తనలలో కొలువై ఉన్న దైవము, తిరుమల ఏడుకొండల పైన నివసిస్తూ భక్తుల కొంగు బంగారంగా కోరిన కోరికలు తీర్చే కల్పతరువు. 

తిరుపతి వెంకన్నగా సామాన్యుని గళములో నిత్య స్మరణీయడైనా ఆ శ్రీ వెంకటేశ్వరుని కీర్తిస్తూ
BPS AUDIO&VIDEO , కొండపాక టీం వారు ఈ మద్యే యూట్యూబ్ లో విడుదల చేసిన భక్తి గీతం “పలకర ప్రభు తెలపరా” గీతం ప్రజలను భక్తి పారవశ్యం లో ముంచెత్తుతూ, ఆధ్యాత్మికానంద డోలికల్లో అల్లలాడిస్తుంది.

ఈ శుభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్బంగా తెలంగాణా బీజేపీ MLA, గౌరవనీయులు మాధవనేని రఘునందన్ గారి చేతులు మీదుగా ఆవిష్కరణ జరిగిన ఈ పాట గురించి ఓ నాలుగు మాటలు మాట్లాడుకుందాం.

దైవ నామ స్మరణలో మునిగితే కలిగే ఆనందం అనిర్వచనీయం. ఈ పాటలో రచయిత శ్రీ వేంకటేశ్వరుని స్మరిస్తూ నిన్ను పొగిడేటందుకు,  అనునిత్యం నీ నామ స్మరణలో బ్రతికేటందుకు నాకు కొన్ని పదాలు అందించు తండ్రి, అలుపెరుగనిది, ఎన్నటికీ మరుపురాని అద్భుతమైన పద సంకీర్తనల ఝరిని అందించు దేవా అని కోరతాడు.

అల వైకుంఠపు పాలకడలిలో, ఆది శేషతల్పము పైన నిద్రిస్తున్న, ఆది మధ్యంతములు లేని ఆ మహా విష్ణువుని ప్రార్థిస్తూ,ఇల లోపలి దుఃఖాలను విడిచి పెట్టే వరములియ్యు తండ్రి అని వేడుకుంటాడు.నిత్య సత్యరూపుడై, నిఖిల ధర్మ జ్యోతియై, అండ పిండ బ్రహ్మాండంబులను ఏలుతున్న ఆ శంక చక్రధరిని కీర్తిస్తూ, అవతార పురుషుడుగా తిరుమల తిరుపతి లో వెలిసిన వెంకటేశ్వరుని గానం చేస్తాడు రచయిత.

తెల్లటి వస్త్రముచే అచ్చాదన చేయబడ్డ ఆ స్వామి చల్లని మనసు, హరి నామము స్మరించే వారికి బంధువుగా నిలిచే ఆ శ్రీ వెంకటేశ్వరుని కరుణా కటాక్షములు ఎంత గొప్పవో స్వామి భక్తులకు తెలుసని,మరొక సాక్ష్యం అనవసరం అని తెలియచేస్తాడు. ఇలా పాట ఆద్యంతం చక్కని వర్ణనతో సాగిన ఈ గీతానికి గాయకుడు రాజకుమార్ గాత్రం సంగీత దర్శకుడు సాకేత్ సాయిరాం గారి సంగీతం ప్రాణం పోసింది. పాట విన్నంత సేపు ఏదో తెలియని లోకాల్లో విహరింప చేస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది.

సిద్దిపేట దగ్గరలో గల పుల్లూరు బండ మీద అత్యద్భుతమైన లొకేషన్ లలో చిత్రికరణ జరుపుకున్న ఈ పాటలో నటులుగా చేసిన కృష్ణమోహన్,వివేక్ ల అభినయం, రాఘవేంద్ర టాలెంట్ స్కూల్ విద్యార్థుల నృత్యం పాటకు ప్రత్యేక ఆకర్షణలుగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రకృతి అందాలను అద్భుతంగా తెరకెక్కించారు. ఎడిటర్, కెమెరామాన్ బాధ్యతలు నిర్వహించిన బాలెందర్, దర్శకత్వం వహించిన సంతోష్ కుమార్ ల ప్రతిభ ప్రశంసనీయం.

 

పోస్టర్ డిజైన్ సహకారం నాగరాజ్ , లక్ష్మి ప్రసన్న అందించారు. మొత్తంగా శ్రీవేంకటేశ్వర స్వామి భక్తి గీతం తో భక్తుల ప్రశంసలు, ఆ దేవదేవుని దీవెనలు పొందడంలోBPS audio &Video, కొండపాక టీం వారు విజయం సాధించారు అని చెప్పవచ్చు. ఆరు నిముషాలు పాటు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందచేసే ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.కింద లింక్ లో చూడవచ్చు.    http://www.youtube.com/watch?v=UjihgF8Rz9k

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!