ఆ ఊర్లో అసలు పోలీస్ కేసుల్లేవు !!

Sharing is Caring...

పై ఫొటోలో కనబడే గ్రామం మధ్యప్రదేశ్‌లోని మాండ్ల జిల్లా ప్రధాన కార్యాలయానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. గిరిజన ప్రాబల్యం ఉన్న ఈ గ్రామం పేరు మలపాథర్. ప్రజలు పరస్పరం సహకరించుకుంటూ వివాద రహితంగా జీవనం సాగిస్తున్నారు. గ్రామస్తుల మధ్య వివాదాలు ఏర్పడినా సమీపం లో ఉన్న పోలీస్‌స్టేషన్‌ కు వెళ్ళరు.కేసులు పెట్టుకోరు.  

గ్రామస్తులే కూర్చుని సమస్యలను /వివాదాలను  పరిష్కారిస్తారు ఇది రాజీ అయినా, మరే సమస్య అయినా..  గ్రామంలో ప్రతిదీ సమిష్టి నిర్ణయం ద్వారా జరుగుతుంది. ఎలాంటి కార్యక్రమంలోనైనా గ్రామ ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. మలపాథర్  జనభా కేవలం 358 మాత్రమే.అటవీ ప్రాంతంలో ఉంది.

చిన్న గ్రామం అయినప్పటికీ ఆదర్శగ్రామంగా చెప్పుకోవచ్చు. గ్రామస్తులు  ప్రతి నెల 27, 28 తేదీల్లో కలుసుకుంటారు. అందులో పెద్దలు, యువకులు  గ్రామ అభివృద్ధిపై చర్చించుకుంటారు. ఒకవేళ  ఏదైనా సమస్య పరిష్కారం కావాలంటే లేదా వివాదం తలెత్తి ఉంటే  రెండు పార్టీలకు వివరించడం ద్వారా సమస్యను పరిష్కరించుకుంటారు.  

ఎవరిదైనా తప్పు అని తేలితే  అతనికి నామమాత్రపు జరిమానా (రూ .21 లేదా 51) విధించి వసూలు చేస్తారు. ఈ సొమ్మును  గ్రామ అభివృద్ధి పనుల కోసం  ఉపయోగిస్తారు. జరిమానా చెల్లించడానికి ఎవరి దగ్గర డబ్బు లేకపోతే, వారి నుంచి ధాన్యమో ..మరొకటో  స్వీకరించి వివాదాన్ని పరిష్కరిస్తారు. ఇది మా గ్రామ న్యాయస్థానం అని గ్రామస్తులు అంటున్నారు.

ఇక్కడ పోరాటాలు తేలికగా పరిష్కరించబడతాయి. ముఖ్యమైన  విషయం ఏమిటంటే  చర్చలకోసం , నిర్ణయాల తీసుకోవడం కోసం ఏ కమిటీలు  వేసే అలవాటు కూడా వీరికి లేదు. అన్నినిర్ణయాలు పెద్దల నాయకత్వంలోనే  తీసుకుంటారు.

గ్రామంలో మద్యపాన నిషేధం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఒకప్పుడు దేవతలకు మద్యం నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం ఉంది. కానీ కాలక్రమంలో దాన్ని మార్చారు. ఇపుడు దేవతలకు పండ్లు ఫలాలు నైవేద్యంగా పెడుతున్నారు.ఎవరి ఇంట్లో అయినా వివాహ వేడుక జరిగితే ప్రజలందరూ  బియ్యం, పప్పుధాన్యాలు, నగదు ఇవ్వడం ద్వారా ఆ కుటుంబానికి సహాయం చేస్తారు.

ఇప్పుడు గ్రామాన్నిపాలిథిన్ రహిత గ్రామంగా  చేయడానికి గ్రామస్తులు సంకల్పించారు. గ్రామానికి వచ్చేదారుల్లో చెల్లాచెదురుగా ఉన్న పాలిథిన్‌కవర్లు కనబడితే  వాటిని  తొలగిస్తారు. గతమూడేళ్ళలో  దగ్గర్లో ఉన్న మహారాజ్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఈ గ్రామానికి సంబంధించి  ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.ఈ గ్రామం సామాజిక సామరస్య వాతావరణం ఉన్న గ్రామం  అన్నిప్రభుత్వ కార్యక్రమాలకు గ్రామస్తులు ఎల్లప్పుడూ సహకరిస్తారు.  గ్రామ సీమలు అన్ని ఇలా తయారైతేనే ప్రజలు కోరుకునే రామరాజ్యం వస్తుంది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!