మిలియన్ డాలర్ల ప్రశ్న .. what next ?

Sharing is Caring...

Mnr M  ……………………………………………………………………………………

what next ? yes…  what next ?????????…………………………….బాగా బతకడం మాటెందుకు. ముందు బతికి ఉండాలి. బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు అన్న సూత్రం నిన్న మొన్నటి వరకూ అందరం అనుకున్నాం. కానీ బయటకి చెప్పడం లేదు కానీ ప్రతి ఒక్కరిలో గుబులు మొదలైంది. పల్స్ ఆక్సీ మీటర్ పల్స్ తో పాటుగా పర్సు లో తైలాన్ని లెక్కగట్టే బతుకు జీవులే అధికంగా కనిపిస్తున్నారు.

ఫస్ట్ వేవ్ లో కనిపించిన ఘనమైన వంటకాలు, వాటి రెసిపీలను వివరించే పోస్టులు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించడం లేదు. ఓటీటీల్లో ప్రపంచ భాషల్లో తీసిన చాలా సినిమాలను ఇరగ్గొట్టి చూసి వాటిపై రివ్యూలను తెగ రాసేసిన సినిమా ప్రియుల సంఖ్య బాగా పడిపోయింది.బాగా డబ్బులున్న బడాబాబులకూ, తెల్ల రేషన్ కార్డులతో ప్రభుత్వ పథకాల ఊరటలతో బతికేవారి కంటే మధ్య తరగతే ఎక్కువగా తల్లడిల్లిపోతోంది. ఎందుకంటే వీరిదెప్పుడూ త్రిశంకు స్వర్గం బతుకులే కదా. పైకి ఎదగలేరు. కిందకి పడిపోలేరు. ఓ రకంగా చెప్పాలంటే శాపగ్రస్థ బతుకులు.

ముఖ్యంగా ప్రతి ఇంటి పెద్దలో ఆందోళన చాలా అధికంగా కనిపిస్తోంది. ఓ ముక్కలో చెప్పాలంటే కరోనా తర్వాత ఏం చేయాలి. ఇంట్లో ఖాళీగా కూర్చున్న ప్రతి మధ్య తరగతి వ్యక్తి ఆలోచన ఇదే. చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి లేదు. వచ్చే జీతానికి చేసే పనికి పొంతన లేదు. ఈ గాడిద కొలువులు ఇంకెన్నాళ్లు.ఏళ్ల తరబడి పని చేస్తున్నా ముప్పై వేలు కూడా దాటని జీతాలు. అందులో గత ఏడాదిగా భారీ కోతలు. నో వర్క్, నో పే బాపతులు. పూర్తిగా తరిగిపోయిన సేవింగులు. కరుగుతున్న కలలు. భయపెడుతోన్న ఆరోగ్య పరిస్థితులు.

ఏం చేయాలి. ఎలా భవిష్యత్తును నెట్టుకురావాలి. టీపాయింట్లు పెట్టుకుంటే బెటరేమో అన్న ఆలోచన. అదే సమయంలో ఇంత బతుకూ బతికి టీ కొట్టా అనే సందేహం. పాలు ప్యాకెట్లు అమ్ముకుంటే బెటరేమో… ఇంతలోనే ఇప్పటికే పాలు అమ్ముకునే వాళ్లుండగా నీ ప్రయాసెందుకు దండగా అనే లాజిక్కు. కరోనా తగ్గిన వెంటనే మాంచి పూటకూళ్ల హోటల్ పెడితే బెటర్ అని ఆలోచన వచ్చిన వెంటనే అది సరే ఇప్పటికే మాంచి ఊపుమీదున్న హోటల్లే బోర్డులు తిప్పేస్తున్నప్పుడు… యూట్యూబ్ లో వంటలతో ఇంట్లో మేనేజ్ చేసే మనం హోటల్ మేనేజ్ చేయ్యగలమా అనే డౌట్ అనుమానం. ఇంతలో మరో ఆలోచన….నాలుగు ఆవులు కొనుక్కుని హాయిగా పల్లెటూళ్లకి వెళ్లి బతుకుదాం అనుకుంటున్నవారెందరో. అంతెందుకు ఇకపై ఇంటిల్లపాదీ అందరం కొన్నాళ్లు కష్టపడకపోతే కుదరదని తీర్మానించుకుంటోంది ప్రతి మధ్య తరగతి కుటుంబం.

ఈ.ఎం.ఐ. లో ఇంటావిడ పోరు పడలేకో… యూట్యూబ్ లో ఎవడో చెప్పాడనో… పక్కింటి వాడి దగ్గర పరువు పోతుందని మాంచి ఊపులో కొనుక్కున్న ఇంటిని ఎంతోకొంతకి అమ్మేసి వచ్చిన డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని కొన్నాళ్లు ఊపిరి పీల్చుకుంటే బాగుంటుంది అనుకునే వారు మరో రకం. బయటకి కనిపడడం లేదు కానీ గుండె దడ పెరిగుతోన్న బాబులకి కొదవలేదు.
కాకపోతే అప్పుడప్పుడు వారానికి ఓసారి వచ్చే ఆదివారం మాత్రం ఈ ఆలోచనలన్నింటికీ కాస్త బ్రేక్ ఇచ్చి…. కరోనా కాదు దానమ్మ, వీలైతే కరోనా తాత, మత్తాత వచ్చినా సరే… చికెన్ షాపుకి, మటన్ షాపుకి, చేపల బజార్ కి వెళ్లి ఆ మాత్రం జిహ్వ చాపల్యం చూపెట్టకపోతే ఉన్న ఆ కాస్త పరువు మర్యాద ఎక్కడ తగ్గిపోతాయో అని బయట తిరుగుతున్నారంతే.

note …  లాక్ డౌన్ లోనూ ఉదయం ఆరు గంటలకే మద్యం షాపు దగ్గర కనిపించే మహానుభావులకు నా ఈ పోస్టుకి ఎటువంటి సంబంధం లేదని నొక్కి  వక్కాణించుకుంటున్నాను. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!