ఇంద్రజాలికుడు సమీర్ మండల్ !

Sharing is Caring...
Taadi Prakash …………………………………..

Water colour wonder of India—————————

నీటి రంగుల విన్యాసంలో మనల్ని విస్మయ పరచగల కళాకారుడు సమీర్ మండల్. పశ్చిమ బెంగాల్ కి చెందిన వాడు. 1952 మార్చి మార్చి 13న ఉత్తర 24 పరగణాల్లో జన్మించాడు. ముంబై లోని గోరేగావు వెస్ట్ లో ఆయన స్టూడియో. 1980లో మధుమితని వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు… షోమాక్, షోహ్ని. కలకత్తా లోని అకాడెమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నుంచి 1978, 1983 సంవత్సరాలలో ఉత్తమ చిత్రలేఖనం అవార్డులు అందుకున్నాడు.

1995లో ఆంధ్ర ప్రదేశ్ council of artists సమీర్ ని సన్మానించింది. హిందీ సినిమా తారే జమీన్ పర్ కోసం నిషాన్, నికుంభ్ క్యారెక్టర్ల బొమ్మలు అద్భుతంగా వేశారు సమీర్. ఆ పాత్రధారి ప్రపంచాన్ని ఆకర్షించిన బాలుడు దరిశీల్ సాఫ్రి. సమీర్ ఒక పెయింటింగ్ ధర లక్ష నుంచి ఏడు లక్షల రూపాయలు పలుకుతుంది. తారే జామీన్ పర్ కోసం మూడు పెయింటింగ్లు వేసిన సమీర్, అమీర్ ఖాన్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. మన దేశానికి గర్వకారణం ఐన సమీర్ మండల్ గురించి, ఆర్టిస్ట్ మోహన్ రాసిన వ్యాసం ఇది.

కళా… కామర్సు… కాపర్సు…

“నా దగ్గర అమర గానసుధ వుంది. పంచుతా రండి. వినండి” అనే వెర్రివాడి పాట వినడానికి ఎవ్వడూ వెళ్ళడట. “పోరా కుయ్యాం, చాలామందిని చూశాం” అని కూడా అంటారట. “నా దగ్గర బోల్డు గొప్ప గాత్రముంది. రేటు వన్ ఫిఫ్టీ సెవెన్. లాడ్జింగ్, బోర్డింగ్ ఎక్స్ ట్రా” అనేవాడి వెనక అబ్బురంతో క్యూ పెట్టి టికెట్లు కొనుక్కుంటారట. చెలాన్ని చాలావాటికి క్షమించాలి అని చెలంగారే అంటాడు గానీ, పైమాటలు చెప్పినందుకు క్షమించండి సార్ అంటూ మనమే చెలం కాళ్లు పట్టుకోవచ్చు.

మామూలుగా మనందరం కళని చూసేటపుడు అది మన గుండె తలుపు తట్టే ఫీలింగ్ రావటం ఒక ఎత్తయితే, ఆ ఆర్టిస్టూ వాడిచుట్టూ వుండే గ్లామర్ వలయం చూసి ఫ్లాట్ గా పడిపోటం మరో ఎత్తు. శ్రీదేవి అందరికంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటుందట. అమితాబ్ కి రెమ్యూనరేషన్ కాకుండా ఏరియాలు ఇచ్చేయాలట. వాళ్లింట్లో కుక్కపిల్ల ఈమధ్యే రమేష్ సిప్పీకి సైన్ చేయబోనని రిజెక్ట్ చేసిందట- ఇలాంటి వింతలూ, విడ్డూరాలు చెప్పుకుంటే మనందరికీ ఎంతో హాయిగా వుంటుంది. ఎం. ఎఫ్. హుస్సేన్ బొంబాయిలో మరీ దరిద్రమైన ఎగ్జిబిషన్ పెట్టాక ఇది కళా కాదూ, కాకరకాయా కాదని మొన్నమొన్ననే పదిమందీ అనగలిగారు.

అంతకుముందు మాత్రం హుస్సేన్ సత్తు అని ఎవ్వరూ తెగించి అనలేకపోయారు. కొద్దిమంది ఆర్టిస్టులెవరో అతను నకిలీ అని నసిగినా అదంతా ప్రొఫెషనల్ జెలసీ కింద కొట్టిపారేయడమే అయింది. ఇప్పుడు మాత్రం బొంబాయి ఆర్ట్ ఎగ్జిబిషన్ లో హుస్సేన్ వేలాడదీసిన తెల్ల గుడ్డలన్నీ దేవతా వస్త్రాలేనని అందరూ అనేస్తున్నారు. ఇందుకు పూర్తిగా రివర్స్ లో వున్న తాజా కేసు ఒకటి.  సమీర్ మండల్ అనే చక్కని చిత్రకారుడున్నాడు.

బొంబాయి ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఎగ్జిబిషన్ లు పెట్టడం, పర్యావరణం, కాలుష్యం లాంటి విషయాల మీద యూరోపియన్ స్టైల్ లో కనిపించే అందమైన పోస్టర్లు గీయటంతో కొద్దిమంది గుర్తించారు. సండే అబ్జర్వర్ పత్రికలో చాలాకాలంగా ఇలస్ట్రేటర్ గా వున్నాడు. ప్రతి వారం ఆయన బొమ్మలొస్తాయి. వాటర్ కలర్స్ వేయటంలో సమీర్ మండల్ కు మంచి పనితనం వుంది. ఆ పత్రిక వాళ్లు చాలాసార్లు ఆయన స్టిల్ లైఫ్ లూ, లాండ్ స్కేప్ లూ అచ్చేశారు.

వాటిని కూడా కొద్దిమందే గుర్తించారు. ఈలోపులో చిన్న మార్పు. బోరిబందర్ ముసిలమ్మ ఇలస్ట్రేటెడ్ వీక్లీ కాపరంతో విసిగివేసారిన ప్రీతిష్ నంది ఢామ్మని సండే అబ్జర్వర్ లో చేరాడు. అంత లావు ఎడిటర్ వచ్చాడు కదా అని అబ్జర్వర్ పెద్ద పబ్లిసిటీ కాంపెయిన్ నడిపింది. వీక్లీ లో ఆయన రాసే ఎడిటర్స్ ఛాయిస్ కాలమ్ ఇక నుండీ అబ్జర్వర్ లో రాబోతోందహో అంటూ మూడు వారాల పాటు దండోరా వేశారు.

అబ్జర్వర్ లో మళ్లీ కొత్తగా రాసే పాత కాలమ్ బాగా హిట్ అవ్వాలి గనక ప్రీతిష్ నందీ కొండను తవ్వినంత తెగ ఆలోచించేసి చివరికి లమ్హే సినిమా మీద చిన్న రివ్యూ రాశాడు. నిజానికి శ్రీదేవి మీద రివ్యూ. దీనికి రివ్యూ కంటే పెద్ద వాటర్ కలర్ శ్రీదేవి బొమ్మను సమీర్ మండల్ వేశాడు. ఆ సినిమా స్కోప్ బొమ్మ నిజంగా మంచి వర్క్. ఎలాంటి భయం బెరుకూ లేకుండా చాల ధీమాగా రంగులు టకటకా వేశాడాయన. పైగా ఆబాలగోపాలాన్నీ ఆకట్టుకునే టెక్నిక్. బాలలూ, గోపాలాలూ ఏమోగానీ బట్టల కొట్లవాళ్లని ముగ్దుల్ని చేసింది.

అమాంతంగా విమల్ కంపెనీ వాళ్లు సమీర్ ఫుల్ పేజీ బొమ్మలతో పదివారాల ఎడ్వర్టైజ్మెంట్ కాంపెయిన్ మొదలుపెట్టారు. ప్రతి వారం ఒక పేజీ నిండా పంచరంగులు జల్లి రేఖ, శ్రీదేవి, సల్మాన్ ఖాన్, అమితాబ్, మాధురీ దీక్షిత్ ల క్లోజప్ లు వేస్తున్నాడు సమీర్. ఇపుడాయన స్టార్. ఆయన రేటు జోర్. ఆ రేఖ, శ్రీదేవి పెదాల ఎరుపు రంగు గురించీ, మాధురీ దీక్షిత్ బుగ్గల్లో మెరుపు గురించీ అందరూ మాట్లాడుతున్నారు.

కాలేజీ కుర్రాళ్ల గదుల గోడల మీద ఈ బొమ్మలు వెలిశాయి. సమీర్ అందమైన పూలకుండీలూ, బుల్లి లాండ్ స్కేపులూ వేసినపుడూ, ఇప్పుడూ కూడా ఆర్టిస్టే. అతను బొమ్మలు వేసినా, వేయటం ఆపేసినా ఆర్టిస్టే. మనం చూడ్డంలోనే తేడా. అంతే. కళ కళగానే వుంటుంది. కామర్సూ, కాపర్సూ తోడయ్యాక కలరే మారిపోతుంది.

ఆ కలర్ కళలో కంటే మన కంట్లోనే ఎక్కువ మారుతుంది. తాత్పర్యమేమనగా .. బొమ్మలు చూడ్డం, పాటలు వినడం, కవిత్వం చదవడం- ఇలాంటి పనులు చేసే జనం చూపులో క్వాలిటీ పెరగకపోతే వాళ్లకి అందే కళలో క్వాలిటీ పెరగడం కూడా కష్టం. మనమెంతకాలమూ శుద్ధ మొద్దావతారాల్లాగే మిగిలిపోతే మనకి దొరికేదీ అలాటి మొద్దు కళే అవుతుంది.

– Mohan Artist

ఇది 1992 ఫిబ్రవరి 9 న రాసిన వ్యాసం .. “కార్టూన్ కబుర్లు” నుంచి

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!