ఈ దీక్షతో ఫ్రంట్ రాజకీయాలకు శ్రీకారం!

Sharing is Caring...

కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశాన్ని సరైన దిశలో నడిపించటంలేదని ఆ మధ్య కేసీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.దేశాన్ని బాగుచేసేందుకే తాను జాతీయ రాజకీయాల్లోకి దిగుతున్నట్టు కూడా ప్రకటించారు.అప్పటినుంచి ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 

ఇందులో భాగంగానే ధాన్యం కొనుగోళ్లు .. రైతుల సమస్య తీర్చడంతోపాటు బీజేపీకి చెక్‌పెట్టడం, జాతీయ రాజకీయాల్లోకి అరంగేట్రానికి అనుకూలతను సృష్టించుకోవాలనే వ్యూహంతో  సీఎం కేసీఆర్‌ ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు.ఈ దీక్ష ద్వారా దేశ వ్యాప్తంగా అందరిలో దృష్టిలో పడాలని కేసీఆర్ భావిస్తున్నారు. 

ఈ దీక్షతో కేంద్రం దిగివచ్చి ధాన్యం కొనుగోలు చేస్తుందా లేదా అన్నవిషయం పక్కనబెడితే .. దీక్ష ద్వారా కేసీఆర్ నేషనల్ మీడియాలో కనిపిస్తారు. బలమైన ప్రధాని మోడీ ని  ఎదుర్కొంటున్న యోధుడిగా కొంత మేరకు గుర్తింపు వస్తుంది.  అందులో సందేహం ఏమీ లేదు. ఇతర పార్టీల నేతలను కూడా దీక్షకు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఎంతమంది వచ్చి సంఘీభావం ప్రకటిస్తారో ?

ఇక కొత్త ఫ్రంట్ కూడా ఖాయమే అన్నట్టు భావించవచ్చు.  కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి ఏర్పాటు చేయాలనీ కేసీఆర్ అనుకుంటున్నారు.  ఇందులో భాగంగా కేసీఆర్‌.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేను, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌ల కలసి చర్చలు జరిపారు. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, స్టాలిన్‌తోనూ మాట్లాడే యత్నాల్లో ఉన్నారు.

వీరందరి మద్దతుతో కొత్త ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కేసీఆర్‌ అంచనాలకు భిన్నంగా వచ్చాయి.  అయినా కేసీఆర్ ప్రయత్నాలు ఆప లేదు. కేంద్రాన్ని డీ కొనే ధోరణి తోనే ఉన్నారు. మమతా కు సలహాలిచ్చిన ప్రశాంత్ కిషోరే  కేసీఆర్ కి సలహాలిస్తున్నారు.

పంజాబ్‌ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటుకోవడం కేసీఆర్ ఊహించని పరిణామం. మోడీ ని ఢీకొనేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలన్న మమతా బెనర్జీ, కేసీఆర్‌ తదితర నేతల ప్రతిపాదన..ఎన్నికల  ఫలితాలతో నీరుగారిపోతుందని అనుకున్నారు కానీ అలాంటిదేమి జరగలేదు.

ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్‌యాదవ్‌ సారధ్యం లోని సమాజ్‌వాది పార్టీ గతంతో పోలిస్తే బలం పుంజుకోవడం.. పంజాబ్‌లో ఆమ్‌ అద్మీ పార్టీ అధికారంలోకి రావడం.. ప్రాంతీయ పార్టీలకు కొంత ఊరటనిచ్చే అంశమే.కాగా 2018 లో కూడా కేసీఆర్ ఇలాంటి ప్రయత్నాలే చేసి తర్వాత వాయిదా వేసుకున్నారు. ఈ సారి మాత్రం అమీతుమీ తేల్చుకోవాలనుకుంటున్నారు.

ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం పూర్తికాగానే కేసీఆర్ కొత్త ఫ్రంట్ కోసం ఒక జాతీయ కార్యవర్గం ఏర్పాటు చేయాలని  యోచిస్తున్నారు. అలాగే అధికార పార్టీ ప్రతినిధులను కూడా నియమించే ఆలోచన చేస్తున్నారు. ఇక థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయితే  నాయకత్వం ఎవరు వహించాలనేది కూడా పెద్ద ప్రశ్నే. మమతా బెనర్జీ కేసీఆర్ కంటే రాజకీయాల్లో సీనియర్ కాబట్టి ఆమెకే నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారో?మరొకరికి ఇస్తారో ? చూడాలి.

కేసీఆర్ యూపీఏ సారధ్యంలో పనిచేయడానికి సిద్ధంగా లేరు. మమతాబెనర్జీ కూడా అదే ఆలోచనలో ఉన్నారు. అయితే వీరి ఆలోచనలకు  భిన్నంగా  శరద్ పవర్ ఉన్నారు.  అదే జరిగితే వీరికి మద్దతుగా నిలిచేదెవరు ? జగన్, స్టాలిన్ వీరితో కలుస్తారా అనేది సందేహమే. ఆమధ్య లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ను కలసి వెళ్లారు.

ఆ సందర్భంగా ఇరువురి మధ్య ఫ్రంట్ విషయాలు చర్చకొచ్చాయని సమాచారం. తేజస్వి యాదవ్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపవచ్చు అంటున్నారు. ఫ్రంట్ బాధ్యతలు కేసీఆర్  చేపడితే ఆయన ఎంతమంది ప్రాంతీయ పార్టీల నేతలను ఆయన ఆకట్టుకోగలరు ?

ఎన్ని పార్టీలు కేసీఆర్ నాయకత్వాన్ని అంగీకరిస్తాయి. బలమైన పార్టీలు లేకుండా ఫ్రంట్ లో లేకుండా విజయం సాధించడం కూడా కష్టమే. తెలంగాణలో 9 ఎంపీ సీట్ల బలమున్న కేసీఆర్ ను నార్త్ లీడర్లు లెక్క చేస్తారా ?  భిన్నమైన ఆలోచనలు ,వ్యవహారశైలి గల నేతలతో వేగడం కూడా కష్టమే. మరి కేసీఆర్ ఏమి చేస్తారో చూద్దాం. 
       

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!