తాలిబన్ల అండతో పాక్ చెలరేగిపోతుందా ?

Sharing is Caring...

Govardhan Gandeti…………………………

పద్మవ్యూహంలో “భారతం” …  తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించిన క్రమంలో ఇండియా స్థితి ఇది.మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడి పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడి మాదిరిగా ఇండియా నేటి స్థితిని పోల్చవచ్చును. టెర్రరిజాన్ని అణచివేస్తానని, పీచమణచివేస్తానని, మొత్తంగా నిర్మూలించి పారేస్తానని బీరాలు పలికి 20 ఏళ్ళు పాటు ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా తిష్టవేసిన సంగతి తెలిసిందే.

అక్కడ ఏమీ సాధించలేక చేతులెత్తేసి, తోక ముడిచిన ఫలితంగా తలెత్తిన దుస్థితి ఇది అనుకోవాలి. పాకిస్తాన్ సంగతిని పక్కన పెడితే,గతంలో ఇండియాతో ఎంతో స్నేహంగా మెలిగిన చైనా, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక దేశాలు ఒక్కోక్కటికిగా అన్నీ ఇండియాకు దూరమైన సంగతి తెలిసిందే. ఇలా ఈ దేశాలన్నీ దూరం కావడం హఠాత్తుగా రాత్రికి రాత్రి సంభవించిన పరిణామమేమీ కాదు  కానీ  ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించిన క్రమంలో ఈ అంశం చర్చనీయమే.

చైనా అనుసరించిన ఆర్థిక,రాజకీయ,భౌగోళిక వ్యూహ ఫలితంగా భారత్ దాదాపుగా ఈ ప్రాంతంలో ఒంటరైపోయింది. ఆ దేశాలు చైనా తో స్నేహంగా మెలగడం వెనక వాటి రాజకీయ,భౌగోళిక,ఆర్థిక కారణాలు వాటికి ఉండవచ్చును. వాటితో ఇండియాకు నిమిత్తం లేదు. ప్రపంచంలోనే అతి పెద్ద పారిశ్రామిక శక్తిగా ఎదిగిన చైనా ఎంతో ముందస్తు వ్యూహంతో ఇండియా చుట్టూ ఉన్న దాదాపుగా అన్ని దేశాలను తనకు దగ్గర చేసుకున్నది.

ఇలా కాకుంటే చైనా వ్యూహాన్ని గ్రహించి ప్రతివ్యూహాన్ని రూపొందించుకోవడంలో ఇండియా విఫలమైందని కూడా భావించవచ్చును. అంటే మన విదేశాంగ నీతిలో ఏమైనా లోటుపాట్లను సంస్కరించుకోవలసి ఉన్న దేమో పరిశీలించుకోవలసిన స్థితి అని కూడా భావించవచ్చు. అమెరికాతో సహా అనేక పెట్టుబడిదారీ దేశాలకు చైనా వ్యాపారంలో సవాల్ గా మారిన సంగతి తెలిసిందే.

అమెరికాకు ధీటుగా ప్రపంచాధిపత్యానికి తహతహ లాడుతున్నట్లుగా దాని అడుగులు,చర్యలు,వ్యూహాలు కనిపిస్తున్నాయి. తాజాగా తాలిబన్లకు చైనా అండగా నిలిచేందుకు యత్నిస్తుండడం ఆందోళన కలిగించే పరిణామమే అవుతుంది. తాలిబన్లకు అండగా నిలవడం వెనక చైనాకు దాని రాజకీయ,భౌగోళిక వ్యూహాలు వంటి కారణాలుండవచ్చును.

తాలిబన్లతో పాకిస్తాన్ ద్వారా చైనా అండతో ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడం అంటే పద్మవ్యూహంలో ద్రోణుడు,కర్ణుడు, దుర్యోధనుడు లాంటి మహా యోధులను ఎదుర్కోవడం లాంటి స్థితి నేటి భారతానిది. ఈ పద్మ వ్యూహాన్ని ఎలా చేధించబోతున్నదనేది ఇపుడు ఇండియా ముందున్న పెద్ద ప్రశ్న.

భారత్ అంత బలహీనంగా లేకపోయినా పరిస్థితులను సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అప్రమత్తం కావాల్సిన తరుణమిది.  తాలిబన్లు ఆఫ్ఘన్ జైళ్లలో ఉన్న 100 మంది పాకిస్థానీ ఉగ్రవాదులను విడుదల చేశారు. విడుదలైన వారిలో తెహ్రీకే తాలిబన్ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉన్నతస్థాయి కమాండర్లు కూడా ఉన్నారు.వీరి అండతో పాక్ కవ్వింపు చర్యలకు దిగే అవకాశాలు లేకపోలేదు . 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!