ప్రివిలైజ్ కమిటీ నోటీస్ కి నిమ్మగడ్డ స్పందిస్తారా ?

Sharing is Caring...

ఏపీ స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి అసెంబ్లీ ప్రివిలైజ్ కమిటీ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. కొద్దీ రోజుల క్రితం  మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బొత్స సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదులపై  ప్రివిలైజ్ కమిటీ రెండో సారి సమావేశమై (వర్చువల్గా )ఈ నిర్ణయం తీసుకుంది.అసెంబ్లీ రూల్స్  212, 213 ప్రకారం నోటీసు ఇచ్చి ఎన్నికల కమీషనర్ ను పిలిపించవచ్చు. గతంలో మహారాష్ట్రలో కూడా ఇలాగే చేశారు. ఈ మేరకు  ముందుగా నోటీసు పంపి .. నిమ్మగడ్డపై విచారణ చేపట్టాలని కమిటీ నిర్ణయించింది. విచారణకు అందుబాటులో ఉండాలని శాసనసభ కార్యదర్శి ద్వారా నోటీసు పంపడానికి రంగం సిద్ధమైంది.ఇవాళో రేపో నోటీసు వెళుతుంది. విచారణ తేదీ కూడా ఇవాళో రేపో ఖరారు కానుంది. నిమ్మగడ్డ ఈ నెలాఖరులో రిటైర్ అవుతారు కాబట్టి ఈ లోగానే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రివిలైజ్ కమిటీ భావిస్తోంది. నిమ్మగడ్డకు వ్యక్తిగతంగా,లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చే అవకాశం కమిటీ కల్పించింది.

కాగా ప్రజాప్రతినిధుల హక్కులకు భంగం కలిగేలా కమీషనర్ వ్యాఖ్యలు చేసారని  … ఆయనపై  చర్యలు తీసుకోవాలంటూ మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స స్పీకర్‌కు జనవరి చివరి వారంలో ఫిర్యాదు చేశారు. గవర్నర్‌కి లేఖ రాసి, దానిని మీడియాకి లీక్ చేసి తమ ప్రతిష్టకు భంగం కలిగించారని మంత్రులిద్దరూ సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు.  కాగా అంతకు ముందు మంత్రులు లక్షణరేఖ దాటుతున్నారని ..  ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన విషయంపై  అటార్నీ జనరల్ సలహా తీసుకోవాలని గవర్నర్‌ను నిమ్మగడ్డ కోరారు. ఈ విషయంలో తనకు కోర్టును ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదని…అయితే చివరి ప్రయత్నంగా తమ దృష్టికి తెస్తున్నట్టు గవర్నర్‌కు లేఖ రాశారు. నిమ్మగడ్డ ఇలా లేఖ రాయడం పై మంత్రులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. హక్కుల నోటీసులు ఇచ్చారు. వాటిపైనే ప్రివిలేజ్ కమిటీ స్పందించి నోటీసులు పంప బోతోంది

నిమ్మగడ్డ జవాబు ఇస్తారా ?

ఇకపై ఏమి జరుగుతుందనేది ఇపుడు ఆసక్తికరంగా మారింది. ప్రివిలైజ్ కమిటీ వివరణ అడిగితే ఎన్నికల కమీషనర్ సమాధానం ఇవ్వాలి. అయితే నిమ్మగడ్డ ఇస్తారా లేదా అనేది సందేహమే. నిమ్మగడ్డ సమాధానం ఇస్తే దాన్ని ప్రివిలేజ్ కమిటీ పరిశీలిస్తుంది. ఆ సమాధానంతో పాటు పూర్వాపరాలను కమిటీ పరిశీలిస్తుంది. కమీషనర్ వ్యాఖ్యలు ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగించాయో లేదో నిర్ణయిస్తుంది. కమిటీ మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకుంటుంది. ఏ చర్యలు తీసుకోవాలో కూడా మెజారిటీ సభ్యులు నిర్ణయిస్తారు. కమిటీ సిఫారసులను సభలో ప్రవేశపెట్టి సభ్యుల ఆమోదం పొందుతారు. ఏదైనా స్పీకర్ విచక్షణాధికారం మేరకు జరుగుతుంది. ప్రస్తుతం శాసనసభ జరగడం లేదు కాబట్టి స్పీకర్ నిర్ణయం మేరకు ఏదైనా జరగవచ్చు. అయితే విషయం అంతవరకు వెళుతుందా అనేది కూడా సందేహమే.  ఎందుకు రచ్చ రభస అనుకుంటే స్పీకర్ సింపుల్ గా వదిలేయవచ్చు. ఆయన నిర్ణయం మేరకే జరుగుతుంది ఏదైనా.

మహారాష్ట్రలో ఏమి జరిగింది ?

ఇదిలా ఉంటే …  గతంలో మహారాష్ట్ర స్టేట్ ఎన్నికల కమీషనర్ నందాలాల్ పై కూడా ఎమ్మెల్యేలు ప్రివిలేజ్ నోటిస్ ఇచ్చారు. కమిటీ విచారణ జరిపింది. వ్యక్తిగతంగా కమీషనర్ ను హాజరు కమ్మంటే నందాలాల్ వెళ్ళలేదు. దీంతో కమిటీ 7 రోజుల జైలు శిక్ష కు సిఫారసు చేసింది. ఈ క్రమంలోనే నందాలాల్ హైకోర్టును ఆశ్రయించాడు.విచారణ సందర్భంగా నందలాల్ తనను సంప్రదించకుండా ప్రివిలేజ్ కమిటీ శిక్ష వేసిందని వాదించారు. అయితే పలుమార్లు పిలిచినట్టు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు చూపింది. దీంతో కోర్టు శిక్ష విషయం ప్రస్తావించకుండా కేసు కొట్టేసింది. దరిమిలా నందలాల్  సుప్రీం కెళ్ళి మహారాష్ట్ర  పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేసారని.. ఒక రోజు జైలులో ఉంచారని వాదించారు. అయితే పోలీస్ కమీషనర్ అదేమీ లేదని ఖండించాడు.జైలులో ఉంచినట్టు నందాలాల్ నిరూపించలేకపోయారు. దీంతో అక్కడ కూడా కేసు కొట్టేశారు. అలాగే తమిళనాడు,పంజాబ్ రాష్ట్రాల్లో కూడా కమీషనర్లు కోర్టులను ఆశ్రయించి బయటపడ్డారు. ఇక ఏపీ కమీషనర్ కూడా తన సహజ ధోరణిలో ప్రివిలేజ్ కమిటీ ని లెక్కచేయకపోవచ్చు. ప్రివిలేజ్ కమిటీ నోటీసు అందితే మటుకు నిమ్మగడ్డ కోర్టు కెళ్ళవచ్చు. ఒక వేళ వెళ్లినా కోర్టులు కూడా స్పీకర్ విచక్షాధికారాన్ని ప్రశ్నించలేవు.

  ————- KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!