బీజేపీ పనైపోయిందని.. యూపీ ఎన్నికల్లో ఆ పార్టీ దారుణంగా ఓడిపోనుందని ఆమధ్య తెలంగాణ సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు.అయిదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు కేసీఆర్ కొన్ని రాష్ట్రాల్లో పర్యటించి వచ్చారు. అక్కడ ఆయనకు అందిన సమాచారాన్ని బట్టి కేసీఆర్ బీజేపీ పని అయిపోయిందని వ్యాఖ్యానించి ఉండొచ్చు.
అయితే ఎన్నికలు ముగిశాక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మరో విధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ జోస్యం ఎంత వరకు ఫలిస్తుంది ? ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎంత వరకు నిజమౌతాయి అనే అంశంపై రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తుంది.
మిగతా రాష్ట్రాల ఫలితాల విషయం అలా ఉంచితే .. యూపీ లో ఓటర్లు బీజేపీ వైపే మొగ్గు చూపినట్టు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కాగా ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడి కానున్నాయి. ఈ ఫలితాల పట్ల ప్రజలతో పాటు రాజకీయ నాయకులూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ జోస్యం ఫలిస్తే జాతీయ రాజకీయాలు ఒకలా .. ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమైతే నేషనల్ పాలిటిక్స్ మరోలా ఉంటాయని అంచనా వేస్తున్నారు.
దేశ రాజకీయాలను యూపీ ఎన్నికలు మలుపు తిప్పుతాయని విశ్లేషకుల అంచనా. అత్యధికంగా అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలున్న రాష్ట్రం యూపీ కావడంతో అక్కడి ఫలితాలే భవిష్యత్తు జాతీయ రాజకీయాలను సూచిస్తాయని .. ఓటర్ల మనోగతాన్ని చెబుతాయని భావిస్తుంటారు. అలా జరగాలని రూల్ ఏమీ లేదు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కాలంలో జాతీయ స్థాయిలో బీజేపీ,కాంగ్రెసేతర కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసమే వివిధ రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు, జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తున్నారు. అదే సమయంలో తెలంగాణలో బీజేపీ తెరాస కు ప్రత్యామ్నాయంగా నిలవాలని గట్టి ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. యూపీ ఎన్నికల ఫలితాలను బట్టి తెలంగాణ రాజకీయాల్లోనూ కీలక మార్పులు రావచ్చని అంటున్నారు.
యూపీ లో బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ కూటమి ప్రయత్నాల జోరు తగ్గవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో కూడా ఇలాగే కేసీఆర్ కూటమి ఏర్పాటును వాయిదా వేశారు. అదే రీతిలో రాష్ట్రం పైనే దృష్టి పెట్టవచ్చు.ఒక వేళ కేసీఆర్ మాటలు నిజమైతే మటుకు … ఆయన మరింత దూకుడు ప్రదర్శించవచ్చని అంటున్నారు.
యూపీలో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే .. కేసీఆర్ ఆపార్టీ అధినేత అఖిలేశ్‌యాదవ్‌తో కలిసి జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. ఫ్రంట్ పైనే కేసీఆర్ ఫోకస్ పెట్టవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో పెను మార్పులు చోటు చేసుకోవచ్చని భావిస్తున్నారు.
ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం బీజేపీ యూపీలో విజయం సాధిస్తే తెలంగాణలోనూ బీజేపీ పార్టీ దూకుడు ఖచ్చితంగా పెంచుతుంది. తెరాస కు ప్రత్యామ్నాయంగా నిలబడేందుకు సర్వశక్తులూ ఒడ్డుతుంది. రాష్ట్ర పార్టీకి పరిపుష్టం చేసేందుకు కేంద్ర నాయకులూ కృషి చేస్తారనడం లో సందేహం లేదు.
ఒక వేళ యూపీ లో బీజీపీ ఓటమిపాలైతే ఆ ప్రభావం రాష్ట్ర బీజేపీపై కొంత మేరకు ఉండొచ్చు. నాయకుల్లో కొంత హుషారు తగ్గుతుంది. జనాల్లోకి చొచ్చుకుపోయేందుకు మరింత గట్టి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. చూద్దాం ఏమి జరగ బోతోందో ? రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయో ?