Priyadarshini Krishna …………
ఈ ఫొటోలో కాస్త పక్కకు ఒరిగి కనబడుతున్న దేవాలయాన్ని రత్నేశ్వర్ మహాదేవ్ మందిరం లేదా మాతృ కృష్ణ మందిర్ అంటారు. ప్రపంచ వింతల్లో ఒకటి గా చెప్పుకునే లీనింగ్ టవర్ ఆఫ్ పిసా కంటే ఇది పురాతనమైనది, ఎత్తైనది. వారణాసిలోని మణి కర్ణిక ఘాట్ దగ్గర వున్న ఈ మందిరం 9 డిగ్రీల కోణంతో వంగి వుంటుంది.
దీని ఎత్తు 74 మీటర్లు, కాగా పీసా టవర్ కేవలం 4 డిగ్రీల కోణం 54 మీటర్లు ఎత్తులోనే వుంటుంది.ఇటలీలోని పీసా టవర్ నిర్మాణం కొంత జరిగాక, దాని పునాదిలో ఒక వైపున గట్టిదనం లేకపోవడం వల్ల ఆ కట్టడం పక్కకు ఒరిగి పోతోందని గ్రహించారు. దాని నిర్మాణం పూర్తయ్యాక నాలుగు డిగ్రీల వంపు అలాగే స్థిరపడిపోయింది. అదే పీసా టవర్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఇక రత్నేశ్వర మహాదేవ్ ఆలయ నిర్మాణం 1825 తరువాతే జరిగినట్టు రెవెన్యూ రికార్డులలో ఉందట.1860కి ముందు ఈ గుడి నిటారుగానే ఉండేదట. క్రమంగా వంగిపోవడానికి కారణం నదిలో కట్టడం వల్ల పునాదులు కుంగిపోవడమో, బలహీన పడడమో కారణాలని అంటారు. కానీ ఇతమిద్దంగా ఇది అని ఎవరు చెప్పలేదు. దీంతో అది కూడా ఒక మిస్టరీ గా మిగిలిపోయింది.
సరే .. కారణం ఏమైనా ఈ ఆలయం వారణాసిలో పర్యాటకులను బాగా ఆకట్టుకుంటోంది. కాగా రాజా మాన్‌సింగ్ (1550-1614) ఈ మందిరాన్ని నిర్మించాడు అని కూడా అంటారు. రెవిన్యూ రికార్డులకు రాజమాన్ సింగ్ జీవించిన కాలానికి పొంతన కుదరదు. సరైన వివరాలు ఎక్కడా లేవు. దురదృష్టవశాత్తు ఏ చరిత్రకారుడు ఎక్కడా దీని గురించి రాయలేదు. కాగా ఈ ఆలయ నిర్మాణం గురించీ, ఈ వంపు ఏర్పడడానికి కారణం గురించీ అనేక కథలు ప్రచారం లో ఉన్నాయి.
వాటిలో ఒక కథ ప్రకారం అయిదు వందల ఏళ్ళ క్రితం రాజా మాన్‌సింగ్ సేవకుడొకరు తన తల్లి పేరిట ఈ ఆలయం కట్టించి, ఆమె రుణం తీర్చుకున్నానని గొప్పలు చెప్పుకున్నాడట. అయితే ‘ఎప్పటికీ తీరనిది తల్లి రుణం’ అంటూ ఆ తల్లి ఇచ్చిన శాపంతో ఈ ఆలయం వంగిపోయిందట. అందుకే దీన్ని ‘మాతృ రుణ మందిరం’ అని పిలుస్తారని భక్తులు చెబుతుంటారు.
అలా వాలి ఉన్న శివాలయం.. నేటికీ అలాగే నిలబడి ఉంది. 2016 లో కురిసిన భారీ వర్షాలకు రూఫ్ కొంచెం దెబ్బతిన్నది.గంగా తీరాన ఉన్న ఇతర ఆలయాలకు భిన్నంగా ఈ ఆలయ నిర్మాణం సాగింది. కాగా పాకిస్తాన్ వాణిజ్య రాజధాని కరాచీ లోకూడా 150 ఏళ్ల చరిత్రాత్మక శ్రీ రత్నేశ్వర్ మహాదేవ్ మందిరం ఉన్నది.
ఇది కూడా చదవండి >>>>>>>>>>>>> ‘శ్రీరామ తీర్థం’ ఆలయం ఇప్పటిది కాదు !