తిరుపతి లోకసభ స్థానానికి ఉప ఎన్నిక ఎపుడు జరిగేది అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ రాజకీయ పార్టీలు పోటీకి సిద్ధమౌతున్నాయి.వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం తో ఈ ఉప ఎన్నిక జరగనుంది. 2021 ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నిక జరగవచ్చుఅంటున్నారు.ఈ ఉప ఎన్నికలో జనసేన పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతోందని ప్రచారం జరుగుతోంది. అందుకే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలతో సంప్రదింపులు చేయబోతున్నారని అంటున్నారు. హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో జనసేన త్యాగం చేసింది కాబట్టి, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం కల్పించాలనే డిమాండ్ తో పవన్ డిల్లీకి వెళ్లినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయమై పవన్ నోటివెంట ఏమాట రాలేదు. బహుశా బీజేపీ అగ్ర నేతలతో మంతనాల దరిమిలా ఏదైనా ప్రకటన చేయవచ్చు.
ఇక బీజేపీ దుబ్బాక విజయాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ కూడా గెలవాలని భావిస్తోంది. నేతలు ఆమేరకు ప్రకటనలు చేస్తున్నారు. సత్తా చాటుతాం అంటున్నారు. ఒక సారి గత ఎన్నికల ఫలితాలు చూద్దాం. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బొమ్మి శ్రీహరిరావు కి 16,125 ఓట్లు వచ్చాయి. అలాగే జనసేన మిత్రపక్షం బీఎస్పీ అభ్యర్థి దగ్గుమాటి శ్రీహరిరావు కి 20,847 ఓట్లు వచ్చాయి. వీళ్ళిద్దరికంటే నోటా కు 25750 ఓట్లు రావడం విశేషం. కాంగ్రెస్ కి 24 వేల ఓట్లు వచ్చాయి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులే గెలుపొందారు. దుర్గాప్రసాద్ కి 7,22,877 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 4,94,501 ఓట్లు పడ్డాయి . దుర్గాప్రసాద్ 2,28,376 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. బీజేపీ లేదా జనసేన ఎవరు పోటీ చేసినా అంత భారీస్థాయిలో ఓట్లు రాబట్టుకోగలరా అనేది సందేహమే. ఈ లెక్కలు చూస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది.
తెలుగు దేశానికి ఇక్కడ ఓటు బ్యాంకు బాగానే ఉంది. 2014 ఎన్నికల్లో బీజేపీకి 5,42,951 ఓట్లు వచ్చాయి. అపుడు టీడీపీ తో పొత్తు ఉంది కాబట్టి వారి ఓట్లు బీజేపీకి బాగానే పడ్డాయి. అదే 2019 ఎన్నికల కొచ్చేసరికి 16 వేలకు పడిపోయింది. ఇక వైసీపీ కి 2014 లో 37,425 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. 2019 లో ఆ మెజారిటీ 2 లక్షలకు పెరిగింది. ఇక ఇపుడు బీజేపీకి టీడీపీకి పొత్తు లేదు కాబట్టి ఒంటరి పోరాటం అంత సులభం కాదని విశ్లేషకులు అంటున్నారు. అయినప్పటికీ బీజేపీ నేతలు గట్టి ప్రయత్నాలు చేసే యోచనలో ఉన్నారు. పార్టీ కి ఒక ఊపు తెచ్చే లక్ష్యంతో దూసుకుపోవాలని వ్యూహరచన చేస్తున్నారు. బీజేపీ టిక్కెట్ కోసం మాజీ ఐఏ ఎస్ అధికారులు దాసరి శ్రీనివాసులు ,రోశయ్య , రావెల కిషోర్ బాబు ప్రయత్నిస్తున్నారు.
గత ఎన్నికలో ఓడిపోయిన తెలుగు దేశం పార్టీ తన అభ్యర్థిగా మళ్ళీ పనబాక లక్ష్మి నే బరిలోకి దించుతోంది. ఇప్పటికే ఆమె పేరును కూడా ప్రకటించింది. తొలుత పోటీకి సుముఖంగా లేని పనబాక టీడీపీ నేతలు ఫోన్ చేసినా స్పందించలేదని వార్తలు ప్రచారంలో కొచ్చాయి. దీంతో అధిష్టానం సోమిరెడ్డిని ఆమె వద్దకు పంపి పోటీ కి ఒప్పించింది. ఇక వైసీపీ తరపున దుర్గాప్రసాద్ కుమారుడు కళ్యాణ్ కి కాకుండా ఫిజియో థెరపిస్ట్ గురుమూర్తి కి టిక్కెట్ ఇవ్వాలని పార్టీ అధినేత జగన్ నిర్ణయించారు. కళ్యాణ్ కి ఎమ్మెల్సీ పదవి ఇవ్వొచ్చని అంటున్నారు. వైసీపీ ఈ సీటు నిలబెట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతుంది. కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగారు. ఆయనకు గత ఎన్నికల్లో 24,039 ఓట్లు వచ్చాయి. 2014 లో 33,333 ఓట్లు వచ్చాయి. అప్పటి మెజారిటీ తగ్గి పోయింది. కాంగ్రెస్ తరపున ఈ సారి ఎవరు పోటీ చేస్తారో ఇంకా ఖరారు కాలేదు.
ఇక దుబ్బాక ఉప ఎన్నికకు, తిరుపతి ఎంపీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు పోలిక… పొంతన లేదు. ఏపీ పరిస్థితులు వేరు. తెలంగాణ పరిస్థితులు వేరు. ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్యే తీవ్ర పోటీ ఉంది. ఈ రెండు పార్టీలను దాటుకుని బీజేపీ ముందుకు వెళ్లడం ఆ పార్టీకి కత్తి మీద సాము అవుతుంది.
———— KNM