Bharadwaja Rangavajhala………………………………..
పై ఫొటోలో నటి సూర్యకాంతం పక్కన ఆయన ..కుంచెం పెద్ద బోల్డు లావుగా కొంచెం విచిత్రంగా పక్కింటి బాబాయ్ లా , పెదనాన్నలా, మావయ్యలా, తాతయ్యలా ఇలా అనేక విధాలుగా అనిపించి ప్రేక్షకులను అలరించిన నటుడు … డాక్టర్ కూచిభొట్ల శివరామకృష్ణయ్య.
ఆయనది తెనాలి. 1889 వ సంవత్సరంలో పుట్టారాయన. కొంత చదువు తెనాలిలోనే సాగింది. తర్వాత ఈ మధ్యే వందేళ్లు పూర్తి చేసుకున్న విశాఖ ఆంధ్రా మెడికల్ కాలేజ్ లో ఎల్.ఎమ్.పి కోర్సు చేశారు. దరిమిలా ప్రాక్టీసు మొదలుపెట్టారు.
నిజానికి శివరామకృష్ణయ్య 1918 నుంచీ ఆయనకి రంగస్థలం పరిచయం ఉంది. తెనాలి రామవిలాససభ లాంటి సమాజాలకు నాటకాలు ఆడేవారాయన.అలా నాటకాల్లో రామదాసు, కబీర్. దుర్యోధనుడు, హిరణ్యకసిపుడు, దుష్టబుద్ది, చాణక్యుడు, బాహుకుడు లాంటి పాత్రలు ధరించడంలో పేరు పొందారు. అప్పటికి ఆయన శరీరం మనకి తెల్సిన సైజుకు చేరలేదు కనుక సీరియస్ పాత్రలు కూడా ఎమోషనల్ గా నటించారాయన.
పద్యాలు చదవడం పాడడంలో ఆయనకి ప్రత్యేకత ఉండేది. స్టేజ్ మీద ఆనాటి పాపులర్ నటులు బళ్లారి రాఘవాచార్య, యడవల్లి, స్థానం నరసింహారావుగార్లతో చాలా నాటకాల్లో పాల్గొన్నారు డాక్టర్ శివరామకృష్ణయ్యగారు. ఆ రోజుల్లో రంగస్థల నటులనే సినిమాలకు తీసుకునేవారు. అలా సహజంగానే సినిమా ప్రవేశం చేశారు డాక్టర్ గారు.
ద్రౌపదీ మాన సంరక్షణ చిత్రంలో ఆయన కర్ణుడు పాత్ర ధరించడంతో సినిమా జీవితం ప్రారంభమైంది. తర్వాత భలేపెళ్లి ఒకరోజు రాజు, జీవన్ముక్తి మొదలైన చిత్రాల్లో నటించారు. సినిమాల్లో నటిస్తూనే డాక్టర్ గా ప్రాక్టీస్ కొనసాగించారు. హైద్రాబాద్, బెజవాడ, గుంటూరు మున్నగు పట్టణాల్లో ఆయన ప్రాక్టీస్ నడిచేది.
ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే ఆయనలో అద్భుతమైన గాయకుడు కూడా ఉన్నాడు. ఆయన వాయిస్ గుర్తుండేదైతే ఈ మాట నమ్మడం పెద్ద కష్టమేం కాదు. అందుచేత ఆయన రేడియోలో సంగీత కార్యక్రమాల్లో పాల్గొనేవారు. గ్రామ ఫోను పాటలు కూడా పాడారు. రెండో ప్రపంచ యుద్దంలో ఆయన మిలట్రీ డాక్టర్ గా కూడా పనిచేశారు. యుద్దం ముగిసాక గుంటూరు వచ్చేసి ప్రాక్టీస్ మొదలు పెట్టారు.ఇలా ఎక్కడ తిరిగొచ్చినా పాడి ఆవులాంటి ప్రాక్టీసును మాత్రం వదల్లేదాయన.
అలా యుద్దం హడావిడి ముగిసి గుంటూరులో స్థిమితంగా ప్రాక్టీసు చేసుకుంటున్న వేళ ….51 లో పెళ్లిచేసి చూడు లో రామారావు తండ్రి పాత్ర చేయడం కోసం మళ్లీ మదరాసు చేరారు. ఆ పాత్ర ఆయనకి విపరీతమైన పాపులార్టీ తెచ్చింది. ఆ తర్వాత హాస్యపాత్రలే ఎక్కువ వచ్చాయి.
అమ్మలక్కలు, చక్రపాణి, అర్ధాంగి, అన్నదాత, బంగారుపాప, పెళ్లినాటి ప్రమాణాలు, వారసత్వం,
ఉమా చండీ గౌరీ శంకరుల కథ ఇలా నడుస్తూ …. నెమ్మదిగా ఒకనారి వంద తుపాకులు లాంటి కౌబాయ్ సినిమాల్లోనూ నటించారు.