Pallonji mistry………………….. …….
భవన నిర్మాణ రంగంలో ఎన్నో రికార్డులు ఆయన సొంతం. కనస్ట్రక్షన్ రంగంలో ఎస్పీ గ్రూపును పల్లోంజీ మిస్త్రీ అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లారు. ముంబైలోని ఇంపీరియల్ రెసిడెన్షియల్ టవర్స్ , రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తాజ్ ఇంటర్ కాంటినెంటల్ హోటల్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నిర్మాణం చేపట్టింది ఎస్పీ గ్రూపే.
మస్కట్లో ఒమన్ రాజప్రసాదాన్ని ఎస్పీ గ్రూపే నిర్మించింది. రియల్ ఎస్టేట్, టెక్స్ టైల్స్, నౌకాయానం, హెూమ్ అప్లయన్సెస్ వంటి రంగాలకూ గ్రూప్ ను విస్తరించారు. 1930 లో ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ ను పల్లోంజీ గ్రూపే నిర్మించింది.
1947లో ఎస్సీ గ్రూప్ లోకి అడుగుపెట్టిన పల్లోంజీ తన తండ్రి షాపూర్జీ పల్లోంజీ మరణానంతరం ఆ గ్రూప్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. దేశంలోనే పుట్టి పెరిగిన ఆయన తర్వాత ఐర్లాండ్ పౌరసత్వం తీసుకున్నారు. పల్లోంజీ నాయకత్వంలో ఎస్ పీ గ్రూప్ విదేశాలకూ విస్తరించింది.పారిశ్రామిక రంగంలో ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం 2016లో పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది.
టాటా గ్రూప్ హెల్డింగ్ కంపెనీ టాటా సన్స్ ఈక్విటీలో పల్లోంజీ మిస్త్రీ అతి పెద్ద వాటాదారుడు . ఈ కంపెనీ ఈక్విటీలో పల్లోంజీకి ఇప్పటికీ 18.37 శాతం వాటా ఉంది. తన తండ్రి షాపూర్జీ పల్లోంజీ నుంచి ఆయనకు ఈ వాటా సంక్రమించింది. 2012లో రతన్ టాటా.. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత పల్లోంజీ కుమారుడు సైరస్ మిస్త్రీ 2016 వరకు చైర్మన్ గా వ్యవహరించారు.
రతన్ టాటా నాయకత్వంలోని బోర్డు సైరస్ మిస్త్రీని అర్థాంతరంగా తొలగించడంతో రెండు పారిశ్రామిక గ్రూప్ ల మధ్య ఎడబాటు పెరిగింది. ప్రస్తుతం ఎస్పీ గ్రూప్ నికర విలువ 500 కోట్ల డాలర్లు అంటే సుమారు రూ. 39,425 కోట్ల వరకు ఉంటుందని అంచనా. దేశంలోని మరే నాన్ లిస్టెడ్ కంపెనీ నికర విలువ ఈ స్థాయిలో లేదు.
ఎస్పీ గ్రూప్ నిర్మించే కట్టడాలు నాణ్యతకు మారుపేరుగా ఉండేవి. దీంతో అనేక ప్రముఖ భవనాల నిర్మాణ కాంట్రాక్టులు ఎస్పీ గ్రూప్ కు దక్కేవి. అమరావతిలోని ఏపీ సెక్రటేరియట్, హైకోర్టు భవనాల్ని ఈ గ్రూపే నిర్మించింది. అలాగే తెలంగాణ కొత్త సెక్రటేరియట్ భవన నిర్మాణ కాంట్రాక్టు కూడా ఎస్పీ గ్రూప్ కే దక్కింది. అంతేకాదు హైదరాబాద్లో పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఎస్పీ గ్రూప్ నిర్మించింది.
టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీతో పాటు ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రతన్ టాటా సోదరుడు నోయల్ టాటా భార్య పల్లోంజీ కుమార్తె. పల్లోంజీ కుటుంబం ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలను నిర్వహిస్తోంది.
పల్లోంజీ గ్రూప్ లో మరో 13 కంపెనీలు, మూడు విభాగాలు ఉన్నాయి.60కి పైగా దేశాలలో 60 వేల మందికి పైగా క్లయింట్లకు సేవలు అందిస్తోంది. నిర్మాణ రంగంలో పల్లోంజీ ఎందరికో స్ఫూర్తి ప్రదాత అని చెప్పుకోవచ్చు.