ఎవరీ మీనాక్షి పొన్నుదురై ?

Sharing is Caring...

Bharadwaja Rangavajhala …………………………………………..

తెలుగు రేడియో కార్యక్రమాలు అనగానే మా రేడియో జనరేషన్ కు తక్షణం గుర్తొచ్చే పేరు మీనాక్షి పొన్నుదొరై. సిలోన్ స్టేషన్ లో తెలుగు ప్రసారాల అనౌన్సరు. ఇప్పటి భాషలో చెప్పుకోవాలంటే రేడియో జాకీ.ఆవిడ స్టోను చాలా గమ్మత్తుగా ఉండేది.ఒక రకమైన హుందా తనం ధ్వనించేది.నేను చెప్తున్నాను. చేతులు కట్టుకుని చెవులు రిక్కించి జస్ట్ అలా వినండ్రా అన్నట్టుండేది ఆవిడ వాయిస్ .

అంత గంబీరమైన వాయిస్ తోనే అల్లరీ చేసేవారావిడ…సాధారణంగా ఆకాశవాణి అనౌన్సర్లకు భిన్నంగానే సాగేది సిలోన్ రేడియో వారి ధోరణి. తెలుగు నేర్చుకుని మాట్లాడుతున్నారీవిడ అన్నట్టుగానే ఉండేది కానీ ఆవిడ వాయిస్ వినడం ఓ అనుభవం. మీనాక్షి గారి వ్యాఖ్యానంలో పొయిట్రీ కూడా కలగలిసేది.

మరి ఆ స్క్రిప్టు ఎవరు ప్రిపేర్ చేసేవారు. ఈవిడ స్వయంపాకమా? లేక వేరే ఎవరైనా ఉన్నారా అనేది నాకు తెలియదు గానీ.. అప్పటికదో వెరైటీ. వ్యాఖ్యానం చెప్పిన పాట కాకుండా వేరేవి ప్లే  అయ్యే సందర్భాల్లో మామూలుగా ఆకాశవాణి వారైతే మన్నింపులు వేడుకుంటారు. కానీ మీనాక్షి గారైతే …మీకు మంచి మంచి పాటలు వినిపించాలని ఇందాక స్టోర్స్ నుంచీ రికార్డులు హడావిడిగా తెచ్చానా… వాటిని వరసలో పెట్టుకోవడంలో చిన్న కన్ఫూజను. అందుకే ఆ పాట వచ్చేసింది.

అది మాత్రం తక్కువ పాటా … ఆరుద్ర ఏం రాశారు. ఘంటసాల ఏం పాడారు. ఎనీహౌ వినేశారు కదా… ఇప్పుడు ఇందాక మిమ్మల్ని ఊరించిన పాట వేస్తున్నా వినేయండి మరి … అని చెప్పేవారు తప్ప నో క్షమాపణలు. ఈ స్టైలు చాలా డిఫరెంట్ గా ఓ యాక్షన్ హీరోయిన్ని వింటున్నట్టు ఉండేది. ఆ రోజుల్లో రేడియోల్లో పనిచేయడానికి ముఖ్యంగా అనౌన్సర్లుగా పనిచేయడానికి వచ్చేవారికి విద్యార్హత చాలా ముఖ్యం.

దాని తర్వాత మిగిలిన తంతంతా పూర్తయ్యాక వారికి అద్భుతమైన శిక్షణ ఉండేదనుకుంటా. వాళ్లు మాట్లాడే పద్దతీ, వాడే పదాలు అన్నీ కాస్త టిపికల్ గానే అనిపిస్తాయి. ఆ మధ్య ఓ సారి చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా దూరదర్శన్ వారు నిర్వహించిన చర్చాగోష్టిలో నేనూ, డైరక్టర్ శివనాగేశ్వర్రావుగారూ పాల్గొన్నాం. ఆ కార్యక్రమానికి ఓ సీనియర్ ఆకాశవాణి ఎంప్లాయి కూడా వచ్చారు. ఆవిడ పేరు నాకు గుర్తు రావడం లేదుగానీ … చర్చలో ఆవిడ మాట్లాడుతుంటే దాన్ని కౌంటర్ చేయాలనిపించకుండా జస్ట్ అలా వినేయాలనిపించింది.

అంటే వాళ్లు వాడే భాష, పదాలు పలికే తీరు, వాక్యంలోని భావం కళ్లు మూసుకుని విన్నా అర్ధయ్యేంత అర్ధవంతంగా చెప్పగలగడం .. మామూలు సాధన కాదు.ఆవిడ మాట్లాడడం ప్రారంభించగానే మేం సైలెంటైపోయే వాళ్లం. ఆవిడ ఆపిన తర్వాత మాత్రమే మాట్లాడేవాళ్లం. అంత కట్టడి చేసిందావిడ జస్ట్ తన వాయిస్ తో.

బయటకొచ్చాక దూరదర్శన్ లో పనిచేసే అంబేద్కర్ గారూ నేనూ టీ తాగుతుండగా ఆవిడ టాపిక్ వచ్చింది. ఆవిడ మాట్లాడిన పద్దతి గురించి మా చర్చ సాగింది. రేడియో సంస్కారం అనుకున్నాం.ఈ మీనాక్షి పొన్నుదొరై గారు కూడా అంతే. ఇక శ్రోతల ఉత్తరాలు చదివే కార్యక్రమం ఒకటి ఉండేది. అవి చదివి వాటికి సమాధానాలు చెప్పే తీరు భలే ముచ్చటగా ఉండేది. ఒక్క సారి ఆ గొంతు వింటే బాగుణ్ణు అనిపించేంత బెంగగా ఉంది ఇది రాస్తుంటే.

హైద్రాబాదులో జలగం వెంగళరావు సారధ్యంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు మీనాక్షి హాజరైనట్టు జ్ఞాపకం. అంటే ఆ సభల మీద రూపొందించిన న్యూసురీలులో తనను పరిచయం చేసినప్పుడు ఆవిడ లేచి నమస్కారం చేయడం నేను చూశాను. సిలోన్ స్టేషన్ లో తెలుగు కార్యక్రమాలు ఎక్కువగా మీనాక్షి గారే చేసినా తనతో పాటు మరో అనౌన్సరు కూడా ఉండేవారు. ఆవిడ వాయిస్ నాకు గుర్తుందిగానీ పేరు గుర్తు రావడం లేదు.

అయితే మీనాక్షి గారు ఈ రోజు రాలేదని తెలియగానే సిలోన్ స్టేషను మార్చేసేవాళ్లం. ఇక ఆ రోజుల్లో ప్రతి ఆదివారం మూడు గంటలకు ఇంటిల్లిపాదీ భోజనాల తర్వాత కాస్త కునుకు తీసి రేడియో దగ్గరకు చేరేవాళ్లు. మూడు గంటలకు ఓ మహత్తర నాటకమో లేక సంక్షిప్త శబ్ద చిత్రమో వేసేవారు. దీనికి పోటీగా సిలోన్ రేడియో వారు కూడా సంక్షిప్త శబ్ద చిత్రం వేసేవారు. అయితే సిలోన్ స్టేషను వారితో అడ్వంటేజ్ ఏమిటంటే ఒకే సినిమాను ఒకరోజు సగం. మరో రోజు సగం ప్రసారం చేసేవారు.

తెలుగు కార్యక్రమాలకు కేటాయించిన అరగంట సమయంలోనే ఈ చిత్ర ప్రసారం కావాలని అలా కట్ చేసి వేసేవారనుకుంటా. శ్రీలంక స్టేషను నుంచీ క్రైస్తవ మత ప్రచారం కూడా భారీగానే సాగేది. ప్రేమవాణి అనే కార్యక్రమం ఈ పాటల కార్యక్రమం తర్వాత వచ్చేది. వారంలో ఏవో ఒకటి రెండు రోజులు మినహా ఈ కార్యక్రమమే నడిచేది.

మీనాక్షిగారు తన కార్యక్రమం అయిపోయాక … తర్వాత వచ్చే ప్రేమవాణి అనౌన్సరుగానీ లేక వేరు భాషకు చెందిన అనౌన్సరుకుగానీ స్వాగతం పలికి … అప్పుడు మనకు బై చెప్పేవారు. బాగా ఇష్టమైన టీచరు క్లాసు అయిపోయాక ఎలా స్టూడెంట్స్ డిశ్చార్జ్ అవుతారో … మీనాక్షి గారి కార్యక్రమం అవగానే శ్రోతలు అలా అయిపోయేవారనుకుంటాను. ఎందుకంటే నాకలాగే అనిపించేది.

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. యూవీరత్నం September 14, 2021
error: Content is protected !!