Multi Talented Artist……………………………….
జై భీమ్ సినిమాలో కీలకమైన ఇరులర్ గిరిజనుడి పాత్రలో నటించిన మణికందన్ ప్రేక్షకుల ప్రశంసలు పొందుతున్నాడు. పాత్ర చిన్నదైనా సినిమా కథ అంతా రాజన్న పాత్ర చుట్టూనే తిరుగుతుంది.ఈ పాత్ర చేయడానికి ముందు మణికందన్ ఇరులర్ గిరిజనులతో 40 రోజుల పాటు కలసి మెలసి తిరిగాడు.
వారి జీవన శైలి..కట్టు ..బొట్టు మాట్లాడే తీరు,ఆచారాలు,సంప్రదాయాలు,ప్రవర్తన విధానం వంటి అంశాలను దగ్గర నుంచి నిశితంగా గమనించాడు. ఇరులర్ గిరిజనులతో తన అనుభవాలను మణికందన్ ఒక తమిళ పత్రిక తో పంచుకున్నారు.
“ఇరులర్ తెగ గిరిజనులు “వేట” లో నిష్ణాతులు. వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. స్వావలంబన సాధించారు. ఓపిక మరీ ఎక్కువ.వేట కెళితే గంటల తరబడి నడుస్తుంటారు. ఒక్కోసారి సాయంకాలం ఆరుగంటలకు వేట మొదలు పెడితే తెల్లవారు జాము వరకు అడవిలోనే తిరుగుతుంటారు. వాళ్ళకుండే స్టామినా ఇతరులకు ఉండదు” అంటాడు మణికందన్.
వాళ్ళ వద్దకు వెళ్లినపుడు ఎలుకలు, కుందేళ్ళు, అడవి పందులను ఎలా పట్టుకోవాలో నేర్పించారు. అలాగే వలలు వేయడం.. ఉచ్చులు అమర్చడం వంటి అంశాలు కూడా చూపారట. అన్ని దగ్గరుండి గమనించాడు కాబట్టే రాజన్న ఆ పాత్రలో ఒదిగిపోయాడు. అత్యంత సహజంగా నటించాడు ప్రేక్షకులచే శభాష్ అనిపించుకున్నాడు.
ఇక మణికందన్ గురించి చెప్పుకోవాలంటే చెన్నైలో పుట్టాడు. అక్కడే పెరిగాడు. మల్టీ టాలెంటెడ్ పర్సన్. సినిమాల్లోకి రాకముందు కొన్నాళ్ళు రేడియో జాకీ గా చేసాడు. అటు నటన .. ఇటు రచనా వ్యాసంగం రెండింటిలోనూ మణికందన్ కి ప్రవేశం ఉంది. అదే అతనికి ప్లస్ అయింది.
2013 లో పిజ్జా 2 తో రచయితగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు.ఆ తర్వాత తొట్టక్కల్ లో విలన్ గా నటించాడు.ఈ సినిమా తో కొంత గుర్తింపు సంపాదించాడు. విక్రమ్ వేద, విశ్వాసం, తంబి సినిమాలకి డైలాగ్స్ రాసి పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. నటుడిగా కాలా, సిల్లు కారుపట్టి, ఏలే, నేత్రికన్ సినిమాల్లో నటించాడు. కొన్ని సినిమాల్లో పాత్రలకు డబ్బింగ్ కూడా చెప్పాడు. గత ఎనిమిదేళ్లలో 11 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించాడు. వాటి అన్నింటికంటే ఈ రాజన్న పాత్ర బాగా జనాల్లోకి దూసుకెళ్లింది.