ఆధ్యాత్మిక గురువుగా , అవదూతగా కాశీనాయన ప్రసిద్ధి గాంచారు. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం బెడుసుపల్లె ఆయనది. సాధారణ రైతు కుటుంబం. యుక్తవయసులోనే ఆధాత్మిక భావనతో ఇల్లు వదిలి కడప జిల్లా వరికుంటకు చేరుకున్నారు. సమీపంలోని నాయునిపల్లెలో చిన్న పిల్లలకు విద్యనేర్పుతూ కొంతకాలం గడిపారు.
తరువాత నల్లమల అటవీ ప్రాంతంలోని జ్యోతి నరసింహస్వామిని దర్శించుకుని అక్కడే కొంత కాలం తపస్సు చేశారు. తర్వాత కాలంలో తీర్ధయాత్రలు చేశారు. తిరిగి వచ్చిన దరిమిలా స్థానికుల సహకారంతో పాడుబడిన దేవాలయాలను పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టారు. దాంతో బాటుగా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించేవారు.
అన్నదాన కార్యక్రమానికి స్పందన బాగా ఉండటంతో అది నిరతాన్నదానంగా మారింది. భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు కూడా ఇచ్చేవారు. ఆ సొమ్మును ఆలయాల జీర్ణోద్ధరణకు కూడా ఉపయోగించేవారు.జ్యోతిలోని లక్ష్మినరసింహస్వామి ఆలయాన్ని పునరుద్ధరించారు. అక్కడే 1995 డిసెంబరు 6న విగ్రహ ప్రతిష్ఠ చేసిన కాశినాయన భక్తుల సమక్షంలో కన్నుమూసి, సమాధి దీక్ష పొందారు.
కాశినాయన అసలు పేరు కాశిరెడ్డి. ఎంత మంది ఆకలితో వచ్చినా 24 గంటలూ కడుపునిండా భోజనం పెట్టడం జ్యోతిక్షేత్రంలో ప్రత్యేకత. నల్లమల అడవుల్లో చుట్టూ ఎత్తయిన కొండలు, పచ్చని చెట్లు, చక్కని ఆహ్లాదకర వాతావరణం, ప్రకృతి అందాల మధ్య అలరారే జ్యోతి క్షేత్రం చూడాల్సిన క్షేత్రాల్లో ఒకటి. ప్రస్తుతం జ్యోతి క్షేత్రానికి బస్సు సదుపాయం ఉంది. అక్కడ విశ్రాంతి గదులు లభ్యమవుతాయి.
ఇక అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో అనేకచోట్ల కాశినాయన పేరుమీద నిరంతరం అన్నదానం చేసే క్షేత్రాలు ఏర్పాటు అయ్యాయి. ప్రస్తుతం కాశినాయన సమాధి ప్రదేశం ఏడవ జ్యోతి క్షేత్రంగా విరాజిల్లుతోంది. ప్రతి సంవత్సరం దత్త జయంతి సందర్భంగా ఇక్కడ ఆరాధనోత్సవాలు జరుగుతాయి.