ఎవరీ జాన్ మిర్డాల్ ?

Sharing is Caring...

ముదిమి వయసులో ఆయన  ఇండియా వచ్చి చెట్టు, పుట్ట, కొండ, కోన  దాటుతూ దండకారణ్యం లో తిరిగారు. ఆయన పేరు జాన్ మిర్డాల్. ఆయన ఒక  ప్రముఖ రచయిత, జర్నలిస్టు. థర్డ్ వరల్డ్ పత్రిక ఎడిటర్. ఇండియాలో కమ్యూనిస్టు ఉద్యమాలకు ఆయన గట్టి మద్దతుదారుడు.  ఇండియా కొచ్చి మావోయిస్టు నేతలతో ఎన్నోమార్లు భేటీలు జరిపారు. 80 ఏళ్ళ వయసులో అడుగు తీసి అడుగు వేయడమే కష్టం. వివిధ దేశాలమధ్య ఉండే సాంస్కృతిక తేడాలను గుర్తిస్తూ, ప్రగతి శీల ప్రపంచాన్ని ఊహిస్తూ, అలాంటి ప్రపంచ నిర్మాణానికి అవసరమైన భావజాలాన్ని వ్యాప్తి చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటి క్లిష్టతరమైన బాధ్యతను స్వీకరించిన అరుదైన రచయితల్లో జాన్ మిర్డాల్ ఒకరు. ఆయన 93 ఏళ్ళ వయసులో మొన్నటి అక్టోబర్ 30 న కన్నుమూసారు. 

స్వీడన్ కు చెందిన మిర్డాల్ తల్లి తండ్రులు గునార్ మిర్డాల్ ,అల్వా మిర్డాల్  ఇద్దరూ నోబెల్ బహుమతి గ్రహీతలు కావడం విశేషం. జాన్ మిర్డాల్  ఇండియా వచ్చేనాటికి  ఆయన వయసు 80 వరకు ఉండొచ్చు. అంత వయసులో కూడా మిర్డాల్ ఒక కమిట్మెంట్ తో “భారత్ పై అరుణ తార” అనే పుస్తక  రచన కోసం మావోయిస్టు నేతలను కలిశారు. అంతకు ముందు ఒకసారి మిర్డాల్ కొండపల్లి సీతారామయ్యను , మరికొందరు నేతలను కూడా కలిశారు. తన ఇంటర్వ్యూలతో సంచలనం రేకెత్తించిన మిర్డాల్ కు భారత్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.ఇక్కడి ఉద్యమాలపై సంపూర్ణ అవగాహన ఉంది.  2012 ప్రాంతంలో “రెడ్ స్టార్ ఓవర్ ఇండియా” బుక్ రిలీజ్ సందర్భంగా  ఆయన హైదరాబాద్  మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. 
ఆ సందర్భంగా ప్రపంచవ్యాప్తం గా  కమ్యూనిజం పోకడపై తన అభిప్రాయాలను సూటిగా చెప్పారు. ఆయన చెప్పినవన్నీ వాస్తవాలే. కమ్యూనిస్టు ఉద్యమాలు సంఘటితంగా లేకపోవడం మూలాన అవి శక్తి వంతంగా మారలేకపోతున్నాయి. వివిధ దేశాల్లో ఉద్యమాలు తమ తమ ప్రాంతాల్లో బలం గానే ఉన్నాయి. కానీ వీటి ప్రభావం తక్కువగా ఉంటున్నది. వాల్ స్ట్రీట్ మార్చ్ లాంటి ఉద్యమాన్ని కమ్యూనిస్టులు వాడుకోగలిగితే ప్రపంచానికి మేలు జరిగేది, ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టులు ఇలాంటి ఉద్యమాన్ని తీసుకురాలేకపోవడానికి సంఘటితంగా లేకపోవడమే ప్రధాన కారణమని అప్పట్లో మిర్డాల్ అభిప్రాయపడ్డారు. 

కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల్లో ఓటమి పాలవడం పై మిర్డాల్  మాట్లాడుతూ  దీనికి ప్రధానమైన కారణం కమ్యూనిస్టు పార్టీలు అనుసరిస్తున్న విధానాలే. ప్రతి దేశానికి కొన్ని సమస్యలు ఉంటాయి. అక్కడి పరిస్థితులకు తగినట్టుగా నాయకులు ఉద్యమాలు నిర్మించుకోవాలి. దానికి ఎలాంటి మోడల్ అవసరమో వారే నిర్ణయించుకోవాలి. పరాజయాలు ఎదురైనపుడు నిజాయితీగా సమీక్షించుకోవాలి. అది కష్టమైనపనే. కానీ వేరే మార్గం లేదు . పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం , పార్టీ వ్యవస్థను బలోపేతం చేసుకోవడం కీలకమైన అంశాలు. వాటిని విస్మరించరాదు అని చెప్పుకొచ్చారు. 
 
కాగా జాన్ మిర్డాల్ ఇండియా రాకపోకలపై ఒకదశలో నిషేధం విధించాలని  భారత ప్రభుత్వం యోచించింది. పార్లమెంట్ లో  మిర్డాల్ గురించి చర్చ కూడా జరిగింది. సాయుధ తిరుగుబాటు ద్వారా భారత ప్రజాస్వామ్య వ్యవస్థను ,ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకునే మావోయిస్టులకు మిర్డాల్  మద్దతు పలుకుతున్నారని  హోమ్ మంత్రిత్వ శాఖ అప్పట్లో ప్రకటించింది. 
———- KNMURTHY
Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!