Bhandaru Srinivas Rao ……………………..
ఆంద్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక ఆయన జీవనం చాలా దుర్భరంగా గడిచేది. మద్రాసులో న్యాయవాదిగా సంపాదించిన అపార ధన రాశులు, అంతులేని ఆస్తిపాస్తులు స్వాతంత్రోద్యమ కాలంలో హారతి కర్పూరంలా కరిగిపోయాయి. రాజకీయాల్లో సమస్తం పొగొట్టుకున్న ఆంద్ర కేసరి చివరి రోజుల్లో కనాకష్టమైన జీవితం గడిపారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతినెలా గౌరవ వేతనం కింద అందించే 750 రూపాయలను నేనే (గాంధీ భవన్ పంతులు గారు) స్వయంగా తీసుకెళ్ళి ఆయనకు అందించేవాడిని. సిరి సంపదలతో తులతూగిన ప్రకాశం పంతులు గారిని ఆ స్థితిలో చూస్తుంటే కడుపు తరుక్కుపోయేది” హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం అయిన గాంధీభవన్ లో శేషజీవితం గడిపిన ఎస్వీ పంతులు గారు ఒకప్పుడు గుర్తుచేసుకున్న విషయాలు ఇవి.
ముఖ్యమంత్రులుగా పనిచేసిన శ్రీయుతులు నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానంద రెడ్డి, పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రాం, కోట్ల విజయ భాస్కర రెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, వై యస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, వీరందరికీ గాంధీ భవన్ లో ‘తలలో నాలుక’ పంతులు గారే. ‘నేనూ కోట్లు కొల్లగొట్టే వాడినయితే ఇంతమంది గొప్పవాళ్ళ స్నేహం నాకు దొరికేదా’ అనుకునే అల్ప సంతోషి పంతులు గారు.
పనులు చూసుకుని సాయంత్రం సిటీ బస్సెక్కి ఇంటికి పోయే వారు. వీరిలో రోశయ్య గారితో పంతులు గారి అనుబంధం సుదీర్ఘ కాలం సాగింది. ఉదయం నుంచీ రాత్రి పొద్దుపోయే వరకు రోశయ్య గారి తోనే వుండి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరినన్నా రెండు రూపాయలు అడిగి తీసుకుని సిటీ బస్సెక్కి పోయేవారు. ‘మళ్ళీ రేపు రావాలి కదా ఈ పదీ వుంచండి’ అని ఏ ధర్మాత్ముడన్నా అంటే ‘టిక్కెట్టుకు రెండు రూపాయలు చాలు, రేపటి సంగతి రేపే’ అనేసి వెళ్ళిపోయేవారట దటీజ్ పంతులు గారు.
గాంధీ భవన్ లో ఎవరికి ఏ సందేహం వచ్చినా .. ఏ సమాచారం కావాల్సినా పంతులుగారినే పిలిచేవారు. ఆయన అసాధారణ జ్ఞాపకశక్తి గల వారు. పైగా సౌమ్యుడు, స్నేహపాత్రుడు. ఆయన పూర్తి పేరు సంకా విన్నయ పంతులు.1934లో తెనాలిలో పుట్టారు. 1950 ప్రాంతాల నుండి ఆచార్య ఎన్.జి. రంగాకు సన్నిహితంగా, ఆయన చనిపోయేవరకు అనధికార పి.ఏ.గా ఉన్నారు.
గుంటూరు ప్రాంత రాజకీయ నేతలకు ఆయన బాగా పరిచయం. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం గా ఉండగా పంతులు గారికి గుండె ఆపరేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. వైఎస్ స్వయంగా నిమ్స్ డాక్టర్లతో మాట్లాడి వైద్య చికిత్స అందేలా చూసారు. పంతులు గారు కనుమూసిన తరుణంలో ఆయన కుటుంబానికి మాజీ సీఎం రోశయ్య సహాయం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఆయనకు అపారమైన అభిమానం. గాంధీభవన్ లో సేవలు అందించినందుకు ఆయన తీసుకున్న వేతనం కూడా తక్కువే. పెద్ద నాయకులతో పరిచయాలున్నా ఎపుడూ వాటిని స్వార్ధానికి ఉపయోగించుకోలేదు.