ఈ డార్నెలా ఫ్రాజియర్ ఎవరో తెలుసా ?

Sharing is Caring...

Dashing .. daring gril ………………………….

పైన  ఫొటోలో కనిపించే వనిత పేరు డార్నెలా ఫ్రాజియర్. సాహసానికి మరో పేరు. ఆమె ఏమి చేసిందో తెలుసుకోవాలంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి . 

” నాలుగేళ్ల క్రితం అమెరికాలో ఒక శ్వేత జాతి పోలీస్ అధికారి  తన మోకాలితో  జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడ్ని గొంతు నొక్కి చంపిన ఘటన గుర్తున్నదా. ఊపిరి ఆడటం లేదు ప్లీజ్ వదిలేయండి అని ఫ్లాయిడ్ వేడుకున్నప్పటికీ ఆ పోలీస్ అధికారి జాలిపడలేదు. ఆ ఘటన అమెరికాలో కల్లోలాన్ని సృష్టించింది.

నల్లజాతి హక్కులను తెరపైకి తెచ్చింది. యావత్ అమెరికా ఈ ఘటనను ఖండించింది. ప్రపంచవ్యాప్తంగా మానవతావాదులు ఆ ఫోటో , వీడియో చూసి పెద్ద ఎత్తున స్పందించారు.”  ఆ వీడియో .. ఫోటోలు తీసింది  ఈ ఫ్రాజియర్ నే.

అప్పుడామె వయసు 17 సంవత్సరాలు. కళ్ళ ముందు జరుగుతున్న దారుణాన్ని మనకెందుకులే అని ఊరుకోకుండా ధైర్యంగా తన సెల్ ఫోన్ లో చిత్రీకరించింది. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఆ వీడియోనే అమెరికా సమాజం లో పెను సంచలనం సృష్టించింది.

ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టికి వెళ్ళింది. కరోనా సంక్షోభ సమయం అయినప్పటికీ ప్రపంచమంతా ఒక ప్రధాన చర్చనీయాంశంగా మారింది. నాడు ఆమె చేసిన సాహసానికి 2021లోనే పులిట్జర్ పురస్కారాన్ని అందుకున్నది. ఫ్లాయిడ్‌ మృతిని చిత్రీకరించిన యువతి డార్నెలా ఫ్రాజియర్‌ను కమిటీ ప్రత్యేకంగా అభినందించింది.

డార్నెలా సోషల్ మీడియా ద్వారా అందించిన ఆ భయంకరమైన ఫుటేజ్ చూసి ప్రపంచ ప్రజలు “ఇంత క్రూరంగా కూడా మనుష్యులు వ్యవహరిస్తారా” అని ఆశ్చర్యపోయారు. ఆ వీడియో చూసిన నల్ల జాతీయులు  అమెరికాలో పెద్ద ఎత్తున  నిరసన చేపట్టారు. ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది.

ఈ నిరసనలకు ఇతర దేశాల్లో కూడా మద్దతు లభించింది. డార్నెలా ఆనాడు ఆ వీడియో తీయకపోతే ఎవరూ ఆ ఘటన గురించి చర్చించే వారు కాదు. వీడియో తీసే నాటికి డార్నెలా జర్నలిస్ట్ కాదు. మామూలు బాలిక. కజిన్ తో షాపింగ్ కి వచ్చి తన కంటి ముందు జరుగుతున్న దారుణం పట్ల స్పందించింది.

ఆ వీడియో పోలీస్ అధికారి పై జరుగుతున్న విచారణ లో కీలకం గా మారింది. వాస్తవానికి డార్నెలా ఆ వీడియో తీసిన తర్వాత భయపడిపోయింది. ఒక రకమైన మానసిక కల్లోలానికి లోనయ్యింది. కోలుకోవడానికి కొద్దీ రోజులు పట్టింది.

ఇక ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాల్లో పులిట్జర్‌ ను ఒకటిగా భావిస్తారు. ఇలాంటి పురస్కారం అందుకున్న వారికి సమాజంలో గౌరవం గొప్పగా ఉంటుంది. జోసెఫ్ పులిట్జర్ అనే ప్రచురణ కర్త ద్వారా ఈ పురస్కారాలు మొదలైనాయి. 1917 లో మొదటిసారిగా ఈ పురస్కారాలను ప్రకటించారు. అప్పటి నుంచి వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారికి  ఏటా బహుమతులను  అందిస్తున్నారు. ఆ పురస్కారం ఫ్రాజియర్ కి లభించడం నిజంగా హర్షణీయం.

————- KNM WITH GOVARDHEN

post modified on  19-6-24

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!