Bharadwaja Rangavajhala…….
టాలీవుడ్ చరిత్రలో యాక్షన్ మూవీస్ ప్రొడక్షన్ హౌస్ గా ‘రవిచిత్ర పిలిమ్స్’కు ఓ స్పెషల్ ఐడెంటిఫికేషన్ ఉంది. ఇమేజ్ ఉంది. ఫిలిం జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంబించిన వై. వెంకట్రావ్ నిర్మాతగా మారి ఎన్.టి.ఆర్, కృష్ణలతో పవర్ ఫుల్ మూవీస్ తీశారు.ఈ వైవిరావ్ అనే కుర్రాడిది రాజమండ్రండి … ఇతను అప్పటి ప్రముఖ నిర్మాత ఎస్.భావనారాయణ గారికి బామ్మర్ది కూడా.
విఠలాచార్య తరహా జానపద చిత్రాలు టాలీవుడ్ మాస్ సినిమా ను శాసిస్తున్న టైమ్ లో … దాన్ని కాదని యాక్షన్ బాట పట్టించారు కృష్ణ. క్రైమ్ బేస్ తో వచ్చిన యాక్షన్ మూవీస్ కి చాలా వరకు బాలీవుడ్ యాక్షన్ సినిమాలే ప్రేరణ. కృష్ణ, కెఎస్ఆర్ దాస్ కాంబినేషన్ లో యాక్షన్ సినిమాలు కొత్త ఒరవడి దిద్దాయి. ఎలాగైతే జానపద చిత్రాలను విఠలాచార్య, ఎన్టీఆర్, కాంతారావులు ముందుండి నడిపారో అలాగన్నమాట.
వైవిరావ్ తీసిన తొలి చిత్రం దాస్ కృష్ణలదే ‘టక్కరిదొంగ చక్కని చుక్క’. రవిచిత్ర బ్యానర్ లో వచ్చిన చిత్రాల్లో రీమేక్ లు అధికంగా ఉంటాయి. అలాగే తెలుగు డిటెక్టివ్ నవలా చిత్రాలూ తీశారు.టెంపోరావ్ నిర్వహణలో వచ్చిన టెంపో పత్రిక బాధ్యతలు కొంత కాలం పంచుకున్నారు వెంకట్రావ్ … దీంతో డిటెక్టివ్ నవలలతో రిలేషన్ ఏర్పడింది. టెంపో నుంచి బయటకు వచ్చిన తర్వాత వైవి రావ్ సొంతంగా డిటెక్టివ్ పత్రిక ప్రారంభించారు.
అందులో అన్నీ అపరాధ పరిశోధనాత్మక కథలే ప్రచురించేవారు. ఆ పత్రిక అప్పట్లో ఓ సంచలనం. దాదాపు అదే తరహా కథలతో వైవి రావ్ సినిమాలూ తీసేవారు. డిటెక్టివ్ పత్రికతో పాటు ‘ఫిలిం’ అనే సినిమా పత్రిక,’రతి’ అనే పేరుతో శృంగార పత్రిక కూడా నడిపేవాడీ పెద్దమనిషి .
నిర్మాత వైవి రావు అని రాస్తే అందులో పవర్ కనిపించడం లేదని రావ్ అని రాయించుకున్నారట.ఆయన తీసిన సినిమాల్లో విపరీతంగా ఆడిన సినిమా విజయలలిత హీరోయిన్ గా చేసిన ‘ఒకనారీ వంద తుపాకులు’. ఆ సినిమా క్లైమాక్స్ స్కోప్ అండ్ కలర్ లోకి మారడంతో జనం ఆశ్చర్యంగా చూడ్డానికి వచ్చేవారు. కృష్ణ, విజయలలితలతో వరసగా సక్సస్ ఫుల్ సినిమాలు తీసిన వై.వి.రావ్ ఆ తర్వాత ఎన్.టి.ఆర్ కి టర్న్ అయ్యారు.
అన్నగారికి కొత్త ఇమేజ్ తీసుకువచ్చే సినిమాలు తీశారు. జానపదాల తర్వాత ఎన్.టి.ఆర్ ను మాస్ ఆడియన్స్ కు దగ్గర చేసే సినిమాలు రవిచిత్రా బ్యానర్ నుంచే వచ్చాయి. అందులో తొలి చిత్రం ‘నిప్పులాంటి మనిషి’ .ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో నెక్ట్స్ మూవీ కూడా ఎన్.టిఆర్ తోనే అనౌన్స్ చేశారు వైవి రావ్. ‘నేరం నాది కాదు ఆకలిది’ తీశారు. ఈ రెండు సినిమాలకూ దర్శకత్వం వహించిన ఎస్డీలాల్ వైవి రావ్ పర్మినెంట్ డైరక్టరై పోయాడు.
వైవిరావ్ ప్రేరణ తోనే మేకప్ మన్ పీతాంబరం తదితరులు ఎన్టీఆర్ లాల్ కాంబినేషన్ లో ‘అన్నదమ్ముల అనుబంధం’ తీశారు. హిట్టు కొట్టారు.ఏడాదికి ఒక సూపర్ హిట్ బాలీవుడ్ మూవీ ఎన్.టి.ఆర్ తో రీమేక్ చేయడం సంప్రదాయంగా మార్చుకున్నారు వై.వి.రావ్.
ఈ ట్రెడిషన్ ను బ్రేక్ చేసిన సినిమా ‘లాయర్ విశ్వనాథ్’ శత్రుఘ్నసిన్హా సూపర్ హిట్ మూవీ విశ్వనాథ్ ను రీమేక్ చేస్తే జనం అబ్బే కష్టమనేశారు. ‘లాయర్ విశ్వనాథ్’ తర్వాత వై.వి.రావ్ భారీ చిత్రాల నుంచి బడ్జట్ మూవీస్ వైపు లుక్కేశారు.
అప్పటికి అప్ కమింగ్ హీరో చిరంజీవి ఆయన్నిఎట్రాక్ట్ చేశాడు. వరసగా చిరంజీవితో రెండు సినిమాలు చేసేశారు. ఒకటి ‘శ్రీరామబంటు’, రెండు ‘నకిలీమనిషి’. ఈ ‘నకిలీమనిషి’కి నేను చావను అనే కొమ్మూరి సాంబశివరావు నవల ఆధారం.
ఆ తర్వాత లాల్ గారితోనే మోహన్ బాబు ను హీరోగా పెట్టి తీసిన ‘పటాలం పాండు’ కూడా ఢామ్మనడంతో సంసారపక్ష సినిమాలేవన్నా చూస్తారేమో అని తనకు అలవాటు లేని కట్టాసుబ్బారావును దర్శకుడుగా పెట్టుకుని ‘పుణ్యం కొద్దీ పురుషుడు’ తీస్తే అదీ పెదవి విరిచేసింది.దీంతో ఇక సినిమా నిర్మాణం మన ఒంటికి అంత మంచిది కాదని ఇండస్ట్రీకి దూరమయ్యారు రావ్ .

