Bharadwaja Rangavajhala ………………………………………
‘కురిసే చినుకు ఎద వరకు ఎల్లువైతే … కడవరకూ వేచి ఉంటానంటూనే … కాలం చెల్లితే ఇంత మన్నేసి పొమ్మనే ఎదరొదను’…తన వేణుగానం తో మన హృదయాల్లోకి ప్రసారం చేసినవాడు నవీన్.హృదయాల మీద పెంకులు ఎగిరిపోయేలా తన సంగీతంతో ఆత్మలకు మేలుకొలుపు పాడతాడు.
కావాలంటే …దర్శకుడు మణిరత్నం ‘బొంబాయి’ కోసం రెహ్మాన్ స్వరకల్పన చేసిన థీమ్ మ్యూజిక్ గుర్తు చేసుకోండి… రెహ్మాన్ సత్తా బాలీవుడ్ కి చాటిన తాళ్ సంగీతానికి ఊతం నవీన్ వేణుగానమే. ఎద ఎదలో మురళీ సుధలు చెలరేగించి మమతల్ని తరింపచేసిన వేణుగానం నవీన్ అనే పేరు పెట్టుకుంది.
బొంబాయి, దిల్ సే, రావణ్ , ధూమ్, కభి అల్విద నా కెహనా లాంటి సినిమాల నేపధ్య సంగీతం లో వినిపించే వేణువు నవీనే.ఫ్లూట్ ను ఎప్పుడూ ఒక వాయిద్య పరికరంగా తను చూడలేదు. జీవితమే వేణుగానం చేసుకున్నాడు.చిన్నతనంలో గాయకుడుగా సంగీత ప్రయాణం ప్రారంభించిన నవీన్ కు అనుకోకుండా వేణు దర్శనం అయ్యింది.
విశాఖ కడలి అలల సవ్వడుల మధ్య చిగురించిన గానమాధుర్యం నవీన్ కుమార్ ది సంగీత కుటుంబమే.నవీన్ తండ్రి రచయిత గణేశ్ పాత్రో స్నేహితుడు. ఎందుకు మనోణ్ణి ఇళయరాజా కు పరిచయం చేయకూడదన్నాడు.అనడమే కాదు నేరుగా రాజా దగ్గరకు తీసుకెళ్లాడు పాత్రో.
అవి ‘నిర్ణయం’ మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్న రోజులు.రాజా ముందు ‘మౌనమేలనోయి’ పాటను తన వేణువు మీద వినిపించాడు.అలా రాజాతో మూడేళ్ల ప్రయాణం సాగింది. నవీన్ కేవలం ఫ్లూటిస్టే కాదు… గాయకుడు కూడా. కీరవాణి, రెహ్మాన్, దేవా తదితర సంగీత దర్శకుల దగ్గర అడపాదడపా గొంతూ చేసుకున్నాడు.
కేవలం ఫ్లూటిస్టుగానే కొనసాగితే నవీన్ గురించి మనం ఇంకాస్త తక్కువే చెప్పుకునేవాళ్లం. తను ప్రయోగశీలి. వేణువులో కొత్త శబ్దాలు పుట్టించాడు.ఉల్లి పొరలతో కొత్త సంగీతాన్ని అందించాడు.నవీన్ జీవితం లో ‘ఇళయరాజా’ కు ముందు ‘రమేష్ నాయుడు’ దగ్గర పని చేసిన అనుభవం ఉంది.రమేష్ నాయుడు దగ్గరే రెహ్మాన్ తో పరిచయం అయ్యింది నవీన్ కి.
అంతే ….జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నవీన్ వేణుగానం సంగీత ప్రయోగాలు మారుమ్రోగాయి. సంగీతానికి ఎల్లలు చెరిపేసిన నవీన్ కుమార్ …. ఇప్పటికీ తన వేణుగానాన్ని వినిపించిన ఆకాశవాణిని మరచిపోలేదు. తను నడచివచ్చిన ఏ అడుగూ ఆయన స్మృతిపథం నుంచీ చెరగిపోలేదు.
వర్షం పడుతున్న ఉషోదయాన … గడియారం ముల్లు నాలుగు మీదకు కూడా చేరని సమయంలో ఓ ట్యూను పుట్టింది …నువ్వురా ట్రై చేద్దాం అని రెహ్మాన్ అనగానే పరిగెత్తుకెళ్లి ‘కోడి కోసమొచ్చాను గోపాలా’ కంపోజిషన్ లో పాలుపంచుకున్న ఉత్సాహం ఇప్పటికీ నవీన్ లో కనిపిస్తూనే ఉంటుంది. పిఎమ్కె నవీన్ కుమార్ వయసు అరవైల్లో చేరుతున్నా ….సముద్రాన్ని వయసుతో కొలుస్తారా అంటాడు. ఇప్పటికీ ఎప్పటికీ నవీన్ వేణుగానానిది సాగర చైతన్యమే.