ఎవరీ కణ్ణగి ? ఆమె కథ ఏమిటి ?

Sharing is Caring...

Ravi Vanarasi……

తమిళ సంస్కృతి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది, సుసంపన్నమైనది. వారి సాహిత్యంలో ఐదు గొప్ప కావ్యాలను ‘ఐంపెరుం కాప్పియంగళ్’ (పంచ మహాకావ్యాలు) అని పిలుస్తారు. ఇవి కేవలం కల్పిత గాథలు కావు, ఆనాటి జైన, బౌద్ధ మతాల ప్రభావంతో రూపుదిద్దుకున్న జీవన దర్శనాలు.

తమిళ సాహిత్యంలో ఐదు కావ్యాలకు అత్యున్నత స్థానం ఉంది. శిలప్పదికారం: (గజ్జె యొక్క గాధ) – ఇలంగో అడిగళ్ అనే జైన ముని దీనిని రచించారు. మణిమేఖలై: (మణిమేఖల వృత్తాంతం) – సీతలై సాతనార్ అనే బౌద్ధ కవి దీనిని రచించారు.జీవక చింతామణి: తిరుత్తక్క దేవర్ రచించిన ఈ కావ్యం జైన మత సిద్ధాంతాలను వివరిస్తుంది.

వళయాపతి: ఇది ప్రస్తుతం పూర్తి స్థాయిలో లభ్యం కావడం లేదు, కానీ అందులోని పద్యాలు అత్యంత విలువైనవి. కుండలకేశి: బౌద్ధ మత గొప్పతనాన్ని చాటిచెప్పే కావ్యం.వీటిలో మొదటి రెండు కావ్యాలు ఒకే కాలానికి చెందినవి, ఒకదానితో ఒకటి అనుసంధానించబడినవి.

శిలప్పదికారం కణ్ణగి కథను చెబితే, దాని కొనసాగింపుగా మణిమేఖలై ఆమె భర్త కోవలన్ ,నర్తకి మాధవిల కుమార్తె కథను వివరిస్తుంది. ఈ కథలన్నీ ఒకప్పుడు అత్యంత వైభవంగా వెలిగిన పుంపుహార్ (కావేరి పూంపట్టినమ్) నగరంలో మొదలవుతాయి.

తమిళనాడులోని మైలాడుదురై జిల్లాలో ఉన్నఈ ప్రాంతం ఒక సాధారణ తీర ప్రాంతంగా అనిపించవచ్చు కానీ, క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటికే ఇది అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం. చోళరాజుల తొలి రాజధానిగా, గ్రీకు, రోమన్ దేశాలతో వ్యాపార సంబంధాలు కలిగిన రేవు పట్టణంగా పుంపుహార్ భాసిల్లింది.

మనం సినిమాల్లో కామెడీ కోసం వాడే ‘పుంపుహార్’ అనే పదం వెనుక కొన్ని వేల ఏళ్ళ సంస్కృతి దాగి ఉంది. యవనులు (గ్రీకులు) ఇక్కడ నివసించేవారని, సముద్ర మార్గం ద్వారా గుర్రాలు, మిరియాలు, విలువైన రత్నాల వ్యాపారం జరిగేదని శిలప్పదికారం వర్ణిస్తుంది. కావేరి నది సముద్రంలో సంగమించే ఈ పవిత్ర స్థలమే కణ్ణగి, కోవలన్ల వైవాహిక జీవితానికి వేదికైంది.

పుంపుహార్‌కు చెందిన ధనిక వ్యాపారి కోవలన్, సౌశీల్యవతి అయిన కణ్ణగిని వివాహం చేసుకుంటాడు. అయితే, విధి వైపరీత్యం వల్ల ఆయన మాధవి అనే రాజనర్తకి వ్యామోహంలో పడతాడు. తన సంపదనంతా ఆమె కోసం ఖర్చు చేసి, కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేస్తాడు. ఇక్కడ కణ్ణగి పాత్రలోని సహనం అత్యంత గొప్పది. భర్త దారి తప్పినా, ఆమె తన ధర్మాన్ని విడవలేదు.

తన బాధను దిగమింగుకుని, సమాజం ముందు భర్త గౌరవాన్ని కాపాడడానికే ప్రయత్నించింది.చివరకు సర్వం కోల్పోయిన కోవలన్ పశ్చాత్తాపంతో తిరిగి వచ్చినప్పుడు, ఆమె అతన్ని నిలదీయలేదు. “ఎందుకు వచ్చావు?” అని ప్రశ్నించలేదు. పైగా, “మనం మళ్ళీ బతుకుదాం, నా దగ్గర ఉన్న ఈ రత్నాలు పొదిగిన బంగారు గజ్జెలను (Silambu) అమ్మి వ్యాపారం ప్రారంభించండి” అని తన ఆభరణాలను ఇచ్చి ధైర్యం చెబుతుంది. ఇది ఒక స్త్రీ  నిస్వార్థ ప్రేమకు, త్యాగానికి పరాకాష్ట.

ఆర్థిక ఇబ్బందుల వల్ల వారు మధురై (పాండ్య రాజ్యం) కు వలస వెళ్తారు.అక్కడ గజ్జెను అమ్మే క్రమంలో, రాణి గారి గజ్జె దొంగిలించబడిందన్న నెపంతో, దుర్మార్గుడైన స్వర్ణకారుడి కుతంత్రం వల్ల కోవలన్ దొంగగా ముద్ర వేయబడతాడు. పాండ్య రాజు ఆవేశంలో విచారణ చేయకుండానే కోవలన్ శిరచ్ఛేదానికి ఆదేశిస్తాడు.

భర్త అన్యాయంగా చంపబడ్డాడని తెలిసిన కణ్ణగి, ఒక సాధారణ స్త్రీ నుంచి ‘మహాసాధ్వి’గా, ఒక రౌద్ర స్వరూపిణిగా మారుతుంది. ఆమె చెదిరిన జుట్టుతో, నిప్పులు కురిసే కళ్ళతో , చేతిలో రెండో గజ్జెను పట్టుకుని పాండ్య రాజు సభకు వెళ్తుంది.

“రాజా! నీ తీర్పు తప్పు. నా భర్త దొంగ కాదు. నా గజ్జెలో ఉన్నవి రత్నాలు, మీ రాణి గజ్జెలో ఉన్నవి ముత్యాలు” అని గర్జిస్తూ తన గజ్జెను నేలకేసి కొడుతుంది. అందులోని రత్నాలు రాజు ముఖంపై పడతాయి. రాజు ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే రాణి గజ్జెలో ఉన్నవి ముత్యాలు. తన అజ్ఞానానికి, అశాస్త్రీయమైన తీర్పుకు పశ్చాత్తాపపడుతూ “నేనా రాజును? నేనే దొంగను” (యానో అరసన్? యానో కల్వన్?) అంటూ సింహాసనంపైనే ప్రాణాలు వదులుతాడు.

కానీ కణ్ణగి కోపం చల్లారలేదు. అన్యాయానికి సహకరించిన నగరం తగలబడాలని శపిస్తుంది. ఆమె ఆవేశానికి మధురై నగరం అగ్నికి ఆహుతవుతుంది. ఇది కేవలం ఒక నగరం తగలబడటం కాదు, అధికార అహంకారానికి, అవినీతికి పట్టిన నిప్పు.ఈ ఘట్టం మనకు తెలుగునాట ప్రసిద్ధమైన కన్యకా పరమేశ్వరి కథను స్ఫురింపజేస్తుంది.

అక్కడ కూడా ఒక రాజు కామాంధుడై చేసిన తప్పుకు, ఒక సాధ్వి తన ప్రాణాలనే అగ్నికి ఆహుతి చేసి ఆ రాజ్యాన్ని శపిస్తుంది. స్త్రీ శక్తి తన శీలాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికైనా సిద్ధపడుతుందని ఈ రెండు కథలు నిరూపిస్తాయి.కణ్ణగి కథ ముగిసిన చోట మాధవి కుమార్తె మణిమేఖల కథ మొదలవుతుంది.

కోవలన్ మరణం తర్వాత మాధవి తన జీవితాన్ని మార్చుకుంటుంది. తన తప్పును తెలుసుకుని, తన కుమార్తెను నాట్యగత్తెగా కాకుండా, ఉన్నతమైన ఆశయాలున్న స్త్రీగా పెంచుతుంది. మణిమేఖల సౌందర్యానికి ముగ్ధుడైన రాకుమారుడు ఉదయుడు ఆమె వెంటబడతాడు. కానీ ఆమె భౌతిక సుఖాల కంటే లోక కల్యాణమే మిన్న అని భావిస్తుంది.

ఆమె మణిపల్లవం అనే ద్వీపానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఆమెకు ‘అక్షయ పాత్ర’ (ఆపుత్రన్ పాత్రం) లభిస్తుంది. దీని ద్వారా ఆకలితో ఉన్నవారికి అన్నం పెడుతూ, చివరకు బౌద్ధ భిక్షువుగా మారుతుంది. మణి మేఖలై కావ్యం మనకు కేవలం కథను మాత్రమే కాదు, ఆనాటి బౌద్ధ మత సిద్ధాంతాలను, తాత్విక చింతనను పరిచయం చేస్తుంది.

ఈ మణిమేఖల ప్రభావం ఆగ్నేయాసియా దేశాలైన థాయిలాండ్, కంబోడియాల వరకు విస్తరించింది. అక్కడ ఆమెను ‘మణిమేఖల’ అనే పేరుతో సముద్ర దేవతగా, వర్షాలను కురిపించే శక్తిగా ఆరాధిస్తారు. నేటికీ అక్కడి శాస్త్రీయ నృత్యాల్లో మణిమేఖల కథను ప్రదర్శిస్తారు.

మనం  పర్యాటకులుగా పుంపుహార్ వెళ్తే, అక్కడ కేవలం సముద్రపు అలలు మాత్రమే కనిపించవు. తీరంలో ఉన్న శిలప్పదికార ఆర్ట్ గ్యాలరీలో కణ్ణగి జీవిత విశేషాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. ఏడంతస్తుల ఈ భవనంలో శిలప్పదికారంలోని ప్రధాన ఘట్టాలను శిల్పాలుగా చెక్కారు. కావేరి నది తన సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించి సముద్రంలో కలిసే ‘సంగమ’ దృశ్యం ఒక ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది.

మరోవైపు, అక్కడ సముద్రం కింద మునిగిపోయిన ఒక పురాతన నగరం ఉన్నట్లు పురావస్తు శాఖ పరిశోధనల్లో తేలింది. ఇది కణ్ణగి శాపం వల్ల మునిగిపోయిందా లేదా సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిందా అనేది చరిత్రకారుల చర్చ. కానీ, ఆ శిథిలాలు మనకు ఒక గొప్ప నాగరికతకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

కణ్ణగి … మణిమేఖల కథలు కేవలం ప్రాచీన కావ్యాలు కావు. అవి స్త్రీ శక్తికి, నైతికతకు దిక్సూచీలు.
కణ్ణగి నుండి మనం నేర్చుకోవాల్సింది: న్యాయం కోసం నిలబడటం. అధికారం ముందు తలవంచకుండా సత్యాన్ని నిరూపించడం.

మణిమేఖల నుండి మనం నేర్చుకోవాల్సింది కరుణ,  సేవ. అధికారాన్ని, అందాన్ని తృణీకరించి ఆకలి లేని సమాజం కోసం కృషి చేయడం.కేరళలో కణ్ణగిని ‘కొడుంగల్లూరు భగవతి’గా పూజిస్తారు. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!