‘చరిత్ర’ను వక్రీకరిస్తున్నారా ?

Sharing is Caring...

Paresh Turlapati…………………..

“గాంధారీ ఏం జరుగుతుందక్కడ?” పెద్దగా అరిచాడు ధృతరాష్ట్రుడు
“ఎక్కడ ప్రభూ?” ఉలిక్కిపడి అడిగింది గాంధారి
“అన్నీ నేనే చెప్పాలి..ఆ ఎఫ్బీ లో ఏం జరుగుతుంది ?” అసహనంగా అరిచాడు ధృతరాష్ట్రుడు
“ఓహ్ అదా ప్రభూ.. చరిత్ర పాఠాలు రాస్తున్నారు ప్రభూ ” వినయంగా చెప్పింది గాంధారి
” ఇంత సడెన్గా అందరూ పాఠాలు ఎందుకు చదువుకుంటున్నారు ” ఆశ్చర్యంగా అడిగాడు ధృతరాష్ట్రుడు

“సినిమా చూశారు ప్రభూ”
“ఏం సినిమా?”
“ఛావా”
“అయితే?”
“సినిమాలో చరిత్ర పాఠాలు కూడా ఉన్నాయి ప్రభూ “

“ఆ పాఠాలు ఏవో సినిమాలో చెప్పేశాడు కదా.. మళ్లీ ఎఫ్బిలో ఈ ప్రైవేట్ క్లాసులు ఏంటీ?”
“అదా ప్రభూ.. అసలు చరిత్ర అదేననని కొంతమందీ.. కాదు కాదు అసలు చరిత్ర వేరే ఉందని మరికొంతమంది వర్గాలుగా విడిపోయి క్లాసులు తీసుకుంటున్నారు ప్రభూ”
“అసలే ఈ గంతలతో ఆ ఎఫ్ఫ్బీ చూడక పిచ్చ చిరాగ్గా ఉంది.. అసలు ఎవరేం అంటున్నారో వివరంగా చెప్పి చా…”

“శివాజీతో మా తాతయ్య పావ్ బాజీ తినేవాడని ఒకడు.. ఔరంగ జేబు మా తాతయ్య జేబులు కుట్టేవాడని మరొకడు.. శివాజీ పిల్లోడు తమతో గోలీలు ఆడేవాడని..దాంతో వాళ్ళ నాన్నకు కోపం వచ్చి గదిలో పెట్టి తాళం వేసాడనీ.. ఇవేమీ కావు రెండు మతాల మధ్య యుద్దాలు జరిగాయనీ మరొకళ్ళు రకరకాలుగా రాసేస్తున్నారు ప్రభూ”
“గాంధారీ ఏంటా మాటలు..అజ్ఞానం అప్రతిహతం అవుగాక.. ఇంతకీ అసలు చరిత్ర ఏంటి?”

“పూర్తిగా తెలీదు ప్రభూ.. శివాజీ కానీ ఔరంగ జేబు కానీ కనపడితే అడగాలి”
“ఇంకెక్కడి ఔరంగ జేబు.. ఎప్పుడో సభకు నమస్కారం పెట్టేసాడు కదా?”
“అవును ప్రభూ.. అడుగుదామంటే ఇప్పుడు వాళ్ళెవరూ లేరు”
“మన స్టోరీ రాసినట్టుగా ఎవరైనా రైటర్ వాళ్ళ స్టోరీ కూడా రాసి బైండు పుస్తకాలు చేయించి ఉంటారుగా.. అది చూస్తే తెలిసిపోతుందిగా”

“ఇప్పుడు జనులు ఆ పుస్తకాలు ఫాలో అవ్వడం లేదు ప్రభూ.. ముఖ పుస్తకం మాత్రమే ఫాలో అవుతున్నారు”
“సర్శర్లే.. అసలే కళ్లుండీ లోకాన్ని చూడలేకపోతున్నారు అని మనకు మార్కెట్లో బాగా టాక్ ఉంది.. కళ్ళుండి వీళ్ళు ఏది నిజమో..ఏది అబద్ధమో తెలుసుకోకుండా ఇంత గుడ్డిగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అస్సలు అర్ధం కావటం లేదు గాంధారీ.. అయినా మనకెందుకు వచ్చిన గొడవలే కానీ కొద్దిగా ఆ గంత పక్కన జరిపి ఆ లైకు బటన్ ఎక్కడుందో చూసి నా వేలు ఒత్తు.. ఆలాగే ఎందుకైనా మంచిది మన స్టోరీ కూడా ఓ చేయి తిరిగిన రైటర్ చేత ఫెయిర్ చేయించి హాలో మార్క్ వేసి ఏ గూగుల్ లోనో..వికీ పీడియా లోనో అప్లోడ్ చేయించమని బిళ్ల భటులకు చెప్పు.. లేకపోతే ధృతరాష్ట్రుడు ఊటీలో శ్రీదేవితో డాన్స్ చేసేవాడని రాసినా రాసేస్తారు”
“చిత్తం ప్రభూ”
***
నోట్: చావా సినిమా చూసి కొన్ని రోజులుగా ఎఫ్ఫ్బిలో అనుకూలంగా కొన్ని రైటప్ లు.. వ్యతిరేకంగా కొన్ని రైటప్ లు చూసిన తర్వాత ఇలా సెటైరికల్ గా రాయాలనిపించింది
ఎవరి మనోభావాలు అయినా నొప్పిస్తే క్యంతవ్యుడ్ని…దేశ వ్యాప్తంగా ఇంత చర్చలు జరిగిన నేపథ్యంలో ఇకనైనా చరిత్రను యెటువంటి వక్రీకరణలు లేకుండా వాస్తవాలకు కించిత్తు చెద పట్టకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వాల మీద..పురావస్తు శాఖ మీద ఉంది. 

సాక్షాత్తు వికీ పీడియాలో చరిత్ర వక్రీకరించారని ఓ ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని కేసులు పెట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. కొన్ని వందల ఏళ్ళ క్రితం జరిగిన సంఘటనల్లో ఏది నిజమో.. ఏది అబద్దమో ఆ కాలంలో చూసి చెప్పగలిగిన వాళ్ళు ఎవరూ ఇప్పుడు మన మధ్య లేరు.. భావి తరాలకు అసలు చరిత్ర తెలవడం ఎంత అవసరమో..వక్రీకరించబడ్డ చరిత్ర తెలవడం అంత అనర్థం కూడా!!

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!