Tribal Hero ……………………….
బిర్సా ముండా గిరిజనుల పాలిట హీరో. గిరిజనులు ఆయనను దేవుడిలా భావిస్తారు. బిర్సా ముండా 1875 నవంబర్ 15న జార్ఖండ్‌లోని ఉలిహతులో జన్మించారు. తన బాల్యంలో ఎక్కువ భాగం ఒక గ్రామం నుండి మరో గ్రామం తరలి వెళ్లే తల్లిదండ్రులతో గడిపాడు. బిర్సా ఛోటానాగ్‌పూర్ పీఠభూమి ప్రాంతంలోని ముండా తెగకు చెందినవాడు.
తన గురువు జైపాల్ నాగ్ మార్గదర్శకత్వంలో సల్గాలో కొన్నాళ్ళు చదువుకున్నారు. జైపాల్ నాగ్ సిఫారసు మేరకు బిర్సా జర్మన్ మిషన్ స్కూల్‌లో చేరేందుకు క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు. అయితే, కొన్ని సంవత్సరాల తర్వాత బిర్సా పాఠశాల నుండి బయటకొచ్చేసాడు.కాల క్రమంలో క్రైస్తవ మత ప్రభావాన్ని ఆయన గమనించాడు.
బ్రిటీష్ వలస పాలకుల గురించి … గిరిజనులను క్రైస్తవ మతంలోకి మార్చడానికి మిషనరీలు చేస్తున్న ప్రయత్నాల గురించి అవగాహన పెంచుకున్నాడు. బిర్సా ‘బిర్సైత్’ అనే మతాన్ని ప్రారంభించాడు. ముండా .. ఒరాన్ కమ్యూనిటీ సభ్యులు బిర్సైత్ విభాగంలో చేరడం ప్రారంభించారు తర్వాత కాలంలో ఈ బిర్సైత్ బ్రిటిష్ మతమార్పిడి కార్యకలాపాలకు సవాలుగా మారింది.
బిర్సా గిరిజన మత సహస్రాబ్ది ఉద్యమానికి నాయకత్వం వహించారు. అలాగే గిరిజన సమాజంలో ప్రబలంగా ఉన్న మూఢనమ్మకాలను తొలగించే ప్రచారాన్ని చేపట్టారు. భూస్వాముల ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించారు. 1894లో బిర్సా ముండా ఆదాయ మాఫీ కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమాన్ని ముండా తిరుగుబాటు లేదా ఉల్గులన్ అని పిలుస్తారు.
1895లో బ్రిటీష్ వారు బిర్సా ముండాను అరెస్టు చేశారు. జైలు నుండి విడుదలైన తర్వాత బిర్సా ముండా బ్రిటిష్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్‌కు వ్యతిరేకంగా గిరిజన సమాజాన్ని ఏకం చేశారు. 1899 డిసెంబరు 24న బిర్సా ముండా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ఈ నేపధ్యంలో బ్రిటీష్ వారు 1900, మార్చి 3న అతనిని అరెస్టు చేశారు. బిర్సాముండా 1900, జూన్ 9న రాంచీ జైలులో మరణించారు. ఆ సమయానికి బిర్సా ముండా వయసు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే.